మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 17 ఏప్రియల్ 2021 (17:10 IST)

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎలా ఉంది? కేసులు ఇలాగే పెరిగితే ప్రభుత్వ ఏర్పాట్లు సరిపోతాయా?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్‌ సమస్యలు, విషాదాల దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్నట్లు కనబడుతుండగా వైద్య సదుపాయాలలో విప్లవాత్మక మార్పులేమీ రాలేదు. దీంతో ఆసుపత్రులతోపాటు శ్మశానాల వద్ద కూడా క్యూ కట్టాల్సిన దుస్థితి ప్రజలను కలవర పెడుతోంది.

 
దేశంలోని 10 రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్టు కేంద్రం చెబుతుండగా, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. కానీ గత అనుభవాలను చూసినప్పుడు రాష్ట్రంలో ఒక్కసారిగా కేసులు పెరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన మాత్రం ఉంది. సమీక్షలు, కంట్రోల్‌ రూమ్‌, కాల్‌ సెంటర్‌ల ఏర్పాటువంటి వాటితో అప్రమత్తంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ప్రయత్నాలు ఎంతవరకూ అమలవుతున్నాయన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నం చేసింది.

 
పాత సదుపాయాలకు తాళం
కోవిడ్‌ తీవ్రతను ఎదుర్కొనేందుకు గత ఏడాది అదనపు వార్డులు సిద్ధం చేయడం, పీపీఈ కిట్లు సొంతంగా తయారు చేసుకోవడం, ఆక్సీజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటు వంటి ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత నవంబర్‌ తర్వాత కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు తగ్గించి తిరిగి సాధారణ ఆసుపత్రులుగా మార్చింది. కోవిడ్‌ కేర్‌ సెంటర్లన్నీ మూతపడ్డాయి.

 
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందించే కోవిడ్‌ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. టెస్టుల కోసం సిద్ధం చేసిన వాహనాలను మార్చేశారు. చివరకు రాష్ట్ర స్థాయిలో కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడా మూసేశారు. మొత్తంగా యాక్టివ్‌ కేసులు స్వల్పంగా ఉండడంతో మార్చి మధ్య వరకూ కోవిడ్ విషయాన్ని దాదాపుగా ఖాతరు చేసే పరిస్థితిలో లేదు ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

 
మొదటికొచ్చిన వ్యవహారం
మార్చి మొదటి వారంలో రోజుకి 50, 60 కేసులు నమోదైన దశ నుంచి, ఏప్రిల్‌ మధ్యకి వచ్చే సరికి అంటే నెల రోజుల వ్యవధిలో 100 రెట్లకు కేసులు పెరిగాయి. తాజాగా ఏప్రిల్ 15 నాటి బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 5,086 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 31,730కి చేరాయి. దీంతో ఆందోళన పెరిగింది. వరుసగా గురువారం ఉన్నతస్థాయి అధికారులతోనూ, శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోనూ ముఖ్యమంత్రి సమీక్షలు చేశారు.

 
"104 కాల్‌ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. అంబులెన్సుతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలి. రోగి ఫోన్‌ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాలి." అని సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెడిసిన్, శానిటేషన్, ఆహారం విషయంలో రాజీ పడవద్దని, ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.

 
ఆస్పత్రులలో ఆక్సీజన్‌ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలని, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అన్నిచోట్లా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఇప్పుడు 6.03 శాతంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 15,669 బెడ్లు, 1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎం సమీక్షలో అధికారులు వెల్లడించారు.

 
మళ్లీ బెడ్స్‌ కొరత వస్తుందా?
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కోవిడ్ చికిత్సకి అనుమతినిచ్చారు. మొత్తం 117 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో 2136 ఐసీయూ బెడ్స్ ఉండగా, వాటిలో పావువంతు 537 ఆక్యుపై అయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్‌ సరఫరా ఉన్న బెడ్స్ 9544 ఉండగా అందులో 2788 బెడ్స్ ఆక్యుపై అయినట్టు 16వ తేదీ నాటి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

 
గతంలో కోవిడ్‌కు ప్రత్యేక ఆసుపత్రులుగా కేవలం ఆ సమస్యతో వచ్చిన రోగులకు మాత్రమే వైద్యం అందించగా, ఇప్పుడు ఇతర రోగులతో కలిపి చికిత్స అందిస్తున్నారని విజయవాడకు చెందిన రామారావు బీబీసీతో అన్నారు. "మా అన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాము. అక్కడ మొదట బెడ్స్, కరోనాకు ప్రత్యేక చికిత్స ఏర్పాట్లు లేవన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు భరించలేమని బతిమాలితే చివరకు బెడ్ ఇచ్చారు. మా బంధువులు ఒకరిని ప్రైవేటు ఆస్పత్రిలో పెట్టారు. చికిత్సకే రోజుకు రూ. 25వేలు తీసుకుంటున్నారు. వెంటిలేటర్‌కు రూ.70 వేలకు పైనే అవుతోంది. కేసులు పెరిగితే ప్రభుత్వాసుపత్రిల్లో బెడ్స్‌ దొరకడం కష్టం" అన్నారు రామారావు.

 
సమన్వయం ఎక్కడా, జిల్లా స్థాయిలో సమీక్షలేవి?
ఇటీవల ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఓట్లు వేయడానికి గ్రామాలకు వచ్చిన వారి ద్వారా వైరస్ మరోసారి వ్యాపించి ఉంటుందని సామాజికవేత్త తాళ్లూరి రవిరాయల్‌ అంచన వేస్తున్నారు. ఈసారి పిల్లల్లో ఎక్కువగా కరోనా సమస్య కనిపిస్తోందని, పరిస్థితికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. "రెండు వారాల పాటు స్కూళ్లన్నీ ఆన్‌లైన్‌కే పరిమితం చేయడం మంచిది. కానీ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు.

 
ప్రభుత్వ ఆసుపత్రల్లో సదుపాయాల మీద సీఎం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నారు. కానీ జిల్లా స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసే వారెవరు" అన్నారు తాళ్లూరి రవి. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించామని, సీఎం సూచనల మేరకు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

 
టెస్టుల్లోఆలస్యం
కరోనా పరీక్షల కోసం గతంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కానీ, కొంతకాలంగా అవన్నీ అందుబాటులో లేవు. ఇప్పుడు పలువురు లక్షణాలతో కరోనా టెస్టుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పరీక్షా కేంద్రంలో కరోనా టెస్టు కోసం అనుమానితులు నాలుగైదు గంటల పాటు క్యూలో నిలిచోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

 
"మా ఇంట్లో ముగ్గురికి కరోనా లక్షణాలున్నాయి. ప్రైవేటు పరీక్షల కోసం వెళితే ముగ్గురికి రూ.6 వేలకు పైనే అవుతుంది. అందుకే హెల్త్ సెంటర్‌కి వచ్చాం. ఇక్కడ ఆలస్యమవుతున్నా తప్పడం లేదు. తొలిరోజు పరీక్షలు చేసి రిపోర్టులు మరునాడు ఇస్తామని చెప్పారు. అప్పటి వరకూ హోమ్‌ క్వారంటైన్ కావాలని అన్నారు. మందులు, కిట్‌ లాంటివేమీ ఇవ్వలేదు. పరీక్షా కేంద్రాలు పెంచడం మంచిది." అని స్థానికురాలు కె.సత్యప్రభ బీబీసీతో అన్నారు.

 
15వ తేదీ బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మందికి పరీక్షలు చేశారు. గతంలో రోజుకి 70 వేల వరకూ పరీక్షలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో అవసరం ఉన్నప్పటికీ అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నట్టు కనిపిస్తోంది. కొందరు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు.

 
కోవిడ్ కిట్లు పంపిణీ లేదు..
కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం చెబుతోంది. వారికి 7 రకాల మందులు, శానిటైజర్‌లాంటి వాటితో కలిపి ఓ కిట్‌ అందిస్తామని అంటోంది. కానీ ఆచరణలో అత్యధికులకు అలాంటి కిట్ అందుతున్న దాఖలాలు లేవు. "నాతోపాటు మా ఇంట్లో ఇద్దరు కోవిడ్‌ బాధితులం ఉన్నాం. హోం ఐసోలేషన్‌ ఉన్నా, ప్రభుత్వం నుంచి ఏమీ అందలేదు" అని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎల్‌.దామోదర్‌ రావు బీబీసీకి వివరించారు.

 
జాగ్రత్తలు తీసుకుంటాం..
రాష్ట్రంలో గత ఏడాది అనుభవాలతో ఈసారి కరోనా కేసులు పెరిగినప్పటికీ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, ఆక్సీజన్‌, రెమ్‌డెసివిర్‌ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని ఆయన తెలిపారు.

 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని, ఒక్క రోజులోనే 6 లక్షల మందికి వ్యాక్సీన్‌ అందించామని మంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్, కోవిడ్ ట్రీట్మెంట్ ఏకకాలంలో జరుగుతున్నాయని, వైరస్‌ తీవ్రత ఎక్కువ అవుతున్నందున అవసరమైతే అదనపు ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు.