మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (10:52 IST)

వైఎస్సార్, చంద్రబాబు తరహాలో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర సీఎం చేస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. వేంపల్లి శివార్ల నుంచి అల్పాహారం తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అరగంట నడక తరువాత, ఓ పెట్రోలు బంకు వద్ద ప్రజలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. వేంపల్లి శివార్ల నుంచి అల్పాహారం తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అరగంట నడక తరువాత, ఓ పెట్రోలు బంకు వద్ద ప్రజలు జగన్‌పై పుష్ప వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పాదయాత్రలో రెండో రోజైన మంగళవారం వేంపల్లె క్రాస్ రోడ్స్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరిస్తారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 
 
వైఎస్ఆర్ కాలనీ వైపు జగన్ నడుస్తూ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆపై కడప - పులివెందుల మార్గంలో మధ్యాహ్న భోజన విరామం నిమిత్తం ఆగుతారు. తిరిగి 3.30 గంటలకు నడకను ప్రారంభించి, సర్వరాజుపేట మీదుగా గాలేరు - నగరి కాలువ వద్దకు వెళ్లి, కాలువను పరిశీలించి, రాత్రి 8.30కి ప్రొద్దుటూరు రోడ్డులోని తిమ్మాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బసకు జగన్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 
 
ఇదిలా ఉంటే.. గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం కాలేకపోయిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర వల్ల సీఎం అయ్యారు. ఆ తరువాత చంద్రబాబుదీ అదే పరిస్థితి. రెండు టెర్ములు అధికారం కోల్పోయి నానా బాధలు పడిన చంద్రబాబు అతి కష్టం మీద పాదయాత్ర పూర్తి చేసి సీఎం అయ్యారు. 
    
వారిద్దరి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమో ఏమో కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కూడా ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టారు. ఏకంగా ఆర్నెళ్ల పాటు ఆయన పాదయాత్ర సాగనుంది. సుమారు 3 వేల కిలోమీటర్లు నడవడానికి జగన్ సిద్ధమయ్యారు. ఈ కృషి తనను సీఎం చేస్తుందని జగన్ నమ్ముతున్నారు. అయితే ఈడీ నుంచి కష్టాలు ఎదుర్కొంటున్న జగన్ పేరు తాజాగా ప్యారడైజ్ పేపర్స్‌లోనూ రావడంతో ఈ  పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అనుకూలిస్తుందో వేచి చూడాలి.