ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)
ఏపీలోని పోలీసులకు, అధికారులకు వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. ఈ తెలుగు దేశం పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని, రేపు మా ప్రభుత్వం వస్తే అన్యాయం చేసిన ప్రతి పోలీసునీ, అధికారులను బట్టలూడదీసి నిలబెడతామని ఆయన హెచ్చరించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షులను కిడ్నాప్ చేసినందుకు వైకాపా నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉంటున్నారు. వంశీని మంగళవారం ములాఖత్‌లో మాజీ సీఎం జగన్ కలిసి పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. నాడు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా, అందులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అదే సత్యవర్థన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలం ఇస్తూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టందని ఆరోపించారు.
అప్పట్లో చేసిన ఫిర్యాదులో వల్లభనేని వంశీ పేరు లేదని గుర్తు చేశారు. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో వంశీ అక్కడ లేరని జగన్ చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వల్లభనేని వంశీని టార్గెట్ చేశారని జగన్ ఆరోపించారు. ఎలాగైనా వంశీని ఇరికించాలనే కుట్రతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రీఓపెన్ చేసి వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు.