సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (19:17 IST)

భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలేంటి?

సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించమని మా డాక్టర్ రేణు మాలిక్ చెప్పారు. కానీ నేను ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. సిజేరియన్ ద్వారానే ప్రసవం చెయ్యమని కోరాను. రోమా లాంటి ఎందరో మహిళలు తమకు తాముగానే సిజేరియన్ ప్రసవాలను కోరుకుంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 4 ప్రకారం, భారత్‌లో సిజేరియన్ డెలివరీల సంఖ్య గత దశాబ్దకాలంలో రెట్టింపైంది. ఈ సంఖ్య ఇంతలా పెరగడానికి కారణాలేంటి?
 
అమ్మాయిలు ప్రసవ సమయంలో నొప్పిని భరించలేకే ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతున్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ రేణు మాలిక్ అంటున్నారు. "ఇంతకుముందు ప్రతి ఇంట్లో చాలామంది పిల్లలుండేవారు. ఎక్కువమంది పిల్లలను కనేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయాయి. అమ్మాయిలను గారాబంగా పెంచడం మొదలైంది. దీంతో వారిలో బాధను, నొప్పిని తట్టుకోగలిగే సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. మేము నొప్పిని భరించలేం అను వాళ్లే నేరుగా మాతో చెబుతున్నారు. అందుకే మాకు సిజేరియన్ చెయ్యడం తప్ప మరో అవకాశం కనిపించడం లేదు" అని డాక్టర్ రేణు చెబుతున్నారు.
 
సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించమని చాలా నచ్చజెప్తామని, కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ప్రసవ సమయంలో వచ్చే నొప్పుల బాధ స్థాయిని తగ్గిస్తామని కూడా చెబుతున్నామని డాక్టర్ రేణు చెప్పారు.
 
సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి ఇంకా ఏం కారణాలున్నాయి?
ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, హైపర్ టెన్షన్, బీపీ, డయాబెటిస్ సమస్యలు కూడా ఒక్కోసారి కారణం కావచ్చు. "ఈరోజుల్లో మహిళలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లు ఒకరిద్దరు పిల్లలుంటే చాలనుకుంటున్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. అది ఎంత చిన్నదైనా సరే. వద్దనే చెబుతూ సిజేరియన్ చేయమని చెబుతున్నారు. చాలామంది 30 ఏళ్లు దాటాక కూడా పిల్లల్ని కంటున్నారు. వయసు పెరిగితే ప్రసవ ఇబ్బందులకు అవకాశం పెరుగుతుంది" అని డాక్టర్ రేణు వెల్లడించారు.
 
ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం ఎక్కువైంది. హైపర్ టెన్షన్, బీపీ సమస్యలు పెరుగుతున్నాయి. డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. ఇవన్నీ కూడా సిజేరియన్ ప్రసవాల పెరుగుదలకు కారణమే.


"సాధారణ ప్రసవమే మంచిదనేది ఓ అపోహ అనుకుంటున్నా. ఎందుకంటే సిజేరియన్ చేయించుకున్న ఎందరినో నేను కలిశాను. సాధారణ ప్రసవాల ద్వారా పిల్లల్ని కన్న మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో వీళ్లూ అంతే ఆనందంగా ఉన్నారు. నార్మల్ డెలివరీతో కలిగే బాధను నేను భరించలేను. నాకు సిజేరియన్ డెలివరీనే కావాలి" అని రోమా అంటున్నారు.