బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2024 (11:43 IST)

ఆంధ్రప్రదేశ్: సోషల్‌ మీడియాలో రాజకీయ యుద్ధాలు, జుగుప్సాకర పోస్టులు, ఈ పరిణామాలకు కారణమేంటి?

Jagan_Babu
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయ వివాదం నడుస్తోంది. వైసీపీ కార్యకర్తలతో పాటు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీకి చెందిన వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి, పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులపై ‘‘అసభ్యకర భాష’’లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది వర్రా రవీందర్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ. వైసీపీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మీద కేసులు పెట్టారు. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు అయింది. ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి.
 
కేసులు ఎందుకు?
చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వంగలపూడి అనిత తదితరులపై వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా చేసిన ‘‘అసభ్యకర కామెంట్లు, పోస్టుల’’ మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. సుమారు 680 మందికి నోటీసులు ఇవ్వగా 147మంది మీద కేసులు నమోదు చేశారని, 50 మందిని అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ,అధికారికంగా పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలూ చెప్పలేదు. ‘‘కేసులన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి పూర్తి వివరాలు వారం పది రోజుల్లో వెల్లడిస్తాం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి బీబీసీకి తెలిపారు. ఎన్నికలకు ముందు విడుదలైన వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారని రాంగోపాల్‌ వర్మ మీద కేసు నమోదు అయింది.
 
పోసాని, శ్రీరెడ్డిపై కేసులు
చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాలలో అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేయడంతోపాటు పవన్ కల్యాణ్ గురించి అసభ్యకరంగా మాట్లాడారని శ్రీరెడ్డి మీద ఫిర్యాదులు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌తో పాటు చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ పాలనలో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పని చేసిన సినీనటుడు పోసాని కృష్ణ మురళి మీద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెట్టారు.
 
వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై కేసులు
వైసీపీ హయాంలోనూ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరుల మీద కేసులు నమోదయ్యాయి. 2020లో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వ స్పందనను తప్పుబడుతూ ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఫార్వార్డ్‌ చేసినందుకు టీడీపీ సానుభూతిపరురాలు, గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ మీద కేసు పెట్టారు. 2020లో కరోనా సమయంలో నాటి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌లపై అనుచిత వ్యాఖ్యలతో వచ్చిన వార్తా కథనాన్ని ఫార్వార్డ్‌ చేశారంటూ విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు నలందకిశోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
 
2023లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఫోటోను మార్ఫింగ్‌ చేసి కించపరిచారంటూ గుంటూరుకి చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అసభ్యకర పోస్టులు పెట్టేది మీ వాళ్లంటే మీ వాళ్లు అని నిందలు వేసుకుంటున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబం మీద టీడీపీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆయా జిల్లాలల్లో ఫిర్యాదులు చేశారు. వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పాలనలోని లోపాలను ప్రశ్నిస్తున్నందుకే తమ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు.
 
‘‘తాను (చంద్రబాబు నాయుడు) చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా అన్యాయంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు’’ అని జగన్ ట్వీట్ చేశారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అండతో రెచ్చిపోయిన వారి మీద చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
 
ఎలా మొదలైంది?
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30ఏళ్ల కిందటే రాజకీయాల్లో వ్యక్తిత్వాలను కించపరిచేలా మాట్లాడటం మొదలైందని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు అన్నారు. కొందరు రాజకీయ నేతలు తమ అనుకూల పత్రికల ద్వారా ఇతర నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారని, అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రధాన మీడియా సంస్థల పత్రికలు, టీవీ చానెళ్లను వాడుకుంటున్న తరుణంలో సోషల్‌ మీడియా వచ్చింది. సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగిన తరువాత మెల్లగా రాజకీయ నేతలు వాటిని వేదికగా చేసుకోవడం మొదలు పెట్టారు. ఇతరులను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్‌ మీడియాను ఆయుధంగా వాడటం మొదలు పెట్టారు.’’
 
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది రాన్రాను మరింత దిగజారుతూ వచ్చింది. చివరకు ప్రజలు గౌరవప్రదంగా జీవించే హక్కును సోషల్‌ మీడియా కాలరాసే పరిస్థితి తెచ్చింది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కారణం’’ అని బీబీసీతో కృష్ణంరాజు అన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు సంస్థాగతంగా తమ పార్టీలను నిర్మించుకుంటూ వస్తాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆ కమిటీలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ, ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు సంస్థాగత కమిటీల కంటే సోషల్‌ మీడియా సైన్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పార్టీకి బలమైన పునాదిగా భావిస్తూ ఆయా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా బృందాలను సమకూర్చుకుంటున్నాయి. అందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. తమ పార్టీ సిద్ధాంతాలను, భావజాలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం అనే దశను దాటి ప్రత్యర్థుల వ్యక్తిగత సంబంధాల మీద, ఇంట్లో వాళ్లపై జుగుప్సాకరంగా మాట్లాడే స్థితికి ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దిగజారింది.
 
‘‘హద్దులు దాటి..’’
‘‘ఏపీలో రాజకీయ యుద్ధాలు బయట కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభిమానులు ముసుగు ముఖాలు వేసుకుని తమ పార్టీల తరపున చెలరేగిపోతున్నారు. అసత్య ప్రచారాలు హద్దులు దాటేసి మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోల స్థాయికి ఎదిగాయి’’ అని తెలుగు డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ అధ్యక్షుడు లలిత్‌కుమార్‌ బీబీసీతో అన్నారు. ‘‘రాజకీయ విమర్శల పేరుతో మహిళలను కించపరచడం, దూషించడం యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నేతల కుటుంబాలను, మహిళలను టార్గెట్‌ చేయడం అలవాటైపోయింది’ అని లలిత్‌కుమార్‌ అన్నారు.
 
మేం టార్గెట్‌ చేయలేదు: టీడీపీ
‘‘మేం వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేయలేదు. సమాజంలో చీడపురుగులను ఏరుతున్న క్రమంలో దొరుకుతున్న వారంతా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే ఉంటున్నారు తప్పించి మేం లక్ష్యంగా చేసుకోలేదు’’ అని బీబీసీతో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ చైర్మన్‌ కె. పట్టాభి చెప్పారు. ‘‘సోషల్‌ మీడియా దుష్టశక్తులను ఏరి వేయడం సామాజిక బాధ్యత. ప్రజలందరూ ఇప్పుడు హర్షిస్తున్నారు. ఈ వ్యక్తిత్వ హననం వల్ల రాజకీయ పార్టీల నేతలే కాదు సామాన్య ప్రజలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిని ఏరివేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా అవసరం’’ అని పట్టాభి చెప్పారు.
 
టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల మీద ఆరోపణలు వస్తున్నాయి కదా? అని ప్రశ్నించినప్పుడు ‘‘టీడీపీ యాక్టివిస్టులు ఎప్పుడూ మహిళలను టార్గెట్‌ చేయరు. టీడీపీ ముసుగులో వైరిపక్షాలకు చెందిన వాళ్ళు చేస్తారేమో గానీ టీడీపీ సిద్ధాంతంలోనే అది లేదు’’ అని పట్టాభి అన్నారు. పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో నీచమైన పోస్టులను ప్రోత్సహించరని జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ‘‘తమ పార్టీ అభిమానులు సామాజిక కట్టుబాట్లు తప్పి నీచంగా పోస్టులు పెట్టినా కనీసం ఎప్పుడూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించలేదు. దాని ఫలితమే ఇవాళ అరెస్టులు. జగన్‌ అప్పుడే అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?’’ అని సత్యనారాయణ ప్రశ్నించారు.
 
ఎన్నికలకు ముందు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘‘సైకో జగన్‌ పోవాలి’’ అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై ఎన్ని కేసులు పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌ బాబు అన్నారు. ‘‘మా పార్టీ ఎప్పుడూ ఎవరిని ద్వేషించమని, దూషించమని చెప్పలేదు. తమ నాయకుడు జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మనస్తాపానికి గురైన పార్టీ అభిమానులు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయంలోనే కూర్చొని ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలం ఉపయోగించారు. మరి వాటిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తాట తీస్తాను, తోలు తీస్తాను, అంతు చూస్తాను అని ఎన్నోసార్లు అన్నారు మరి అలాంటి పదాలు వాడొచ్చా?’’ అని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు.
 
తప్పుడు ప్రచారాలపై కేసులు : సైబర్‌ పోలీసులు
సోషల్‌ మీడియా యాక్టివిస్టులు జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు ప్రచారాలకు పాల్పడితే ఏదో చిన్న కేసుతో పోదని జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బీఎన్‌ఎస్‌(భారతీయ న్యాయ సంహిత)తోపాటు, వివిధసెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు. చిన్నపిల్లలను ఇబ్బందికి గురి చేసినట్టుగా పోస్టులు ఉంటే పోక్సో చట్టం సెక్షన్‌ 57-బీ కింద.. బాధితులు దళితులు, గిరిజనులైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని అంటున్నారు.
 
అలాగే గ్రేవ్, నాన్‌ గ్రేవ్‌ కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. గ్రేవ్‌ అంటే నాన్‌ బెయిలబుల్‌ కేసులు అని వివరించారు. అందుకే సోషల్‌ మీడియా పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని విజయవాడలోని సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ అధికారి బి. గుణరాం వెల్లడించారు. ‘‘సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లోనే నేరుగా కేసు నమోదు చేసేందుకు 2021 నుంచి అనుమతి వచ్చింది. రాష్ట్రంలో విజయవాడ, వైజాగ్‌లలోనే సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి.. మిగిలిన చోట్ల ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఐటీ కోర్‌ టీంలు ఏర్పాటు చేశారు’’ అని ఆయన వివరించారు. ‘‘సోషల్‌ మీడియా పోస్టులను తేలికగా తీసుకోవద్దు. వాటిని ఎవిడెన్స్‌గా పరిగణిస్తారు. ఒకవేళ పోస్ట్‌ పెట్టి వెంటనే డిలీట్‌ చేసినా అది కూడా రికార్డ్‌ అయి ఉంటుంది’’ అని పోలీసులు చెబుతున్నారు.