ఆ గ్రామంలో కరోనాకు నో ఎంట్రీ, ఎక్కడుందా గ్రామం?
దేశమంతటా కరోనా జనాన్ని భయపడుతుంటే ఆ గ్రామంలోకి మాత్రం కనీసం ఎంట్రీ ఇవ్వలేకపోతోందట. కోవిడ్ కట్టడికి ఆ గ్రామస్థులు తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ ఆదర్సంగా నిలుస్తున్నాయి. అసలు కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో వైరస్ ఆ గ్రామాన్ని ఎందుకు టచ్ చేయలేకపోతోంది.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే జిల్లాలోని ఒక్క గ్రామంలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం జిల్లా వాసులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందట. మేడిపల్లి మండలం రాగోజీపేట చిన్న పల్లెటూరు. గ్రామంలో 382 ఇళ్ళున్నాయి. 1100 మంది నివసిస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్‌లో అయితే కేవలం మూడే కేసులు నమోదయ్యాయట. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక సెకండ్ వేవ్ అయితే జిల్లా అంతటా ఉదృతంగా విస్తరిస్తోంది. ఇలాంటి తరుణంలో రాగోజీపేటలో స్వచ్ఛంధ లాక్ డౌన్‌ను విధించుకున్నారు.
ఇప్పుడు ఎవరైనా గ్రామంలోకి రావాలంటే ముందుగానే సర్పంచ్‌కు చెప్పాల్సి ఉంటుంది. గ్రామంలోకి వచ్చే దారిని పూర్తిగా మూసివేశారు. ఉదయం, సాయంత్రం కొద్దిసేపు అక్కడే ఉంటారు గ్రామ సర్పంచ్. బయట నుంచి ఎవరైనా వస్తే ముందుగానే శానిటైజ్ చేస్తున్నారు.
ఎక్కువసేపు గ్రామంలో ఉండద్దంటూ హెచ్చరిస్తున్నారు. అలా వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటున్నారు గ్రామస్తులు. పారిశుధ్య కార్మికులతో హైపోక్లోరైడ్, డ్రైనేజీ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటేనే గ్రామంలో ఆ గ్రామస్తులు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ నియంత్రణలో పాటిస్తున్న నియమాలు చూసి సమీప గ్రామస్తులు మెచ్చుకుంటున్నారట.