మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (09:35 IST)

సైకిలెక్కనున్న విజయసాయిరెడ్డి బామ్మర్ది...? జగన్ షాక్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కుడిభుజం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బామ్మర్ది తేరుకోలేని షాకిచ్చారు. ఈయన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో విజయసాయి రెడ్డి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి సోమవారం అర్థరాత్రి అమరావతిలో సమావేశమయ్యారు. ఈ విషయం బయటకు పొక్కగానే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పైగా, వచ్చే ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ఆయన కోరినట్టు వినికిడి. 
 
ద్వారకానాథ్ రెడ్డి 1994లో లక్కిరెడ్డిపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జగన్‌ వెంట నడిచి వైసీపీలో కొనసాగుతున్నారు. రెండుసార్లు రాయచోటి టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికే దక్కింది. దీంతో అప్పట్లోనే ఆయన పార్టీ మారాలనుకున్నారు. 
 
కానీ, బావ విజయసాయి రెడ్డి బుజ్జగించడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, ఈసారి ఎలాగైనా వైసీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేసినా సిటింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించడంతో దారకానాథ్ రెడ్డి నిరాశ చెందారు. వైసీపీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సొంతగా ప్రచారం కూడా ప్రారంభించారు. 
 
అదేసమయంలో టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి చొరవతో సోమవారం అర్థరాత్రి అమరావతిలో సీఎంను కలిశారు. రాయచోటి టికెట్‌ ఇవ్వాలని అడిగారు. ముందు పార్టీలో చేరండి.. నియోజవర్గ నేతలతో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అయితే, ద్వారకానాథ్ రెడ్డి రాకను స్థానికంగా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.