ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం.. టీటీడీ శ్రీరామనవమి రోజున..?
ఆంజనేయుడు ఆంధ్రలోనే పుట్టారని టీటీడీ అంటోంది. తిరుమలనే ఆయన జన్మస్థలమని అంటోంది. కానీ కర్ణాటక మాత్రం ఆయన కన్నడిగుడే అంటోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? చరిత్రకారులు ఏమంటున్నారు? టీటీడీ చెబుతున్న ఆధారాలు ఎంత వరకు నిజం? కన్నడిగుల వాదనల్లో పస ఎంత? వారు చూపిస్తున్న ఆధారాలేంటి? అనే అంశాలపై వివాదం రాజుకుంది.
కొందరు మహారాష్ట్రల్లో ఆంజనేయుడు పుట్టాడు అంటుంటే, మరికొందరు గుజరాత్ అంటున్నారు. ఇంకొందరైతే జార్ఖండ్‌లోనే హనుమంతుడు జన్మిండానికి కొత్త వాదనలు వినిపిస్తున్నారు. అవేవీ కావు.. హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని… అంజనాద్రే మారుతి పుట్టిన ప్రాంతమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
అంజనాద్రిలోనే ఆంజనేయుడు పుట్టాడంటున్న టీటీడీ… అందుకు చారిత్రక ఆధారాలున్నాయని, వాటిని ఉగాది నాడు ప్రకటిస్తామని పేర్కొంది. కానీ, ఇప్పుడు ఆ ప్రకటనను వాయిదా వేసుకుంది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెబుతోంది టీటీడీ. ఇప్పటికే టీటీడీ పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, పరిశోధించి హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని నిర్ధారించామంటోంది. ఈ ప్రకటనతో వివాదం మళ్లీ మొదలైంది.
అసలు ఆంజనేయుడు జన్మించింది తమ ప్రాంతంలోనేనని కన్నడిగులు వాదిస్తున్నారు. టీటీడీ ప్రకటనపై కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయుని పుట్టుక ప్రాంతం హంపియే అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారంటున్నారు. టీటీడీ తొందర పడకుండా, నిపుణులను, చరిత్రకారులను సంప్రదించిన తర్వాతే ప్రకటించాలని హితవు పలుకుతున్నారు.
మరోపక్క, చరిత్రకారులు మాత్రం హంపి లేదా విజయనగర సామ్రాజ్య పరిధిలోని కిష్కింద క్షేత్రం హనుమాన్ జన్మస్థలమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున జన్మించాడని మరో వాదన కూడా ఉంది.
షిమోగలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామాయణంలో సీతకు హనుమంతుడు అదే విషయాన్ని ప్రస్తావించాడని ఆయన చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం టీటీడీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ ప్రకటనపైనే విభేదాలు వస్తున్న నేపథ్యంలో… అది చూపించే ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి టీటీడీ పరిశోధన కమిటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి.