శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (10:17 IST)

'డ్యామేజ్ కంట్రోల్'కు రూ.8.15 కోట్ల ప్రజాధనం.. జీవో జారీ!

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థం ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్వీ రమణలపై ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీకోర్టుకు ఓ లేఖ రాశారు. ఈ లేఖతో జాతీయ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా దిగజారిపోయాయి. ఇలా లేఖ రాయడం ఏమాత్రం న్యాయంకాదని అనేక మంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
పైగా, పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయకోవిదులు కూడా జగన్ వైఖరిని తూర్పారబట్టారు. దీంతో జాతీయ స్థాయిలో జరిగిన డ్యామేజ్‌ను సరిచేసేందుకు ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.8.15 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇందుకోసం ఏపీ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ బుధవారం ప్రత్యేకంగా జీవో జారీచేసింది. 
 
సాధారణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ప్రభుత్వాలు ప్రసార సాధానాలకు ప్రకటనలు జారీ చేయడం సహజమే! కానీ... ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఇందులోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. పేరు - ప్రతిష్టలను కొనుగోలు చేసేందుకు సైతం ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తోంది. పైగా, 'రాష్ట్రం, రాష్ట్రానికి చెందిన నాయకుల ఇమేజ్‌ను జాతీయ వేదికపై పెంచేందుకు' అని ఈ జీవోలో పేర్కొనడం గమనార్హం.
 
సమాచార శాఖ దగ్గర బడ్జెట్‌ లేకున్నా... దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసి ఇస్తోంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ... రూ.8.15 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే... ఈ పరిణామాన్ని వైసీపీ నేతలు, అధికారులు మరోరకంగా విశ్లేషిస్తున్నారు. 
 
వైఎస్‌ జగన్‌ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసి... ఆ పత్రాలను బహిర్గతం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్యను జాతీయ మీడియా తూర్పారబట్టింది. కేసుల్లో ఉన్న జగన్‌ ఉద్దేశపూర్వకంగానే న్యాయ వ్యవస్థపై బురద జల్లుతున్నారని పత్రికలు విమర్శించాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా జగన్‌ వైఖరిని తప్పుపడుతూ కథనాలు ప్రచురించింది. దీంతో ఢిల్లీ స్థాయిలో జగన్‌ ఇమేజ్‌ బాగా దెబ్బతింది. 
 
ఇప్పుడు... 'డ్యామేజ్‌ కంట్రోల్‌'తోపాటు, ఇకపై ఇలాంటి నష్టం జరగకుండా జాతీయ స్థాయిలో బాగా 'మంచిపేరు' తెచ్చుకునేందుకే ఇలాంటి ప్రచారానికి శ్రీకారం చుట్టారని.. అందులో భాగంగానే రూ.8.15 కోట్లతో ప్రచార ప్యాకేజీ కుదుర్చుకున్నారని వైసీపీ నేతలే లోపాయికారీగా చెప్పుకొంటున్నారు. ప్యాకేజీ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బాగా పొగుడుతూ కథనాలు ప్రచురిస్తారన్న మాట!