సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (19:23 IST)

అరోన్ ఫించ్ అరుదైన రికార్డు-చాహల్ చెత్త రికార్డు

Yuzvendra Chahal_Aron Pinch
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు. తొలి వన్డేలో చాహల్‌ పేలవ బౌలింగ్‌తో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లు వేసి వికెట్‌ పడగొట్టిన చాహల్‌ 89 రన్స్‌ ఇచ్చాడు. ముఖ్యంగా ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114), స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (105) చాహల్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు.
 
చాహల్‌ బౌలింగ్‌లో సిడ్నీ క్రికెట్‌ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడారు. వన్డే క్రికెట్‌లో ఓ భారత స్పిన్నర్‌ అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. మార్కస్‌ స్టాయినీస్‌ వికెట్‌ మాత్రమే తీసిన చాహల్‌ 10-0-89-1 గణాంకాలు నమోదు చేశాడు. 
 
అయితే భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు సాధించిన రెండో ఆసీస్ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఫించ్ 126 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. 
 
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఇటీవల కన్నుమూసిన డీన్ జోన్స్ 128 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, ఫించ్ రెండు ఇన్నింగ్స్‌ల ముందే ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. 115 ఇన్నింగ్స్‌లలోనే 5 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ముందున్నాడు.