శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 3 జులై 2019 (20:04 IST)

మందబలంతో తప్పుడు కేసులు పెట్టి వేధించారు: కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి ఫైర్

రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నేరమయం చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి నేర రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎలక్ట్రోరల్‌ రిఫార్మ్స్‌ పైన బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. 
 
కాంగ్రెస్ పార్టీ మందబలంతో ప్రత్యర్థులను అణిచివేయాలని చూసిందని ఆరోపించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన చరిత్రలో ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటంతో పాటు నిందితులుగా క్రియేట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. 
 
విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు అడుగడుగునా అడ్డు తగిలారు ఎంపీలు జైరాం రమేష్, బీకే హరిప్రసాద్‌లు. మరోవైపు నిజమైన ప్రజాస్వామ్యానికి, సమసమాజ సాధనకు ఎన్నికల్లో సంస్కరణలు అత్యంత అవసరం అని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్‌ రోల్స్‌పై పారదర్శకత, విశ్వసనీయత అవసరమన్నారు. 
 
బూత్‌ లెవల్‌ అధికారులకు ఎన్నికలపై సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌ ఎలక్షనీరింగ్‌ జరగాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని, ఎన్నికలకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.