గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:22 IST)

అధికారం అనుభవించి ఆఖర్లో పార్టీ మారడం ఇష్టం లేదు : వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

kotamreddy
ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఎన్నికల సమయంలో పార్టీ మారడం ఇష్టం లేదని నెల్లూరు గ్రామీణ వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మరోమారు అధికార వైకాపా నేతలపై మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం ఇష్టం లేదు. అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డాను అని వెల్లడించారు. పార్టీకి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి అండగా నిలుస్తున్న తన అనుచరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వాటిని లెక్క చేయకుండా తన వెన్నంటి నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని వెల్లడించారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేపించిన తర్వాత తన రాజీనామా అడగాలని సూచించారు. దీన్ని స్పీకర్ ఆమోదించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్‌కి పంపితే అప్పుడు తాను స్పందిస్తానని వెల్లడించారు.
 
ఇరుకళల అమ్మవారి జాతర నిర్వహణకు అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తానని ఇందులో కూడా రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటానన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్ష అని, నిర్ణయం తీసుకోవాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.