శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (16:43 IST)

వివేకా హత్య కేసు : మరో ముగ్గురు నిందితులు? ఎవరీ సునీల్ యాదవ్!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణను స్వీకరించిన సీబీఐ.. దర్యాప్తును వేగవంతం చేసింది. గత 59 రోజులుగా అధికారులు కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా ప్రత్యేకంగా విచారిస్తున్నారు. 
 
బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ఈ కేసులో అనుమానితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడిని సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల కోర్టుకు తరలించారు. 
 
మేజిస్ట్రేట్‌ ఎదుట సునీల్‌ యాదవ్‌ను హాజరుపరిచి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది. సునీల్ యాదవ్‌ను సీబీఐ గోవాలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, కడప కేంద్ర కారాగారంలో ఇదే కేసుకు సంబంధించి వైఎస్‌ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఉమాశంకర్‌ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సునీల్‌తోపాటు ఈ ముగ్గురిని ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
 
ఎవరీ సునీల్‌కుమార్‌ యాదవ్‌? 
ఇదిలావుంటే, ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సునీల్ యాదవ్ పేరు ఒక్కసారిగా రాష్ట్రంలో మార్మోగిపోయింది. దీంతో ఈ సునీల్ యాదవ్ ఎవరన్న దానిపై అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేశారు. 
 
జిల్లాలోని పులివెందుల మండలం మోటునూతలపల్లెకు చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి కుటుంబం ప్రస్తుతం భాకారాపురంలో నివాసం ఉంటోంది. కృష్ణయ్య స్థానిక ఆటోఫైనాన్స్‌లో వాటాదారుగా ఉన్నారు. ఈయన కుమారుడే సునీల్‌కుమార్‌ యాదవ్‌.  ఇసుక రీచ్‌లో పనిచేసేవాడు. 
 
ఈ క్రమంలో తొండూరు మండలం రావులకొలనులో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డికి సంబంధించిన పొలాలను పర్యవేక్షించే ఉమాశంకర్‌ రెడ్డితో సునీల్‌కు స్నేహం ఏర్పడింది. అతడి ద్వారా వైఎస్‌ వివేకాకు సునీల్‌ కుటుంబం మొత్తం దగ్గరైంది.
 
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తొలుత సిట్, ఆ తర్వాత సీబీఐ సునీల్‌ను, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కిరణ్‌కుమార్‌ను పలు మార్లు విచారించింది. సునీల్‌ను సీబీఐ ఢిల్లీలోని తమ కార్యాలయంలో నెల పాటు ఉంచింది. 
 
దీంతో సీబీఐ తనతోపాటు తన కుటుంబ సభ్యులను విచారణకు పిలిపించి వేధిస్తోందని సునీల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనికి సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టులో పిటిషన్‌ వేసినప్పటి నుంచి గోవాలోనే సునీల్‌కుమార్‌ యాదవ్‌ మకాం వేశాడు. దీంతో విచారణకు సహకరించకపో వడంతో అతడిని అనుమానితుడిగా నిర్ధారించిన సీబీఐ అరెస్టు చేసింది.