1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Horoscopes: September 06 -September 12, 2026

06-09-2026 నుంచి 12-09-2026 వరకు వార ఫలితాలు - ఆశించిన ధనం అందుతుంది

Weekly Horoscope
Weekly Horoscope
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో పురోగమిస్తారు. ఆశించిన ధనం అందుతుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. లావాదేవీల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. మీ జోక్యం వల్ల ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇరువైపులా సముచిత సలహాలు ఇస్తారు. గురువారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అపరిచిత వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. మీ శ్రీమతి వద్ద నుండి శుభవార్తలు, సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులకు సన్నిహితులు అవుతారు. బాధ్యతల స్వీకరణకు అనుకూలం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నాలు కొనసాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. రుణ ప్రయత్నానికి అవకాశం లేదు. పరిచయస్తులను కలుసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉద్యోగయత్నం తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించవద్దు. ఆత్మీయులతో కలిసి సంచరిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. సవరణలు అనుకూలించవు. శనివారం నాడు ఇతరులతో మితంగా సంభాషించండి. మీ మాటలను కొందరు వక్రీకరిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సమసిపోతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రయాణం తలపెడతారు.
 
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహస్థితి అనుకూలం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోమవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. సొంత వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లకు నేర్పుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. అధికారాలను చేజిక్కించుకుంటారు. అభీష్టాలు ఫలిస్తాయి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. అనుభవజ్ఞుల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆత్మీయులతో గడుపుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలనే కొనసాగించండి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సానుకూల దృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం శ్రేయస్కరం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని భయం వెన్నాడుతుంది. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి మాట మనస్తాపం కలిగిస్తుంది. ఈ చికాకులు తాత్కాలికమే, త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ప్రతిఘటనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారం నాడు పనులు ఒత్తిడితో సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీపై ఇతరుల ప్రభావం అధికం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వీలైనంత వరకు ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఊరటనిస్తాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. గృహంలో అకాల భోజనం. ఆచితూచి అడుగేయండి. మీ నిర్ణయం వాయిదా వేయడం శ్రేయస్కరం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు ఆటంకంగా సాగుతాయి. గురువారం నాడు రావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. కొత్త పరిచయస్తులు అండగా నిలుస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినీయవు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అధికారులకు స్థానచలనం. అనారోగ్య సమయంలో దూరప్రయాణం తగదు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శుక్రవారం నాడు దంపతుల మధ్య స్వల్ప కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానానికి శుభయోగం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. అధికారులకు హోదా పెరుగుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
అన్ని రంగాల వారికి యోగదాయకం. మాట నిలబెట్టుకుంటారు. ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగ విధులను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు అదనపు బాధ్యతలు, విద్యార్థులకు పురస్కారం అందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఈ వారం కొంతవరకు ఆశాజనకం. పరిస్థితులు మెరుగుపడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. శుభవార్తలు అందుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అంచనాలు ఫలించవు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మీ సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశాజనకం. ప్రయాణం విరమించుకుంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఖర్చులు విపరీతం. సోమవారం నాడు పెద్ద ఖర్చుకు ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. చేపట్టిన పనులు ఆటంకం మీద పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ యత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
05-09-2026 శనివారం దినఫలాలు - ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి...