శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:57 IST)

వైఎస్ వివేకా హత్యపై నిగ్గు తేల్చాల్చిందే.. విభేదాలు లేవండోయ్: విజయమ్మ

వైఎస్ షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్ తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మిందని వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలతో తన అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాసినట్లు షర్మిల నమ్ముతోంది కాబట్టే ఆమె తెలంగాణలో ముందడుగు వేస్తోందన్నారు. తన ఇద్దరు బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలని దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయని.. అది ఏనాటికీ జరగని పని అని హితవు పలికారు. 
 
పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు ముఖ్యమని వైఎస్ జగన్ భావించారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ను తెలంగాణలో నడిపించడం కుదరదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజాసేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుందని.. ఇవి వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు కావన్నారు.
 
వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేశారో కచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందేనని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఇది తన మాటతో సహా జగన్, షర్మిల మాట అని.. ఇందులో మా కుటుంబంలో ఎవరికీ రెండో అభిప్రాయంలేదన్నారు. వివేకానందరెడ్డి హత్యపై వస్తోన్న ఆరోపణలు సహా విమర్శలపై ప్రజలకు వైఎస్ విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలన్నదే సునీత డిమాండ్ చేస్తున్నారని.. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఇదేనన్నారు. ఈ విషయంలో మా అందరి మద్దతు సునీతకు ఉంటుందన్నారు.
 
చంద్రబాబు సీఎంగా ఉండగానే వైఎస్ వివేక హత్య జరిగిందని.. హత్యలో అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పుడు భాజపాలో ఉన్న ఆయన్ను పక్కన పెట్టుకుని పవన్ విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తుందని.. హత్య కేసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. సీబీఐ విచారణ వేగంగా చేయాలని సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాసినట్లు ఆమె గుర్తు చేశారు.