మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (18:58 IST)

ఏపీలో మొత్తం కరోనా కేసులు 13 లక్షలు ... 6 వేల కరోనా రోగులు మిస్సింగ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ ఉధృతి కొనసాగుతుండటంతో కొత్తగా 14 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,968 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16,167 మంది చికిత్సకు కోలుకున్నారు. 84 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఏపీలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 13,02,589కి పెరిగాయి. 11,04,431 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 1,89,367కు చేరాయి. 8791 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 60,124 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నాటక రాజధాని బెంగళూరు నగరంపై పంజా విసిరింది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా పేషెంట్లతో కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. 
 
మరోవైపు కరోనా వచ్చినవారు ఐసొలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. చదువుకున్నవారు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెంగళూరులో సుమారు 6 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. ఈ వార్తతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
 
గతంలో కూడా దాదాపు 10 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియలేదు.