శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (12:15 IST)

నారావారిపల్లెలో అమరావతి పంచాయతీ.. హాజరుకానున్న ఆరుగురు మంత్రులు

రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నో రకాలైన ఆందోళనలు చేస్తున్న ఏపీలోని వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేలా లేదు. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం రీ లొకేషన్ పేరుతో చీకట్లో జీవోలు జారీచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మంత్రులు మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా తొలి సభను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆరుగురు మంత్రులు హాజరుకానున్నారు. 
 
ఈ సభను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, దాని వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వైసీపీ నేతలు వివరించి చెప్పనున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసనకు దిగారు. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు.