సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
ఏపీ మంత్రిమండలి సమావేశంలో బుధవారం జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ సాగుతుంది. ఇందులో సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలుపవచ్చన్న వార్తలు వస్తున్నాయి. పాత పింఛన్ పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకునిరానున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వచ్చే 50 శాతం పింఛన్‌కు తగ్గకుండా, అలానే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేస్తున్నారు.
అదేవిధంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంత చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వేల కోట్ల రూపాయల మేర విడుదల చేయడం, ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతి వంటి అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే, మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాల, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.