సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:58 IST)

రాష్ట్రాన్ని జగన్ ఐపి పెడతాడు, ఆ రోడ్డుపై ప్రయాణిస్తే రాజీనామా చేస్తాడు: తులసి రెడ్డి

తిరుపతి ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్సలే కాదు వ్యక్తిగత విమర్సలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టిడిపి.. వైసిపినే కాదు బిజెపి కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థిని రత్నప్రభ ఒక్కటే ప్రచారం నిర్వహిస్తుంటే మిగిలిన నాయకులందరూ ఒక్కో ప్రాంతంలో పర్యటిస్తూ ప్రచారంలో బిజిబిజీగా ఉన్నారు.
 
అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో 16 సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కూడా ఎన్నికల కదనరంగంలోకి దిగింది. మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
 
అయితే అన్ని పార్టీల నుంచి రాష్ట్ర, కేంద్రనాయకులు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఇద్దరు నాయకులు వచ్చారు. అందులో మొదటి వ్యక్తి శైలజానాథ్, రెండవ వ్యక్తి తులసిరెడ్డి. వీరిద్దరు ప్రచారం చేయకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు.
 
అయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాత్రం తీవ్రస్థాయిలో జగన్ పైన మండిపడ్డారు. రాష్ట్రాన్ని త్వరలో ఐపి పెట్టేందుకు సిఎం జగన్ సిద్థమవుతున్నారని.. ఇక కొన్ని రోడ్లపైకి వచ్చి జగన్ ప్రయాణిస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేస్తాడంటూ ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రానికి బిజెపి శనిగ్రహంలా.. జగన్ కేతువులా తయారయ్యారన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెప్పారని ప్రశ్నించారు తులసిరెడ్డి. రాష్ట్రంలో ప్రత్యేక హోదా మగిసిన అధ్యాయం.. పుదుచ్చేరిలో తెరిచిన అధ్యాయమా అంటూ ప్రశ్నించారు తులసిరెడ్డి. మొత్తం మీద నేతల విమర్సలతో తిరుపతి ఉప ఎన్నికలు వాడివేడిగా మారాయి.