గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (09:35 IST)

కౌగిలించుకుని స్వీట్లు తినిపించుకుంటారు.. కానీ కూర్చొని మాట్లాడుకోలేరా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల తనదైనశైలిలో స్పందించారు. అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకిపారేసిన షర్మిల.. ఇటు తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా చురకలు అంటించారు. 
 
తన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో షర్మిల మాట్లాడుతూ, కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్‌ ఇప్పుడు తెలివిలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. 'పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు. కౌగిలించుకోవచ్చు. భోజనం పెట్టవచ్చు. స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువు (టీడీపీ అధినేత చంద్రబాబు)ను ఓడించనూ వచ్చు! కానీ, రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయితీపై మాట్లాడుకోలేరా?' అని నిలదీశారు. 
 
'కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులూ కూర్చుని మాట్లాడి, పరిష్కరించుకోలేరా? సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామనుకున్నాం. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత లేదా? 
 
గోదావరి నది మీద ఉన్న ప్రాణహిత నుంచి పోలవరం వరకు, కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టును కూడా వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా మేం అడ్డుకోం. సమన్యాయం జరగాలన్నదే మా పార్టీ లక్ష్యం' అని ప్రకటించారు.