సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:20 IST)

సీబీఐ కస్టడీలోకి వైఎస్ భాస్కర్ రెడ్డి - ఉదయ కుమార్ రెడ్డి

bhaskar reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ ఆరు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు బుధవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకుని, సాయంత్రం ఐదు గంటల వరకు వీరి వద్ద విచారణ జరుపనున్నారు. 
 
మరోవైపు, బుధవారం ఉదయం ఉదయ్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే ముందు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనతో పాటు భాస్కర్ రెడ్డిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత వీరిద్దరిని విచారణ కోసం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే కోఠి సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి, ఉదయం కుమార్ రెడ్డిలను కలిపి విచారిస్తామని సీబీఐ అధికారులు ఇప్పటికే చెప్పిన విషయం తెల్సిందే. ఇపుడు అవినాష్ రెడ్డి కూడా అక్కడ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.