మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 11 మే 2021 (19:05 IST)

కరోనావైరస్: కోర్టులు కఠినంగా ఉంటే ప్రభుత్వాల పని తీరు మారుతుందా? మరి ఇక శాసన వ్యవస్థ ఎందుకు?

''దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు ఎన్నికల సంఘానిదే బాధ్యత. కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నా చర్యలు తీసుకోని ఈసీ అధికారులపై విచారణ జరపాలి''- మద్రాస్ హైకోర్టు (27 ఏప్రిల్)
 
''కోవిడ్ -19 రోగుల మృతి ఒక 'నేరం', ఇది మానవ హననానికి ఏమాత్రం తక్కువ కాదు- అలహాబాద్ హైకోర్టు (4 మే)
 
''మీరు తలను ఇసుకలో దాచుకున్న ఉష్ట్రపక్షి కావచ్చు. మేం అలా కాదు''- దిల్లీ హైకోర్టు, (4 మే)
 
''ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దిల్లీకి సరఫరా చేయాలని మేము ఆదేశిస్తున్నాం. దీన్ని మేం చాలా సీరియస్‌గా చెబుతున్నాం. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని తీసుకు రావద్దు''- సుప్రీంకోర్టు (7 మే)
 
కరోనా వైరస్ కట్టడి విషయంలో వివిధ సందర్భాలలో కోర్టులు పలు ప్రభుత్వాలకు చేసిన హెచ్చరికలు ఇవి. ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కొంతవరకు ప్రభావం కూడా చూపాయి. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల తర్వాత ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎలాంటి విజయోత్సవాలు, ఊరేగింపులు జరపరాదని, అలాగే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వారు కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టు చూపాల్సిందేనని ఆదేశించింది.
ఇక ఆక్సిజన్ సంక్షోభంపై దిల్లీ హైకోర్టు ఆదేశాల తర్వాత మునుపటికంటే సరఫరాలో కొంత మెరుగుదల కనిపించింది.

 
కోర్టుల వైఖరిలో మార్పు వచ్చిందా?
''న్యాయస్థానాలకు ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత కలిగి ఉన్నాయి. ప్రజల అవసరాలు చాలా ముఖ్యమైనవని కోర్టులు భావిస్తాయి. ఒకప్పుడు న్యాయవ్యవస్థలో కూడా కొంత భయం ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు.'' అని దిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జడ్జి ఒకరు వెల్లడించారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

 
''గత రెండేళ్ల కాలంలో న్యాయమూర్తులు ఇంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని నేను చూడలేదు. న్యాయస్థానాల వైఖరిలో చాలా మార్పు వచ్చింది. 10 రోజుల్లో పరిస్థితులు కూడా మారిపోయాయి'' అని ఆయన అన్నారు. ''జరుగుతున్న పరిణామాల విషయంలో అందరూ ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో న్యాయమూర్తులు మౌనంగా ఉండలేరు. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజలు చనిపోతున్నారు. దీనికి న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇది సహజమైన రియాక్షన్'' అన్నారాయన.

 
''న్యాయస్థానాల నిగ్రహానికి కూడా పరిమితులు ఉంటాయి. అయితే కోర్టులు అనుచితమైన, కఠిన పదాలను ఉపయోగించడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పడం కూడా మంచిదే'' అన్నారు ఆ న్యాయమూర్తి. ''చాలా కాలం తరువాత, భారత న్యాయవ్యవస్థ సిసలైన న్యాయవ్యవస్థలా వ్యవహరిస్తోంది.'' అన్నారాయన.

 
వ్యవస్థల మధ్య సమతుల్యత దెబ్బతింటోందా?
ఇటీవలి కాలంలో కోర్టుల వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ స్పందించింది. ''మన ప్రజాస్వామ్యం మూడు (శాసన, కార్యనిర్వాహక, న్యాయ) వ్యవస్థల సమతుల్యత మీద నడుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నడిపించే మూడు స్తంభాలకు వాటి పరిధులను రాజ్యాంగం నిర్వచిస్తోంది. ఈ మూడూ సమన్వయంతో పని చేస్తేనే ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకరి పరిధిలోకి ఒకరు ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు సమస్యలు వస్తాయి'' అని బీజేపీ ప్రతినిధి, సుప్రీంకోర్టు న్యాయవాది అమితాబ్ సిన్హా అన్నారు.

 
''ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు కోర్టులు మాట్లాడటం ప్రారంభిస్తాయి. కోర్టులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాయి'' అని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ వ్యాఖ్యానించారు. ''ప్రస్తుత కాలంలో కోర్టులే బలంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో ప్రభుత్వాలు చేయాల్సిన పనిని న్యాయ స్థానాలు చేస్తున్నాయి. ఇది అధికార సమతుల్యతను దెబ్బతీస్తుంది'' అన్నారు రిటైర్డ్ జస్టిస్ లిబర్హాన్. కోర్టులు చేసే తీవ్రమైన వ్యాఖ్యలు ప్రజల నుంచి ప్రశంసలను పొందటానికేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 
'ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు'
ఆక్సిజన్ సంక్షోభం కేసులలో కోర్టుల పాత్ర ఏంటని జస్టిస్ లిబర్హాన్‌ను బీబీసీ ప్రశ్నించింది. '' కోర్టులు ప్రభుత్వానికి సూచనలు ఇస్తాయి, క్రియాశీలం చేస్తాయి'' అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆ సూచనలను పాటించకపోతే కోర్టు ఏం చేయాలి అని అడిగినప్పుడు ''మాట వినని వారిని జైలుకు పంపాలి'' అని లిబర్హాన్ అన్నారు.

 
''కోర్టులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అనవసరమైనవి. అవి తీర్పులో భాగం కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు'' అన్నారాయన. ''న్యాయమూర్తుల నియామకాలలో కొన్ని నిబంధనలున్నాయి. కొన్నిసార్లు న్యాయమూర్తుల ఎంపికలో కుల కోటా ఉంటుంది. నాలుగేళ్ల కిందట దీనిపై చర్చ జరిగింది.

 
నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయాలని పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయించింది. న్యాయవ్యవస్థ దానిని కాదన్నప్పుడు కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు ఆ నిర్ణయాన్ని గౌరవించాయి. దానిపై మళ్లీ చర్చ జరగలేదు.'' అన్నారు సిన్హా. ఎన్‌జేఏసీ ఏర్పాటు చేయడం తప్పుకాదని అమితాబ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ''సీబీఐ డైరెక్టర్‌ నియామకం విషయంలో ప్రధాన న్యాయమూర్తి సమ్మతి తీసుకున్నట్లే, న్యాయమూర్తుల నియామకం విషయంలో కూడా ఒక వ్యవస్థ ఉండటం అవసరం. ఇందుకోసం పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసినా, సుప్రీంకోర్టు దాన్ని కాదంది. అది తన అధికార పరిధిని దాటటమే'' అన్నారు సిన్హా.

 
ఆదేశాలు పాటించాలని కోర్టులు ప్రభుత్వాలను శాసించగలవా?
పనులు చేసేలా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు కొంతవరకే ప్రోత్సహించగలవని హైదరాబాద్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా లో న్యాయ నిపుణులు, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు. ''గ్రౌండ్‌ లెవెల్‌లో పరిస్థితులు చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నాయి. దీంతో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోక తప్పడం లేదు. అయినా, ఉత్తర్వుల ఉల్లంఘన సాగితే, కోర్టులు కూడా ఏమీ చేయలేవని నేను అనుకుంటున్నా. వారు ప్రభుత్వాన్నయితే రద్దు చేయలేరుగా?'' అని ఆయన అన్నారు.

 
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలేంటి?
ప్రస్తుత ప్రభుత్వం తన ఇమేజ్‌ను కాపాడుకోవడంలో చాలా బిజీగా ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రభుత్వాన్ని తరచూ విమర్శించే ప్రశాంత్ భూషణ్ అన్నారు. ''కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ, అమిత్‌షా అనే ఇద్దరే నడుపుతున్నారు. ప్రతి ఒక్కరు వారికి భయపడుతున్నారు. వారికి ఎవరూ చెప్పే స్థితిలో లేరు. సరైన వ్యవస్థ లేదు. అన్నింటినీ ధ్వంసం చేశారు. తమను ఎవరూ ప్రశ్నించలేరు అనుకున్నారు. కానీ కోర్టులు వారిని ప్రశ్నిస్తున్నాయి.'' అన్నారు ప్రశాంత్ భూషణ్.

 
మరి కోర్టులు ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించగలవా? అంటే 'అవును' అన్నారు ప్రశాంత్ భూషణ్. ''కోర్టులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ధిక్కారానికి పాల్పడ్డ అధికారులను శిక్షించాలి'' అన్నారాయన. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ప్రశాంత్ ‌భూషణ్‌ను సుప్రీంకోర్టు గతంలో దోషిగా నిర్ధారించింది. ఆయనకు ఒక్క రూపాయి జరిమానా విధించింది. ''న్యాయస్థానాల ఆగ్రహం, ప్రభుత్వ ఆగ్రహాల మధ్య అధికారులు నిర్ణయం తీసుకోవాలి. చివరికి తాము కోర్టుల ఆదేశాలను పాటించడం తప్ప వేరే మార్గం లేదని వారు ప్రభుత్వానికి చెప్పాలి'' అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.

 
అయితే, న్యాయస్థానాలు తమ పరిధిని, మర్యాదలను అతిక్రమించకుండా జాగ్రత్త పడాలని బీజేపీ ప్రతినిధి అమితాబ్ సిన్హా అన్నారు. ''కార్యనిర్వాహక వ్యవస్థకు తన పనిని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలి. న్యాయవ్యవస్థ ఏదైనా ఆదేశించాలనుకుంటే ఆదేశించవచ్చు. కానీ మూడు ప్రజాస్వామ్య స్తంభాలు ఒకరినొకరు గౌరవించుకోవాలి'' అని సిన్హా అన్నారు.