ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:05 IST)

కరోనా మరణాలు: అధికారిక లెక్కలు కాదు, ఈ చితి మంటలు చెప్పే కథ వినండి

నేను ఇంత పెద్ద సంఖ్యలో శవాలు కాలుతుండగా చూడటం ఇదే మొదటిసారి. దిల్లీలోని ఓ మూడు శ్మశాన వాటికలను పరిశీలించినప్పుడు ఒక్కో దృశ్యం వెనక విషాదగాథ వినిపించింది. దిల్లీ ఆసుపత్రులలో రోగుల బంధువులు ఆక్సిజన్, ఐసీయూ, బెడ్లు, వెంటిలేటర్లు, మందుల కోసం పరుగులు పెడుతున్న దృశ్యాలు శనివారంనాడు విస్తృతంగా కనిపించాయి.

 
సోమవారం నాడు శ్మశాన వాటికల్లో బంధువుల రోదనలు కనిపించాయి. వస్తున్న శవాలను కాల్చడానికి స్థలం సరిపోక ఓపెన్ ప్లేస్‌లను శ్మశానాలుగా మారుస్తున్న దృశ్యాలు కూడా దిల్లీలో కనిపించాయి. దేశ రాజధానిలో ప్రతి రోజూ కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 350 నుంచి 400 మధ్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, కేవలం ఒకటి రెండు గంటలలోనే వందకు పైగా శవాలు కాలిపోతున్న దృశ్యాలను నేను స్వయంగా గమనించాను.

 
సరాయి కాలే ఖాన్ రింగ్ రోడ్ పక్కనే, ట్రాఫిక్ రద్దీకి కాస్త దూరంగా ఓ విద్యుత్ దహన వాటిక ఉంది. ఒకవైపు అక్కడ పదుల సంఖ్యలో చితి మంటలు కనిపిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ దహనవాటికలో మరికొన్ని శవాలను దహనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంధువుల రోదనలు, అంబులెన్సుల సైరన్‌లు, అక్కడ పని చేసే వారి అరుపుల మధ్య 10-12 మృతదేహాలు కాలిపోతూ కనిపించాయి.

 
అంత్యక్రియలు నిర్వహించే పండితుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినా కుదరలేదు. నా ఫోన్‌తో వీడియోలు తీస్తుండగా, వేడికి అది కూడా పని చేయడం మానేసింది. అంత బిజీగా ఉన్నా ఎలాగో ఒక పండితుడిని పట్టుకోగలిగాను. రోజుకు ఎన్ని శవాలకు అంత్యక్రియలు జరుపుతారని ప్రశ్నించాను. ''24 గంటలు శవాలు వస్తూనే ఉన్నాయి. ఎన్నని గుర్తు పెట్టుకోవాలి'' అని ఆయన ప్రశ్నించారు.

 
అంబులెన్స్‌లు ఒకదాని వెంట ఒకటి శ్మశానానికి చేరుతూనే ఉన్నాయి. నా తల తిరిగిపోయింది. జర్నలిస్టుగా ఎన్నో ఉగ్రవాద దాడులు, హత్యాకాండలను కవర్ చేశాను. కానీ, ఇలా సామూహిక అంత్యక్రియలు మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఒకపక్క ఎండ తాపానికి, మరోవైపు చితిమంటల వేడికి, పీపీఈ కిట్‌లో ఉన్న నేను తాళ లేకపోయాను. పైగా ఆ దృశ్యాలను చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను.

 
తాత్కాలిక శ్మశానాలు
నేను అక్కడి నుంచి బయలు దేరుతుండగా ఓ మహిళా రిపోర్టర్ మరో సమాచారం ఇచ్చారు. పక్కనే తాత్కాలిక శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని ఆమె వెల్లడించారు. నేను అక్కడికి వెళ్లగా కూలీలు ఆ ప్రదేశంలో 20-25 ప్లాట్‌ఫారమ్‌లు నిర్మిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ''కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయి. వచ్చే పది రోజుల కోసం ఇది తాత్కాలిక ఏర్పాటు'' అని అక్కడ పని చేస్తున్న కార్మికుడు ఒకరు చెప్పారు.

 
లోధీ రోడ్‌లోని ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు వెళ్లగా, అక్కడ జనం పెద్ద ఎత్తున ఉన్నారు. పెద్ద సంఖ్యలో చితులు కాలిపోతూ కనిపించాయి. మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో పోగై ఉన్నారు. చాలామంది ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ కనిపించారు. అంబులెన్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి. అక్కడ ఒకేసారి దాదాపు 25 వరకు చితి మంటలు కనిపించాయి. అక్కడికి వచ్చిన వారిలో చాలామంది పీపీఈ కిట్‌లు ధరించి ఉన్నారు.

 
పీపీఈ కిట్ ధరించి ఓ బెంచి మీద కూర్చున్న ఓ వ్యక్తిని పలకరించినప్పుడు అతడు తన కథ వినిపించారు. తన తండ్రి కోవిడ్‌తో మరణించారని, ఆయన్ను రక్షించడానికి ఆసుపత్రిలో అనేక ప్రయత్నాలు చేశామని, కానీ ప్రాణాలు దక్కలేదని ఆ యువకుడు వివరించారు.
 
సీమాపురి శ్మశాన వాటికలో దృశ్యాలు
సీమాపురి శ్మశాన వాటిక కిక్కిరిసి ఉంది. పెద్ద సంఖ్యలో చితులు తగలబడుతున్నాయి. కొన్న ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఉండగా, మరికొన్ని ఇటీవలే నిర్మించినట్లు కొత్తగా కనిపిస్తున్నాయి. బంధువులు మృతదేహాలను స్వయంగా తెచ్చుకుంటున్నారు. కట్టెలు కూడా వాళ్లే పేరుస్తున్నారు. అంబులెన్స్ సర్వీసులు చూస్తున్న ఓ బజరంగ్ దళ్‌ కార్యకర్తతో మాట్లాడాను.

 
ఆ యువకుడు గత పది రోజులుగా ఆసుపత్రుల నుంచి మృత దేహాలను తీసుకువస్తూనే ఉన్నట్లు వెల్లడించారు. సిక్కు మతానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సర్వీసులలో పాల్గొంటున్నాయి. గత పది రోజులుగా పరిస్థితి ఘోరంగా మారిందని, ఇక్కడ ఖాళీ లేక వేరే శ్మశాన వాటికకు వెళ్లాల్సిందిగా చెప్పవలసి వస్తోందని సర్దార్ జీ చెప్పారు. సీమాపురి శ్మశాన వాటికలో ప్రతిరోజూ 100కి పైగా మృతదేహాలను కాలుస్తున్నారు.

 
ముస్లింల శ్మశానాలు ఎలా ఉన్నాయి?
లోధీ రోడ్‌లోని శ్మశాన వాటికకు కొద్ది దూరంలోనే ముస్లింల శ్మశాన వాటిక ఉంది. కానీ సోమవారం నాడు అక్కడ కేవలం ఒకరికి మాత్రమే అంత్యక్రియలు జరిగాయని తెలిసింది. ఇక ఓఖ్లాలోని బాట్లా హౌస్ ప్రాంతంలో ఒక శ్మశాన వాటిక ఉంది. అక్కడ పని చేసే ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడగా, ఇంతకు ముందు ప్రతి రోజూ ముగ్గురు నలుగురు వ్యక్తులకు అంత్యక్రియలు చేసేవారని, కానీ ఏప్రిల్ నెల వచ్చినప్పటి నుంచి రోజుకు 20 నుంచి 25కి అంత్యక్రియలు జరుగుతున్నాయని ఆ వ్యక్తి వివరించారు.

 
ఐటీఓలో టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ వెనక ఒక శ్మశాన వాటిక ఉంది. అందులో కోవిడ్‌తో మరణించిన వారికి విడిగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందులోనే మూలన ఉన్న చర్చి యార్డ్‌కు వెళ్లాను. క్రైస్తవుల మృతదేహాలు ఏ సంఖ్యలో వస్తున్నాయని అక్కడ పని చేస్తున్న వ్యక్తిని అడిగాను. రోజుకు పాతిక వరకు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.

 
దిల్లీలో నేను కేవలం మూడు శ్మశాన వాటికలకు మాత్రమే వెళ్ళాను. నగరంలో ఇంకా డజన్ల సంఖ్యలో శ్మశానాలు ఉన్నాయి. కోవిడ్ తీవ్రత పెరిగిన తర్వాత మృతదేహాల రాక కూడా ఎక్కువైంది. ప్రభుత్వం మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తుండగా, అక్కడ రగులుతున్న చితి మంటలను చూస్తే దిల్లీలో వాస్తవ పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.

-జుబేర్ అహ్మద్
  • బీబీసీ కరస్పాండెంట్