బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (14:09 IST)

సీఏఏపై వెనక్కి తగ్గం.. ప్రభుత్వ ఆస్తులను తగులబెడితే జైలుఊచలు లెక్కించాల్సిందే...

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారని వెలుగు తెలిపింది. సీఏఏపై ప్రజలకు వాస్తవాలను చెపుతామని, తప్పుడు ప్రచారం చేసే పార్టీలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
 
సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తెలంగాణ శాఖ సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్వహించిన ప్రజా ప్రదర్శన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. సీసీఏకి వ్యతిరేకంగా అల్లర్లకు పాల్పడుతూ దేశంలో భయానక వాతావరణం సృష్టించేవారిని వదిలేది లేదని ఆయన చెప్పారు. సీఏఏ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
 
ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టే వారిపై కేసులు పెట్టి, వారి ఆస్తులను జప్తు చేసి కటకటాలకు పంపిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినా, భయపెట్టినా సీఏఏను ఆపేది లేదన్నారు. సీఏఏను తప్పుబడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుని, దాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడం లేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు.
 
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి 'బ్రెయిన్ డెడ్' 
అమెరికాలోని మిచిగాన్‌ పరిధి లాన్సింగ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి యేళ్ల(25)ను బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారని ఈనాడు రాసింది. సాఫ్ట్‌వేర్‌ సంస్థ డెలాయిట్‌ ఉద్యోగిని అయిన చరిత నాలుగేళ్ల కిందట ఎంఎస్‌ చేసేందుకు యూఎస్‌ వెళ్లారు.
 
సోమవారం ఆమె ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లారు. ఆమెను నగరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును క్రిస్లర్‌ అనే వ్యక్తి మద్యం తాగి నడుపుతున్నట్లు అక్కడి పోలీసులు నిర్ధరించారు.
 
ఏపీ: నేరుగా ఇంటికే ఇసుక 
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా నేరుగా కొనుగోలుదారు ఇంటి ముంగిటే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని ఈనాడు తెలిపింది. జనవరి 2 నుంచి అమలు చేయనున్న ఈ కొత్త విధానంపై సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ విధానాన్ని తొలుత కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించి, జనవరి 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో, 20 నుంచి రాష్ట్రమంతా ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 200కుపైగా నిల్వ కేంద్రాలు ఉండగా, 13 చోట్ల మాత్రమే వెంటనే ఇసుక అయిపోతోందని గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. రవాణా ఛార్జీలు తక్కువనే ఉద్దేశంతో 13 కేంద్రాల నుంచే ఎక్కువగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
 
ఈ కేంద్రాల సమీపంలో ఉండే రీచ్‌ల్లో కూడా ఇసుక బుక్‌ చేసుకునే అవకాశం ఉండాలని జగన్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలన్నారు. కొత్త విధానంలో రవాణా ఛార్జీలతో కలిపి వినియోగదారుడి నుంచి ఇసుక ధరను ఏపీఎండీసీ వసూలు చేస్తుందని, రవాణా కోసం అధిక ధర చెల్లించాల్సిన అవసరం ఉండదని గనులశాఖ మంత్రి పెద్దిరెద్ది రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.
 
రాష్ట్రంలో 255 రీచ్‌ల నుంచి ఇసుక తీస్తున్నామని, రోజువారీ వినియోగం 80 వేల టన్నులు ఉండగా, అదనంగా 9.63 లక్షల టన్నులు నిల్వ ఉంచామని ఆయన చెప్పారు. సెప్టెంబరు 5 నుంచి ఇప్పటి వరకు 43 లక్షల టన్నులు వినియోగదారులకు అందించామని, రూ.150 కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి తెలిపారు.
 
హైకోర్టు వస్తుందన్న నమ్మకం లేదు: టీజీ వెంకటేశ్ 
కర్నూలుకు హైకోర్టు వస్తుందన్న నమ్మకం తనకు లేదని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది. కర్నూలులో హైకోర్టు వస్తుందన్న ఆశలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంచ్‌, హైకోర్టు రెండూ పోతాయనిపిస్తోందని టీజీ చెప్పారు. తమకు పూర్తిగా రాజధాని అయినా ఇవ్వాలని, లేకపోతే రాజధాని హంగులైనా కల్పించాలని కోరారు.
 
దీ కాకపోతే శీతాకాల రాజధాని అయినా పెట్టాలని అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన జూనియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ పోటీల ముగింపు సభలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.