ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (17:25 IST)

ఏపీలో ద్వితీయ అధికారిక భాషగా ఉర్దూ - బిల్లు ఆమోదం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీల ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. 
 
రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూను ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించేలా చేసిన సీఎం జగన్‌కు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 
 
తెదేపా ఎమ్మెల్యేలు అరెస్టు 
వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీసారా మరణాలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బుధవారం విజయవాడ నగరంలో ర్యాలీ తలపెట్టారు. అయితే, ఈ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 
 
అబ్కారీ కమిషనర్‌‍కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బస్సులో వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను ముందుగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ నుంచి కాలినడకన కమినర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వినతిపత్రం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇదిలావుంటే, కల్తీ మద్యంతో అనేక మంది మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన తెలిపారు. చేతిలో మద్యం సీసా, తాళిబొట్టు పట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం వరక్ ఊరేగింపులో పాల్గొన్నారు.