శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:36 IST)

కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌తో సంబంధం కలిగి ఉన్న అపోహలు-వాస్తవాలు

కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ అంతర్జాతీయంగా జరుగుతుంది కానీ ప్రజల నుంచి మిశ్రమ స్పందన దీనికి లభిస్తుంది. మరీ ముఖ్యంగా అతిస్వల్పకాలంలో తయారైన ఈ వ్యాక్సిన్‌ల సమర్థత పట్ల అనేక మందిలో సందేహాలు ఉండటం చేత ఈ వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి ప్రజలు ఏమంతగా ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు విభిన్న వర్గాల నుంచి సామాజిక మాధ్యమాలలో ఈ వ్యాక్సిన్‌ల గురించి వ్యాప్తి చేస్తోన్న అంశాలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి.
 
ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఈ అపోహలను తొలగించి వాస్తవాలను ప్రచారం చేసేందుకు ఇప్పుడు శ్రమిస్తున్నప్పటికీ అపోహలే ఎక్కువగా ప్రచారమవుతుండటం దురదృష్టకరం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తాను ఈ వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు కొండాపూర్‌లోని అపోలో స్పెక్ట్రా వద్ద ఇంటర్నల్‌ మెడిసన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ ఎల్‌ సంజయ్‌. ప్రస్తుతం ప్రజలలో ఉన్న అపోహలు-వాస్తవాలను గురించి ఆయన ఇలా చెప్పారు.
 
వ్యాక్సిన్‌ తీసుకుంటే మాస్క్‌ ధరించనవసరం లేదన్న అంశమై ఇప్పటివరకూ ఎలాంటి నిరూపిత ఆధారాలు లేవు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) అభిప్రాయం ప్రకారం తట్టు వ్యాధి ఒకసారి వస్తే జీవితాంతం రోగనిరోధక శక్తి ఉంటుందన్నట్లుగానే కరోనాకు కూడా అది వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కానీ అది భావన మాత్రమే. అందుకే కరోనాకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలి.
 
వ్యాక్సిన్‌ కన్నా మన శరీరంలో ఉత్పత్తి అయిన రోగనిరోధక శక్తి అత్యుత్తమంగా ఉంటుందని కొంతమంది తమంతట తాముగా వైరస్‌ బారిన పడుతున్నారు. కానీ అది ప్రాణాంతకమయ్యే అవకాశాలూ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటుంది. ఒకరి శరీరంలో రోగనిరోధక శక్తి ప్రవర్తించిన తీరుగానే అందరిలోనూ అది ప్రవర్తిస్తుందనుకోవడం భ్రమ.
 
ఇక ఇప్పటికే కోవిడ్ 19 వ్యాధి బారిన పడితే వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన అవసరం లేదని మరికొంతమంది భావిస్తున్నారు కానీ, ఈ తరహా రోగనిరోధక శక్తి సుదీర్ఘంగా మాత్రం ఉండదు. మరలా వ్యాధి బారిన పడే అవకాశాలనూ తోసిపుచ్చలేం. అందుకే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఉత్తమం. మన డీఎన్‌ఏను ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ మార్చేస్తుందని, దానివల్ల సమస్యలు వస్తాయంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎంఆర్‌ఎన్‌ఏ మన శరీరంలో స్పైక్‌ ప్రొటీన్‌ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ప్రొటీన్‌ మన కణజాల కేంద్రకంలో ప్రవేశించదు. అలాంటప్పుడు డీఎన్‌ఏ మారే ప్రసక్తే ఉండదు.
ఇక చివరగా చాలా మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి స్పష్టంగా వివరణ కూడా ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ లేదంటే గతంలో ఈ వ్యాధి బారిన పడి ఉంటేనో మాత్రమే హెర్డ్‌ ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుందని తెలిపింది. అంతేకాదు వ్యాక్సినేషన్‌ ద్వారా మాత్రమే అది సాధ్యం చేయాలని కూడా సూచించింది. వ్యాధి బారిన ఎక్కువమంది పడితే మరణాలూ వృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయని అది ఆందోళననూ వ్యక్తం చేసింది. కనుక అపోహలు వదిలి, వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి అందరూ సిద్ధంకండి!
 
-డాక్టర్‌ ఎల్‌ సంజయ్‌, ఇంటర్నల్‌ మెడిసన్‌ డిపార్ట్‌మెంట్‌, అపోలో స్పెక్ట్రా, కొండాపూర్‌, హైదరాబాద్‌.