బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (11:25 IST)

కరోనావైరస్‌: దిల్లీలో చలి, కాలుష్యంతో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

ఒకపక్క ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం, మరోవైపు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో రాజధాని దిల్లీకి మళ్లీ కోవిడ్‌ భయం పెరుగుతోంది. కేసులు క్రమంగా ఎక్కువవుతున్నాయి. గత బుధవారం ఒక్క రోజే దిల్లీలో 8,500 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక రోజు అత్యధిక కేసులలో నగరానికి ఇదే రికార్డు. బుధవారంనాడు 85 మంది కోవిడ్‌-19తో మరణించగా, ఇప్పటి వరకు దిల్లీలో వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,000 చేరుకుంది.

 
కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. అందుబాటులో ఉన్న మొత్తం బెడ్లలో సగం బెడ్లు పేషెంట్లతో నిండిపోయాయి. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లను పెంచాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 86 లక్షలు దాటాయి. అత్యధిక కేసుల జాబితాలో భారత్‌ ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచింది.

 
సెప్టెంబర్‌ నెల నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒక దశలో రోజుకు లక్ష వరకు నమోదైన కేసులు సెప్టెంబర్‌లో 37,000 పడిపోయాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసులు 40-50వేల మధ్య ఉండగా, బుధవారంనాడు 48,200 కేసులు నమోదయ్యాయి.

 
కాటేసే కాలుష్యం
అయితే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజధాని దిల్లీలో గత కొద్ది వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దిల్లీలో 450,000 వేలకేసులు నమోదు కాగా, 42,000 కేసులను యాక్టివ్‌గా ఉన్నాయి. ఉత్తరాదిలో చలితోపాటే కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రెండు అంశాలు వైరస్‌ నిరోధానికి పెద్ద సవాలుగా మారతున్నాయని నిపుణులు అంటున్నారు.

 
కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడానికి పండగ సీజన్‌ కూడా ఒక కారణమే. ఈ వారాంతంలో దీపావళి పండగ ఉండటంతో షాపింగ్‌ రద్దీ బాగా పెరిగింది. కాలుష్యం సమస్య రాకుండా ఉండేందుకు దిల్లీ ప్రభుత్వం టపాకాయల అమ్మకాలను నిషేధించడంతోపాటు, భౌతికదూరం పాటించాలంటూ ప్రజలకు విజ్జప్తి చేసింది. అయితే, మార్కెట్లలో కనిపిస్తున్న జనాభా అధికారులను ఆందోళనలోకి నెడుతోంది. కొన్ని మార్కెట్‌ ఏరియాలకు చెందిన షాపుల యజమానుల్లో ఎక్కువమంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు గుర్తించారు. ఈ మార్కెట్‌ ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. 

 
భయపెడుతున్న బెడ్ల కొరత
“ఇద్దరు వయసు మళ్లిన కరోనా బాధితులు, బెడ్‌ కోసం ఆసుపత్రిలో 20 గంటలు వేచి చూడాల్సి వచ్చింది’’ అని దిల్లీకి చెందిన వైద్యుడు డాక్టర్‌ జోయేతా బసు వెల్లడించారు. దిల్లీలో మొత్తం 16,573 బెడ్లు కరోనా బాధితుల కోసం కేటాయించగా, బుధవారం నాటికి అందులో 8,600 బెడ్లు నిండిపోయాయని ప్రభుత్వం రూపొందించిన కరోనా యాప్‌ సూచిస్తోంది. అంతకన్నా ఆందోళనకరమైన విషయం ఐసీయుల కొరత. కేవలం 176 బెడ్లకు మాత్రమే వెంటిలేటర్‌ సౌకర్యం ఉండగా, 338 బెడ్లకు ఆ సౌకర్యం లేదు.

 
కోవిడ్‌-19 వ్యాప్తి విపరీతంగా ఉందని, ఖాళీ అయిన బెడ్లు నిమిషాలలో నిండి పోతున్నాయని నగరానికి చెందిన వైద్యులు చెబుతున్నారు. గవర్నమెంట్‌ ఆసుపత్రులలో వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ యాప్‌ సూచిస్తోంది. అయితే ఈ యాప్‌లో నమోదైన 80 ప్రైవేటు ఆసుపత్రులలో కనీసం 24 ఆసుపత్రులలో ఒక్క బెడ్‌ కూడా అందుబాటులో లేదు. 50కన్నా తక్కువ ప్రైవేటు ఆసుపత్రులలోనే బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

 
ప్రైవేటు వైద్యం ఖర్చులు భరించగలిగిన వారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం లేదు. వాస్తవానికి అక్కడ సదుపాయాలు చాలా నాసిరకంగా ఉంటాయి. ప్రజావైద్యం కోసం భారతదేశంలో ప్రభుత్వం కేటాయించే నిధులు జీడీపీలో కేవలం 1శాతమే. “నా దగ్గరకు వచ్చిన పేషెంట్లంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఎక్కడ బెడ్‌ దొరికితే అక్కడ సర్దుకోవాల్సి ఉంటుంది’’ అని డాక్టర్‌ బసు అన్నారు.

 
పెరుగుతున్న కేసులు
కేసులు పెరుగుతున్నాయంటే ఆసుపత్రులకు వచ్చే కోవిడ్‌ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. “ముఖ్యంగా శ్వాస సమస్యలతో అత్యవసర కేసులుగా ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లు పెరుగుతారు. ఎందుకంటే కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది’’ అని ఆయన ఎన్డీటీవీతో అన్నారు.

 
దిల్లీ నగరంలో కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే సేఫ్‌ లెవెల్స్‌ను దాటి 14 రెట్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ సూచీలు నమోదు చేస్తున్న గణాంకాలు చెబుతున్నాయి. చలి కాలంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని, ఇది మరో ప్రమాదకరమైన అంశమని పబ్లిక్‌ హెల్త్ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్ కె. శ్రీనాథ్‌ రెడ్డి అన్నారు. చలి కారంణంగా వైరస్‌ బతికే కాలం ఎక్కువగా ఉంటుందని, చల్లని, పొడి వాతావరణం ఈ వైరస్‌కు చాలా అనుకూలమని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. “చల్లగాలి భారంగా ఉంటుంది. ఎక్కువగా కదలదు. దీనివల్ల గాలిలో ఉన్న వైరస్‌ మనుషులకు సులభంగా అంటుకునే ప్రమాదం ఉంది’’ అన్నారు శ్రీనాథ్‌రెడ్డి. చల్లగాలికి కాలుష్యం తోడైతే అది మరింత ఇబ్బందికరమని ఆయన తెలిపారు.

 
పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలో కోవిడ్‌-19 మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. PM 2.5 (పర్టిక్యులర్‌ మ్యాటర్‌ 2.5)లో కాలుష్యం ఒక క్యూబిక్‌ మీటర్‌లో ఒక మైక్రోగ్రామ్‌ పెరిగినా కోవిడ్‌ మృతుల రేటు 8% పెరిగే ప్రమాదం ఉందని హార్వర్డ్‌ యూనివవర్సిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. గాలిలో కలిసే నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, కార్ల నుంచి వెలువడే పొగకు కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ పెరుగుదలకు సంబంధం ఉంటుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది.

 
“ఎండలు ఎక్కువగా ఉండే జూన్‌ నెల నుంచి కోవిడ్‌ క్రమంగా తగ్గడం మొదలుపెట్టింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం’’ అని ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌ రెడ్డి హెచ్చరించారు. ఫ్రాన్స్‌, ఇటలీలాంటి ఐరోపా దేశాలలో కూడా చలి ఎక్కువగా ఉండే జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అత్యధిక కేసులను నమోదయ్యాయి. “చలికాలంలో ఈ వైరస్‌ను ఎదుర్కోవడం మనకు ఇదే మొదటిసారి. ఎండాకాలం నాటి పరిస్థితులు ఇప్పుడు కచ్చితంగా ఉండవు. మనం ఇప్పుడు చాలా బలహీన స్థితిలో ఉన్నాం’’ అన్నారు శ్రీనాథ్‌ రెడ్డి.