శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:04 IST)

బోరిస్ జాన్సన్: మళ్లీ బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. ఎన్నికల్లో టోరీల ఘన విజయం.. జనవరిలో 'బ్రెగ్జిట్'

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
బ్రిటన్‌లో నిన్న జరిగిన కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఇంకా కొన్ని స్థానాల ఫలితం వెలువడాల్సి ఉండగానే, మెజారిటీ మార్కును దాటింది. కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వంలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ జెరిమీ కోర్బిన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాయి. జాన్సన్ మళ్లీ ప్రధాని కాబోతున్నారు.

 
బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే నెల్లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకు రావడానికి ప్రజలు తమకు శక్తిమంతమైన అధికారాన్ని ఇచ్చారని జాన్సన్ ఈ రోజు లండన్లో వ్యాఖ్యానించారు. లేబర్ పార్టీ ఓటమికి బ్రెగ్జిట్ అంశమే కారణమని కోర్బిన్ వ్యాఖ్యానించారు. దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో మొత్తం 650 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాలి.

 
బద్దలైన లేబర్ పార్టీ కంచుకోటలు
కన్జర్వేటివ్ పార్టీకి మొత్తమ్మీద 74 సీట్ల ఆధిక్యం సాధిస్తుందని బీబీసీ అంచనా వేస్తోంది. టోరీలకు 364 సీట్లు, లేబర్ పార్టీకి 203, స్కాటిస్ నేషనల్ పార్టీ(ఎస్‌ఎన్‌పీ)కి 48, లిబరల్ డెమొక్రాట్లకు 12, ప్లాయిడ్ సైమ్రుకు నాలుగు, గ్రీన్స్‌కు ఒకటి చొప్పున సీట్లు వస్తాయని బీబీసీ అంచనా వేస్తోంది. బ్రెగ్జిట్ పార్టీకి ఒక్క సీటూ రాదని అంచనా.

 
లేబర్ పార్టీ ఒకప్పటి కంచుకోటలైన బ్లిత్, డార్లింగ్టన్, వర్కింగ్టన్ లాంటి స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ జెండా ఎగరేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశంపై 2016 రెఫరెండంలో ఉత్తర ఇంగ్లండ్, మిడ్‌‌ల్యాండ్స్‌, వేల్స్‌లలో 'బ్రెగ్జిట్'కు మొగ్గుచూపిన ప్రాంతాల్లోని సీట్లను లేబర్ పార్టీ కోల్పోయింది. లేబర్ పార్టీకి 1935 తర్వాత అతిపెద్ద ఓటమి ఈ ఎన్నికల్లో ఎదురవుతోంది.

 
ఐదేళ్లలోపు వ్యవధిలో ఇది మూడో సార్వత్రిక ఎన్నిక. 1923 తర్వాత తొలిసారిగా ఈసారి డిసెంబర్‌లో ఈ ఎన్నిక జరిగింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాక డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. యూరోతో పోలిస్తే మూడున్నరేళ్ల గరిష్ఠానికి పౌండ్ విలువ ఎగబాకింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే క్రిస్మస్‌లోగా బ్రెగ్జిట్ ప్రక్రియ చేపట్టడానికి సత్వర చర్యలు తీసుకొంటామని హోం మంత్రి ప్రీతీ పటేల్ తుది ఫలితాలు వెలువడక ముందు చెప్పారు.

 
ప్రధాని బోరిస్ జాన్సన్, లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ తమ తమ స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ లండన్లోని ఉక్స్‌బ్రిడ్జ్ స్థానంలో బోరిస్ జాన్సన్ మెజారిటీ పెరగ్గా, ఇస్లింగ్టన్ నార్త్ నియోజకవర్గంలో కోర్బిన్‌ మెజారిటీ తగ్గింది.

 
ఈ నెల 16న సోమవారం మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. వచ్చే శుక్రవారం అంటే డిసెంబరు 20న బ్రెగ్జిట్ బిల్లు ఎంపీల ముందుకు వస్తుంది. కోర్బిన్ నాయకత్వంపై కొందరు లేబర్ పార్టీ అభ్యర్థులు విమర్శలు గుప్పించారు. భవిష్యత్తుపై ఆశను కల్పించే ఎన్నికల ప్రణాళికను తాము ప్రజల ముందుంచామని, అయితే చర్చలో బ్రెగ్జిట్ స్పష్టమైన చీలిక తెచ్చిందని, సాధారణ రాజకీయ అంశాలను చాలా వాటిని ఇది పక్కకు నెట్టేసిందని కోర్బిన్ చెప్పారు. ఇకపై ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించబోనని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.

 
2017 ఎన్నికలతో పోలిస్తే లేబర్ పార్టీ దాదాపు ఎనిమిది శాతం ఓట్లను కోల్పోయింది. టోరీల ఓటింగ్ శాతం కేవలం ఒక్క శాతమే పెరిగింది. చిన్న పార్టీల ఓటింగ్ శాతం బాగా మెరుగుపడింది. ఎస్‌ఎన్‌పీ నాయకురాలు, స్కాట్లాండ్‌ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జియన్ మాట్లాడుతూ- తమకు అసాధారణ విజయం దక్కిందని సంతోషం వ్యక్తంచేశారు.

 
బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని స్కాట్లాండ్ కోరుకోవడం లేదని, యూరోపియన్ యూనియన్ నుంచి స్కాట్లాండ్‌ను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రధానికి అధికారం లేదని, స్కాట్లాండ్ ఓటర్ల తీర్పు ఈ మేరకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మరో రెఫరండంలో తన భవిష్యత్తును తానే నిర్ణయించుకొనే స్వేచ్ఛ స్కాట్లాండ్‌కు ఉండాలని, ఈ ఎన్నికల్లో స్కాట్లాండ్ ప్రజల తీర్పు ఇదే చెబుతోందని నికోలా చెప్పారు.