శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:55 IST)

బాలకృష్ణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : ఇక్బాల్

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజీనామా చేసి ఎన్నికల్లో తనతో పోటీపడాలని, ఓడిపోతే రాజకీయాలను వదిలేసి, హిందూపురం వదిలి వెళ్లిపోతానని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ సవాల్‌ విసిరారు. 
 
ఆయన పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వరుస ఓటములతో కుదేలవుతుండటంతో, ప్రజల్లో అభాసుపాలవుతామనే భయంతోనే మాజీ సీఎం చంద్రబాబు పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడారన్నారు. 
 
కుప్పం నుంచి హిందూపురం వరకు ఎన్నికల్లో ఓడిపోయినా, ఆత్మ విమర్శ చేసుకోకుండా, ఇంకా సమర్థించుకోవడానికి తెదేపా నాయకులు ప్రయత్నించడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 
 
వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేకుండా తెదేపా సత్తా ఏంటో తెలుసుకునేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బహిరంగ సవాల్ విసిరారు.