సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (21:23 IST)

కరోనావైరస్ వ్యాక్సీన్: భారతదేశంలో వంద కోట్ల మందికి టీకాలు వేయడం ఎలా?

వ్యాక్సీన్ల తయారీకి భారత్ ఒక పవర్‌హౌస్ లాంటిది. మన దేశంలో పెద్దయెత్తున టీకాలు వేసే కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ప్రపంచంలోని 60 శాతం టీకాలు ఇక్కడే తయారవుతుంటాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా ప్రపంచంలో పదికిపైగా అతిపెద్ద టీకా తయారీ సంస్థలకు భారత్ నిలయం.

 
కరోనావైరస్ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా, దేశంలోని వంద కోట్ల పైచిలుకు జనాభాకు టీకాలు వేయించే విషయంలో ఎలాంటి రాజకీయ చొరవ కనిపించడంలేదు. వైరస్ కట్టడికి 50 కోట్ల డోసులను ఉపయోగించాలని భారత్ వ్యూహాలు సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది జులై నాటికి దాదాపు 25 కోట్ల మంది వ్యాక్సీన్ వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

 
ఏటా ఇక్కడ లక్షల మందికి టీకాలు వేయిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేయించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. డజనుకుపైగా వ్యాధుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఏటా ఐదు కోట్ల మంది వరకు నవజాత శిశువులు, గర్భిణులకు దాదాపు 39 కోట్ల వ్యాక్సీన్లను ఇక్కడ ఉచితంగా వేయిస్తుంటారు. వ్యాక్సీన్లను నిల్వ చేయడానికి, వీటిని తరలించడానికి ఇక్కడ పటిష్ఠమైన వ్యవస్థ అందుబాటులో ఉంది.

 
అయినప్పటికీ, కోవిడ్-19కు వ్యతిరేకంగా కోట్ల మందికి తొలిసారిగా టీకాలు వేయించడం పెద్ద సవాల్‌తో కూడుకున్న పని అంటూ నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో అభివృద్ధి దశలో ఉన్న 30 కరోనావైరస్ టీకాల్లో ఐదు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కూడా ఒకటి. దీన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పరీక్షిస్తోంది. మరోవైపు దేశీయ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన మరో టీకా కూడా చివరి దశకు వచ్చేసింది. ‘‘దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాకు తొలి ప్రాధాన్యమిస్తాం’’అని భారత్‌లోని బయోటెక్నాలజీ విభాగ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ తెలిపారు.

 
‘‘అందుబాటులో ఉండే వ్యాక్సీన్లలో ఒకదాన్ని ఎంచుకోవడంతో మొదలుపెట్టి వీటిని ఎవరికి వేయాలో గుర్తించడం వరకూ ప్రతి దశా సవాళ్లతో కూడుకున్నదే’’అని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌కు ఎంపికైన తొలి భారత పరిశోధకురాలు, మైక్రోబయాలజిస్టు డా. గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. ‘‘మనం ఈ ప్రక్రియలోని సంక్లిష్టతలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం. భారత్‌లో సగం మందికి టీకాలు వేసేందుకు చాలా ఏళ్లు పడుతుంది’’అని ఆమె చెప్పారు.

 
ప్రధాన సవాళ్లు ఇవే..
భారత్‌లో దాదాపు 27,000 కోల్డ్ చైన్ స్టోర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే దాదాపు 80 లక్షల ప్రాంతాలకు టీకాలు తీసుకెళ్తుంటారు. దాదాపు అన్ని వ్యాక్సీన్లనూ 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే నిల్వ ఉంచాలి. అందుకే ప్రత్యేకంగా ఈ కోల్డ్ చైన్‌లను ఏర్పాటుచేశారు. అయితే ఇవి సరిపోతాయా?

 
మరోవైపు సిరింజ్‌లు మళ్లీ ఉపయోగించకుండా చూసేందుకు, మళ్లీ ఇన్ఫెక్షన్ సోకకుండా అడ్డుకునేందుకు ఆటో డిజేబుల్ సిరింజ్‌లు అవసరం. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే ఏడాది నాటికి వంద కోట్ల సిరింజ్‌లు తయారుచేస్తున్నట్లు దేశంలో అతిపెద్ద సిరింజ్ తయారీ సంస్థ తెలిపింది. మరోవైపు గాజు సీసాలపై కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారీగా టీకాలు వేయడంతో ఉత్పత్తయ్యే మెడికల్ వ్యర్థాల నిర్వహణపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 
దాదాపు 40 లక్షల మంది డాక్టర్లు, నర్సుల సాయంతో భారత్ టీకా కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి. మరి కోవిడ్-19 టీకాలకూ వీరినే ఉపయోగిస్తారా? ‘‘గ్రామీణ ప్రాంతాలకు టీకాలను ఎలా చేరవేస్తారోనని ఆందోళనగా ఉంది’’అని దేశంలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా చెప్పారు.

 
మొదటి టీకాలు ఎవరికి?
వ్యాక్సీన్‌లు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తాయి. అయితే అప్పుడు మొదట ఎవరికి వ్యాక్సీన్ ఇవ్వాలి అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి తొలి టీకాలు ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే, ఇది అంత తేలికకాదని నిపుణులు అంటున్నారు.

 
‘‘మనకు ఎప్పుడూ సరిపడా వ్యాక్సీన్లు రావు. కాబట్టి ఎవరికి ముందు ఇవ్వాలనేది అతి పెద్ద సమస్య అవుతుంది’’అని మహమ్మారుల నిపుణుడు డాక్టర్. చంద్రకాంత్ లహరియా వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్న తరుణంలో.. ప్రభుత్వ సిబ్బందికి ముందు ఇస్తారా? లేక ప్రైవేటు వ్యక్తులకా? కాంట్రాక్టు ఉద్యోగులతో పోలిస్తే.. శాశ్వత ఉద్యోగులకే తొలి ప్రాధాన్యం ఇస్తారా?

 
ఒకవేళ ఇతర అనారోగ్యాలున్న వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇస్తే, ఆ అనారోగ్యాలకు ఎలా ప్రాధాన్యం ఇస్తారు? దానికి ఎలాంటి విధానాలు అనుసరిస్తారు? ఉదాహరణకు దేశంలో 7 కోట్ల మందికిపైగా మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో రెండో స్థానం భారత్‌దే. వీరందరికీ ప్రాధాన్యం ఇస్తారా? 30 రాష్ట్రాల్లోనూ వ్యాక్సీన్లను ఒకేసారి ఇవ్వడం కుదరదు. అందుకే తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారా? సమానత్వం, పక్షపాతం.. ఇలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.

 
లక్షల డోసులు ట్రాక్ చేయడం ఎలా?
వ్యాక్సీన్ల తయారీలో అనుభవమున్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ద్వారా వీలైనంత వేగంగా వ్యాక్సీన్లు ప్రజలకు చేరవేయొచ్చని ఆరోగ్య సేవల రంగంపై అధ్యయనం చేపడుతున్న వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ పరిశోధకుడు ప్రశాంత్ యాదవ్ వివరించారు. అయితే, సాధారణ టీకా కార్యక్రమాల తరహాలో, కోవిడ్-19 టీకా కార్యక్రమం కూడా విజయం అవుతుందని అనుకోకూడదని ఆయన చెప్పారు.

 
‘‘సాధారణ టీకా కార్యక్రమాల కోసం భారీగా మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ క్లీనిక్‌లే వీటిని నడిపిస్తున్నాయి. అయితే, వయోజనుల విషయంలో ఎలాంటి టీకా కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ లేదు. అదే సమయంలో పెద్దవారు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకూ రారు. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే మంచి ఫలితాలు వస్తాయి’’అని ఆయన వివరించారు.

 
మరోవైపు ప్రభుత్వ పథకాలు, ట్యాక్సుల విషయంలో ఉపయోగించే ఆధార్ సంఖ్యను, కోవిడ్19 టీకాల ట్రాకింగ్‌కూ ఉపయోగించాలని భారత్‌లోని అతిపెద్ద సాంకేతిక సమాచార సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని లాంటి ప్రముఖులు చెబుతున్నారు. ‘‘రోజుకు కోటి మందికి టీకాలు ఇచ్చేలా వ్యవస్థను మనం తీర్చిదిద్దాలి. వీటన్నింటి వివరాలనూ డిజిటల్ రూపంలో నమోదుచేయాలి’’అని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

 
అవినీతిపై ఆందోళనలు
వ్యాక్సీన్ల నిల్వ, అందుబాటులో అవినీతి చోటుచేసుకుంటుందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
తొలి దశలో టీకాలు వేయించుకునేందుకు నకిలీ ధ్రువపత్రాలతో వచ్చేవారిని ఎలా అడ్డుకోవడం? బ్లాక్ మార్కెట్‌లో వ్యాక్సీన్లను విక్రయించకుండా చూడటం ఎలా? కొందరిలో వ్యాక్సీన్లు దుష్ప్రభావాలనూ చూపిస్తాయి. వ్యాక్సీన్ల తర్వాత దుష్ప్రభావాలను పర్యవేక్షించేందుకు భారత్‌లో ఒక వ్యవస్థ కూడా ఉంది.

 
అయితే, ఇక్కడ నమోదయ్యే కేసుల కంటే దుష్ప్రభావాలు వచ్చే కేసులు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాల నమోదులో పారదర్శకత లేకపోతే, ప్రజల్లో వ్యాక్సీన్లపై భయం పెరిగే ముప్పుంటుంది.

 
ఎవరు చెల్లిస్తారు?
బహుశా అన్నింటికంటే ఇదే అతిపెద్ద ప్రశ్న. అన్ని టీకాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి అందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తుందా? రాయితీపై అందిస్తుందా? మార్కెట్ ధరకు టీకాలను ప్రభుత్వం కొనుగోలు చేయగలదా? కరోనావైరస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు, ప్రతి భారతీయుడికీ వ్యాక్సీన్ అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని లహరియా చెబుతున్నారు. మరోవైపు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వ్యాక్సీన్ ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని డా. షా అంటున్నారు.

 
మొదట్లో ఒక వ్యాక్సీన్ ధర మూడు డాలర్ల నుంచి ఐదు డాలర్ల వరకు ఉంటుందని, రెండు డోసుల వ్యాక్సీన్ అంటే ఒక్కొక్కరికి దాదాపు పది డాలర్ల వరకు ఖర్చవుతుందని, మొత్తంగా అయితే భారత్‌కు 13 బిలియన్ల డాలర్లు ఖర్చవుతాయని నందన్ నిలేకని చెప్పారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే భారత్‌లో టీకా రూ.50 కంటే తక్కువగా ఉండేలా చూడాలని, ఒక్క డోసులోనే టీకా ఇచ్చేలా ఉండాలని గగన్‌దీప్ అభిప్రాయపడ్డారు.