బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (21:32 IST)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

marriage
పెళ్లి అనే ఒకే ఒక్క తంతు... కష్టపడి నిర్మించుకున్న కెరీర్, జీవితాన్ని పేక మేడలా కూల్చేసింది. పూర్తిగా కూల్చేసినా పర్వాలేదు, తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. క్షణక్షణం నరకం చూపిస్తూ ఒక మెట్టు ఎక్కుతుంటే పది మెట్లు కిందకి లాగుతూ చిద్విలాసంగా మారిపోయింది నా జీవితం. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన ఒక వ్యక్తి మాటలు.. ఒక అమ్మాయి రాక తన జీవితాన్ని ఎలా మార్చేసిందో ఆయన మాటల్లోనే.. ‘‘పెళ్లి అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి కోరికలు ఉంటాయో నాకూ అలాంటి ఆలోచనలే ఉన్నాయి. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న హెడ్ మాస్టర్.
 
మాస్టర్ గారి అబ్బాయి అంటే, స్కూల్‌లో అందరూ మన వైపు చూస్తారు. చదువులోనైనా, ప్రవర్తనలోనైనా! ఎవరితోనూ మాట పడకూడదు, చదువులో వెనకపడకూడదు, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అలాగే పెరిగాను కూడా. తప్పు చేస్తే, నాన్న పరువు ఎక్కడ పోతుందో అని గుడ్ బాయ్‌లా ఉండాల్సిందే. నలుగురిలో పరువు పోకూడదనే ఆలోచన, రాముడు మంచి బాలుడు అని అనిపించుకోవాలనే తపన. ఇవన్నీ జీవితంలో ప్రతీ అడుగు ఆచితూచి వేసేలా చేశాయి. కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే, దానిని జీవితం అని ఎందుకు అంటాం? పెళ్లి నా జీవితాన్నే తలకిందులు చేసేస్తుందని అనుకోలేదు. మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. ఎంటెక్ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం రాగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. నా ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైటులో పెట్టారు.
 
'నన్నే ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు'
మ్యాట్రిమోనీ సైటు ద్వారా ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి తండ్రి దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగి. అమ్మాయి కూడా బాగా చదువుకున్నారు. వాళ్ళే మమ్మల్ని సంప్రదించారు. చదువుకున్న, సమాజంలో హోదా ఉన్న కుటుంబం సంబంధంగా వచ్చిందని అమ్మా, నాన్న పొంగిపోయారు. అదృష్టంగా భావించారు. అంత హోదా ఉన్న వాళ్లు నన్నెందుకు ఎంపిక చేసుకున్నారో అర్థం కాలేదు. ఆ అమ్మాయి తండ్రి మా ఇంటికి వచ్చారు. పొద్దున వచ్చి నన్ను చూసుకుని, సాయంత్రానికి సంబంధం కుదుర్చుకున్నారు. ముహూర్తాలు పెట్టేశారు. ఇదంతా జనవరి ఆఖరి వారంలో జరిగింది. ఫిబ్రవరి 24న పెళ్లి ముహూర్తం. అప్పటికి నేను అమ్మాయిని చూడలేదు. అమ్మాయిని చూడకుండా, మాట్లాడకుండా పెళ్లేంటి అని నేను పట్టు పట్టి అమ్మాయిని కలిసేందుకు వాళ్ల ఇంటికి వెళ్లాను.
 
అటువైపు నుంచి ఎటువంటి ప్రశ్నలు లేవు. నేనే నా గురించి వివరించి, నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని ఆమెను అడిగాను. మీరు నచ్చారు, మీతో జీవితం బాగుంటుందని అనిపించిందని ఆమె చెప్పారు. ఆ మాటలను నమ్మాను. నా చదువు, ఉద్యోగం నచ్చాయని చెప్పారు. ఎందుకో ప్రేమ, ఇష్టం, ఆకర్షణ ఇలాంటి భావాలేవీ కలగలేదు. అదొక నిర్లిప్త సంభాషణలా అనిపించింది. ఆలోచించే లోపు పెళ్లి పనులు మొదలైపోయాయి. పెళ్లి రోజు వచ్చేసింది. 2019 ఫిబ్రవరి 24 అర్ధరాత్రి, తెల్లవారితే ఫిబ్రవరి 25న మా పెళ్లి జరిగింది. అదే రోజున విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లాం. 26వ తేదీన తిరుపతి వెళ్లి వచ్చాం. 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఉన్నాను. మార్చి 2న తిరిగి భీమవరంలో మా ఇంటికి వచ్చాను. ఇంతలో మా అమ్మ గారికి సీరియస్ అయి మార్చి 3వ తేదీన హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అమ్మ హాస్పిటల్‌లో ఉండగానే ఆ అమ్మాయి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారు.
 
'దగ్గరికి రానివ్వలేదు'
మార్చి 5న అమ్మాయి వాళ్ల నానమ్మ చనిపోయారు. ఆవిడకు అనారోగ్యంగా ఉందనే నెపంతోనే ఈ పెళ్లి తొందరగా చేసినట్లు తెలిసింది. మేము శారీరకంగా దగ్గరవ్వలేదు. మొదటి రోజు నా దగ్గరకు రాకుండా, కాస్త టైం కావాలని అడిగింది. అది సహజమే కదా నేనెవరో తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని అనుకున్నాను. అమ్మాయి పట్ల అనుమానాలు, సందేహాలు ఏమీ రాలేదు. నాతో ఉన్న అన్ని రోజుల్లో ఆ అమ్మాయి ఎక్కువ సేపు నిద్రపోతూనే ఉండేది. పెళ్లి తంతుతో అలిసిపోయి ఉంటుందని అనుకున్నాను. ఇంతలో వాళ్ల నానమ్మ కూడా చనిపోవడంతో ఆ దుఃఖంలో ఉందని అనుకున్నాను.
 
మార్చి 13న అమ్మాయి కుటుంబం వాళ్ల ఇంటికి రమ్మని పిలిచారు. మామూలుగా కొత్త అల్లుడిలా వెళ్లాను. ఒంటి నిండా దెబ్బలతో తిరిగి వచ్చాను. ఇంటికి వెళ్లగానే వాళ్లు అడిగిన మొదటి మాట "మా అమ్మాయికి వెంటనే విడాకులు కావాలి, మీరు మమ్మల్ని మోసం చేశారు, మీరు చెప్పిన ఉద్యోగం చేయడం లేదు, మీరు చెప్పిన చదువు చదువుకోలేదు" నాపై చేసిన ఈ ఆరోపణలకు దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎదురు తిరిగాను, దీంతో ఇంట్లో అందరూ కలిసి నాపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా కొట్టారు. "ఆరోపణలు, నిందలు, దెబ్బలు"! కళ్లు తిరిగాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదే దెబ్బలతో తిన్నగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాను. కానీ, వాళ్లు ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేయలేదు. అదే దెబ్బలతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నాను.
 
‘ఇప్పుడే అసలు కథ మొదలయింది’
నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం వాళ్ల అహంకారాన్ని దెబ్బ తీసింది. నా మధ్య తరగతి స్థాయి వాళ్లకు ఆయుధంగా మారింది. ఒకే నెలలో నాపై రెండు కేసులు. 2019 ఏప్రిల్‌లో మియాపూర్‌లో ఒకటి, మరొకటి మేడ్చల్ , మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు. ఇంతటితో ఆగలేదు. జిల్లా స్థాయిలో మొత్తం 6 కేసులు పెట్టారు. దిల్లీలో 3 కేసులు పెట్టారు. ఇదంతా నన్ను వేధించాలని, కోర్టులకు తిరిగేలా చేసి విసిగించాలనే ఉద్దేశంతో చేశారని అర్థమైపోయింది. వాళ్ల దగ్గర ధన బలం, అధికార బలం రెండూ ఉన్నాయి. నా దగ్గర నిజం మాత్రమే ఉంది. నాపై వరకట్న వేధింపుల చట్టం కింద, గృహ హింస కింద 498 ఏ సెక్షన్‌లో కేసులు పెట్టారు. మరో ఫిర్యాదులో మమ్మల్నిద్దరినీ కలపండి అంటూ అభ్యర్ధించారు.
 
పంజాగుట్టలో పెట్టిన ఒక కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా సృష్టించారు. పోలీసులు నేను పెట్టిన ఫిర్యాదును నమోదు చేయలేదు. నాతో ఒక్క రోజు కూడా కలిసి జీవించని అమ్మాయికి నాపై ఇంత కక్ష ఎందుకో అర్థం కాలేదు. వారానికి నాలుగు వాయిదాలు. ఒక కోర్టు నుంచి మరొక కోర్టు.. కోర్టు మెట్లు ఎక్కడం, దిగడం.. మానసిక వేదన, ఆర్ధిక నష్టం. ఆఫీసులో ఫిర్యాదు పెట్టి ఉద్యోగం తీయించారు. పీ‌హెచ్‌డీ కూడా కొనసాగించనివ్వలేదు. ఎక్కడికి వెళ్లినా అధికారపు కబంధ హస్తం నన్ను కాటు వేస్తూ ఉండేది. మధ్యలో పోలీసులు, కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల బెదిరింపులు - సెటిల్మెంట్‌కు రావాలని, విడాకులు ఇవ్వాలని. విడాకులతో పాటు భారీగా భరణం కూడా కావాలని. విడాకులు అడిగింది వాళ్లు, భరణం నేనెందుకు ఇవ్వాలోఅర్థం కాలేదు.
 
హింసకు గురి చేయడానికి ఆ అమ్మాయి నాతో కానీ, నా కుటుంబంతో కానీ గడిపిందే లేదు. నన్ను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉంచారు. పెట్టిన కేసుల్లో ఒక కేసుకి, మరొక కేసుకి పొంతన లేదు. ఈ కేసుల్లో చాలా అసత్య ఆరోపణలు చేశారు. నోటీసులు తీసుకుంటున్న ప్రతిసారి తల పిచ్చెక్కిపోతూ ఉండేది. ప్రతిసారి నా అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి పోరాటమే. మమ్మల్ని భయపెట్టి వాళ్ల దారికి వచ్చేలా చేసుకునేందుకు నా మీద మాత్రమే కాదు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పైన, దూరపు బంధువులపైన కూడా కేసులు పెట్టారు. కేసులెందుకు, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు కదా అని అడిగితే, వాళ్లు విడాకులతో పాటు భారీగా భరణం కూడా డిమాండ్ చేస్తున్నారు. నాతో ఒక్క రోజు వైవాహిక జీవితం కూడా గడపని వ్యక్తి కోసం నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి? నేను విడాకులు కోరానా? వాళ్లు కోరారా?
 
ఒక అమ్మాయికి సంపాదన, ఆస్తి ఉన్నప్పుడు విడాకులు కోరని వ్యక్తి (భర్త) డబ్బు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో భార్య సంపాదనను కోర్టులు తెలుసుకునే అధికారం ఉందని చెప్పేందుకు ఆర్టీఐ కింద సమాచారం కోసం అభ్యర్ధన చేశాను. డబ్బెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నాను. ప్రాణాలు తీసుకోవాలని అనిపించింది. నేను అబ్బాయిని కావడంతో నా మాట అధికారులూ నమ్మలేదు. ఇంట్లో వాళ్లు పూర్తిగా కుంగిపోయారు. నేను పెట్టుకున్న లాయర్లను కూడా కొనేస్తూ ఉండేవారు. ఇక విసిగి వేసారి, విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీలో చేరాను. అప్పటికి కోవిడ్ లాక్‌డౌన్. ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. మూడేళ్లు కోర్సు పూర్తి చేశాను. న్యాయవాదులపై నమ్మకం కోల్పోయి, నా కేసులు నేనే వాదించుకోవడం మొదలుపెట్టాను, ఈ మొత్తం ప్రయాణంలో మానసికంగా, ఆర్ధికంగా, సామాజికంగా చాలా నష్టపోయాను.
 
‘విడాకులు వచ్చాయి’
గడిచిన జీవితం వెనక్కి తిరిగి రాదు. ఈ పోరాటంలో ఐదేళ్లు గడిచిపోయాయి. నా జుట్టు కూడా నెరిసింది. ఇప్పుడు నాకు 35 ఏళ్లు. నేను 400 సార్లు కోర్టు వాయిదాలకు వెళితే, ఆమె కేవలం 4 -5 సార్లు మాత్రమే హాజరైంది. ప్రతీ హియరింగ్‌లో ఆధారాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి కేసు వెనక్కి తీసుకునేవారు. ప్రస్తుతానికి చాలా వరకు కేసులు క్లోజ్ అయ్యాయి. రెండు కేసులు మాత్రం ఇంకా నడుస్తున్నాయి. 2024 మే నెలలో పరస్పర విడాకులకు ఒప్పందం చేసుకున్నాను. ఈ అక్టోబరు 15న కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. అబ్బాయి అనగానే బాధ్యతలు మోసేవాడు, తల్లితండ్రులను తానే చూసుకోవాలి, భార్యను భరించాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి. అన్ని పాత్రల్లోనూ అబ్బాయిపై ఒక ఆర్ధిక ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది.
 
నాకు జరిగిన నష్టానికి ఆమె పరిహారం ఇస్తారా? ఇవ్వదు, ఇమ్మని కోర్టు కూడా చెప్పలేదు. తప్పు చేయకుండా కోర్టు హాలులో నిలబడటం, నిర్దోషినని నిరూపించుకోవడం ఎంత కష్టమో, అనుభవించిన వాళ్లకే అర్థమవుతాయి. "అబ్బాయి తప్పు చేశాడు" అన్న దృష్టితోనే కేసు విచారణ మొదలవుతుంది. నేను కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని కూల్చడానికి వాళ్లకు ఒక్క క్షణం కూడా పట్టలేదు. ప్రస్తుతం నేనొక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ నా లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తూ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను. ప్రస్తుతానికి నాపై పెట్టిన అన్ని కేసుల్లో గెలిచాను. ఏ పోలీస్ స్టేషన్‌లో కోర్టు గుమ్మంలో అడుగు పెట్టడాన్ని తప్పుగా అనుకున్నానో వాటి చుట్టూనే తిరిగాను, అవే నా జీవితంలో ప్రధాన భాగంగా నిలిచాయి.
 
విచారకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో పురుషులకు అన్యాయం జరిగినప్పుడు, సంస్థాగతమైన మద్దతు లేదు. నేను ధైర్యం కోల్పోతే నాలాంటి ఎంతో మందికి మార్గదర్శకత్వం చూపే వాళ్లెవరూ ఉండరు. అందుకే జీవితం నేర్పిన పాఠాలతో ధైర్యంగా నిలబడ్డాను. నాలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్లకు ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశను కల్పించడమే నా ఉద్దేశం. ఇలాంటి కేసులు విలువైన కోర్టు సమయాన్ని, ప్రజాధనాన్ని కూడా నాశనం చేస్తున్నట్లే. చాలావరకు కేసుల్లో ఎప్పుడూ అబద్ధాలే ఉంటాయి. కుంగిపోకుండా పోరాడటం ఒక్కటే మార్గం.
 
నేను కుటుంబ వ్యవస్థకు, మహిళలకు వ్యతిరేకిని కాదు. కానీ, పెళ్లి, అమ్మాయిలంటే మాత్రం విరక్తి వచ్చింది. ఇది కేవలం నా జీవితానికి సంబంధించిన విషయం. నా దగ్గరకు వచ్చే వాళ్లకు సర్దుకుని కలిసి ఉండమనే సలహాలిస్తాను. ఒక వ్యక్తి సమగ్రాభివృద్ధిలో కుటుంబం పోషించే పాత్రను తక్కువ అంచనా వేయలేం. సమాజంలో కుటుంబ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం. నేను, నా జీవితం, నా వ్యక్తిత్వం అనుకోవడం కంటే.. మనం, మన కుటుంబం, మన సమాజం అనుకోవడం వ్యక్తికీ, సమాజానికీ కూడా మేలు" అని ఆయన అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక ఏడాది పాటు దిల్లీలో నిర్వహించిన అధ్యయనంలో.. ప్రతీ 1000 మంది పురుషుల్లో 515 మంది గృహ హింసను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇందులో 49.6 శాతం మంది మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.
 
మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నప్పుడు గృహ హింస నిరోధక చట్టం 2005 కింద కేసు నమోదు చేయవచ్చు. కానీ, పురుషుల కోసం ప్రత్యేకమైన చట్టం లేదు. భర్త భార్యను హింసిస్తే, సెక్షన్ 498 ఏ కింద మహిళ కేసు పెట్టవచ్చు. కానీ, ఈ చట్టంలో పురుషుడు స్త్రీ పై కేసు పెట్టేందుకు చట్టపరమైన వెసులుబాటు లేదు. ‘‘భారతదేశంలో గృహహింస చట్టం కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా గృహహింస చట్టం 2005 ప్రకారం కొన్ని కోర్టు ఆదేశాలు కూడా స్త్రీలకు ఇవ్వడం కుదరదు" అని హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల్ చెప్పారు. "స్త్రీలకి ఉన్నట్లుగా పురుషులకి ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేవు. ఇలాంటి ప్రత్యేకమైన చట్టాలు పురుషులకు లేకపోవడం సమంజసంగా అనిపించదు. ఉదాహరణకు ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 69 కూడా కేవలం స్త్రీల పక్షాన ఉంటుంది".
 
"గృహహింసకు గురైన పురుషులు వారికి జరిగిన అన్యాయాన్ని కేవలం శిక్షాస్మృతి (కొత్తగా భారతీయ న్యాయ సంహిత) ప్రకారమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలో కూడా కేవలం శారీరకంగా జరిగిన హింసకు మాత్రమే పలు వెసులుబాట్లు ఉన్నాయి కానీ వేరే రకమైన హింసకు సరైన చట్టబద్ధమైన వెసులుబాట్లు లేవు అనే చెప్పాలి" అని అన్నారు. "అలా ఉన్నప్పటికీ, సివిల్ కోర్టులో పురుషులు వారికి జరిగిన అన్యాయాలకు పరిహారం ఇవ్వాలి అని దావా వేసుకోవచ్చు. ఇలా జరిగిన సందర్భాలు దాదాపుగా లేవు కానీ సివిల్ కోర్టును ఆశ్రయించే హక్కును ఎవరూ కాదనలేరు".
 
"భార్య సంపాదనపైన మాత్రమే ఆధారపడి జీవిస్తున్న భర్తను ఒకవేళ భార్య వద్దు అనుకుంటే, భర్త కూడా మెయింటెనెన్స్ పొందవచ్చు. ఇవి తప్ప పురుషులకు ప్రత్యేకమైన హక్కులు ఏమీ లేవు. భారతీయ సమాజంలో అలాంటి చట్టాలు వస్తే స్త్రీలకు మరింత అన్యాయం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సివిల్ కోర్టు పరిధిలో ఇలాంటి కేసులను పరిష్కరించడం ప్రస్తుత పరిస్థితులలో ఉత్తమమైనది" అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎదుర్కొన్న వేధింపులు, అది మిగిల్చిన మానసిక, ఆర్ధిక వేదన గురించి బీబీసీతో పంచుకున్నారు. గోప్యత దృష్ట్యా వ్యక్తి అసలు పేరును రాయలేదు.