శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (09:58 IST)

కరోనావైరస్: దక్షిణాదిలో కొత్త రకం వైరస్, తెలంగాణలోనూ ఆనవాళ్లు, ఏపీని కూడా హెచ్చరించిన కేంద్రం - ప్రెస్ రివ్యూ

తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలలో ‘ఎన్‌440కే’ రకం వైరస్‌ వేగంగా ప్రబలుతోందని, అయితే దాని తీవ్రత తక్కువగా ఉందని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు పత్రిక పేర్కొంది.

 
ఇక ప్రమాదకరమైన బ్రిటన్‌ రకం వైరస్‌ ‘ఈ484కే’ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఈ కథనం వెల్లడించింది. అధిక తీవ్రత ఉన్న ‘ఈ484కే’, ‘ఎన్‌501వై’ రకాల వైరస్‌ వ్యాప్తి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నట్టు పరిశోధనలో తేలింది.

 
ఐసీఎంఆర్‌ సహకారంతో కొవిడ్‌-2 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై సీసీఎంబీ పరిశోధన జరుపుతోంది. గత ఏడాది కేరళలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన నాటి నుంచే సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించింది. అప్పటి నుంచి వెలుగుచూసిన ఐదువేల రకాల జన్యుపరివర్తనలపై లోతైన అధ్యయనం చేసింది. పరిశోధకులు కరోనా జన్యువులలో తేడాలను గుర్తించగలిగారు.

 
మొదట్లో దేశంలో రెండు రకాల వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబలిన వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో విస్తరిస్తున్న వైరస్‌కు తేడా ఉన్నట్టు తెలిపారు. దక్షిణాదిలో ఉన్న వైరస్‌ను ‘క్లేడ్‌ఏ3ఐ’గా, ఉత్తరాది రాష్ట్రాలలోని వైరస్‌ను ‘క్లేడ్‌ఏ2ఏ’గా నిర్ధరించారు.

 
దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ల తీవ్రత అంతగా లేకపోయినా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, మహారాష్ట్ర, కేరళలలో మాస్క్‌లను ధరించకుండా నిర్లక్ష్యం చేసి విచ్చలవిడిగా తిరగడం వల్ల పరిస్థితి మళ్లీ చేయి దాటుతున్నదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

 
మహమ్మారి మళ్లీ వస్తోంది- కేంద్రం హెచ్చరిక
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోందని, సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కోవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించించినట్లు ఈ కథనం తెలిపింది. కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి.

 
కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కోవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.

 
ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.