ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (07:56 IST)

నా ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించండి : హైకోర్టులో పిటిషన్

lovers
తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించాలని కోరుతూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గుజరాత్ హైకోర్టులో దాఖలైంది. తాను ప్రేమించిన యువతిని, ఆమె తల్లిదండ్రులు బలవంతంగా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే, ఆమె మాత్రం తన భర్తకు దూరమే ప్రియుడితోనే సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ చట్టబద్ధంగా వివాహం చేసుకునేందుకు వీలుగా మొదటి భర్త నుంచి తన ప్రియురాలికి విముక్తి కల్పించాలని ప్రియుడు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.
 
గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గతంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు కూడా ఆ వ్యక్తిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అమ్మాయి కుటుంబ సభ్యులు బలవంతంగా మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. దీన్ని ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. అదేసమయంలో కొన్నాళ్ల తర్వాత ఆ యువతి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో ఆమె భర్తను వదిలివేసి పుట్టింటికి వెళ్లకుండా నేరుగా తన ప్రియుడి వద్దకు వచ్చి సహజీవనం చేయసాగింది. సహజీవనం చేసే ముందుగా వారిద్దరూ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన ఆ యువతికి నచ్చజెప్పి ఆమెను తీసుకెళ్లి తిరిగి భర్తకు అప్పగించారు. దీంతో ప్రియుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన ప్రియురాలని ఆమె భర్తనుంచి విడిపించాలంటూ కోర్టును ప్రాధేయపడ్డాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా భర్త చెరలో ముగ్గిపోతుందని, ఆమెను భర్త నుంచి విడిపించి, తనకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరాడు. 
 
దీనిపై గుజరాత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆమె భర్త ఆధీనంలో ఉంటే దాన్ని అక్రమ నిర్బంధం అనలేమని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసం... ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోలేదని, అందువల్ల ఆమె అక్రమ నిబంధంలో ఉన్నట్టు భావించలేమని స్పష్టం చేస్తూ, సహజీవన ఒప్పందం అంటూ కోర్టుకు వచ్చిన సదరు పిటిషన్‌దారునికి రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పును వెలువరించింది.