శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (18:45 IST)

ఈటలకు తెరాసలో అన్యాయం : తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌పై తీర్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈటలకు తెరాస పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పైగా, ఈటలను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. 
 
ఇటీవల తెలంగాణాలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈటలకు తెరాసలో అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమన్నారు. 
 
ఈటలకు జరుగుతోన్న అన్యాయాన్ని గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేశారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే .. మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయారని ప్రశ్నించారు. 
 
బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, తమ సిద్ధాంతాలు వేరని తెలిపారు. తాను కులానికి చెందిన వ్యక్తిని కాదని దయచేసి తనపై కుల ముద్ర వేయొద్దని సూచించారు. ఇకపోతే, కాంగ్రెస్ నేత రేవంత్, వైఎస్ షర్మిల డబ్బులు నాకెందుకు? నాకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారు. నా అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే.. 5 కోట్లు జమ అవుతాయన్నారు.
 
బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసస్తే ఉండదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపునిస్తున్నాను. 45 కేజీల సీఎం కేసీఆర్ శరీరంతో నాకు ద్వేషం లేదు. ఆయన మెదడు తీసుకునే నిర్ణయాలనే నేను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.