శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (10:43 IST)

రాష్ట్రాల లాక్డౌన్ ఎఫెక్టు... దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా, దేశ వ్యాప్త లాక్డౌన్ విధించేందుకు ఆయన ఏమాత్రం సుముఖంగా లేరు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆయా పలు ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాల ప్రజలను రక్షించుకేందుకు లాక్డౌన్‌ను ప్రకటించాయి. దీని పుణ్యమాని దేశ వ్యాప్తంకా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 
 
గడిచిన 24 గంటల్లో దేశంలో 3,29,942 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,56,082 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,29,92,517కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,876 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,49,992కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. 37,15,221 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,27,10,066  మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,56,00,187 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,50,110 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.