శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 10 మే 2021 (14:46 IST)

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్‌ వేరియంట్ 1000 రెట్లు స్పీడా, అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ వేరియంట్... ఇప్పుడీ మాట అందర్నీ భయపెడుతోంది. ఏపీలోని కర్నూలులో పుట్టి, విశాఖలో పెరుగుతోన్న ఒక రకమైన కరోనా వైరస్ (వేరియంట్) అత్యంత వేగంగా, ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే వెయ్యి రెట్లు వేగంగా పాకిపోతోందని వచ్చిన వార్తలు కలకలం రేపాయి. దీనిపై రాజకీయ కలకలం కూడా చెలరేగింది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు కూడా పెట్టింది. ఆ వైరస్ అంత పవర్‌ఫుల్లా? నిపుణులు ఏమంటున్నారు?

 
వేరియంట్ అంటే ఏంటి?
వైరస్ అనేది ఏదైనా జీవిలో ఉన్నప్పుడు పెరుగుతూ వెళ్తుంది. అది మనిషిలో అనుకుంటే శరీరంలో ఉన్నప్పుడు వైరస్ తన కణాల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. దీన్నే రెప్లికేట్ అంటారు. అలా పెరుగుతూ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో అది తనలో తాను కొన్ని మార్పులు చెందుతుంది. దాన్నే మ్యుటేషన్ అంటున్నాం. ఇలా కొన్ని రకాల మ్యుటేషన్‌లు కలిసి 2-3 నెలల వ్యవధిలో ఒక వేరియంట్‌గా ఉద్భవిస్తాయి.

 
వైరస్ మ్యుటేషన్ జరిగినప్పుడు దాని వల్ల వచ్చే రోగ లక్షణాలు, వ్యాపించే వేగం, అది శరీరంపై చూపే ప్రభావం వంటివి మారతాయి. ఇలా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కొన్ని వందల, వేల మ్యుటేషన్లు జరిగి కొన్ని వేరియంట్లుగా మారాయి. కానీ, అన్నింటి గురించీ చర్చ జరగదు. వాటిలో కొన్నే బాగా వ్యాపిస్తాయి.

 
''ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వందల వేరియంట్లలో కేవలం మూడు వేరియంట్లను మాత్రమే మనం తీవ్రంగా పరిగణించాలి. సౌతాఫ్రికా, బ్రెజిల్, యూకే... ఇవే ఆ మూడు వేరియంట్లు. మరో 7 వేరియంట్లను పరిశీలించాలి. ఆ ఏడింటిలో మహారాష్ట్ర వేరియంట్ ఉంది'' అని వివరించారు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు డా. మాదాల కిరణ్. మనం ప్రస్తుతం యూకే వేరియెంట్‌గా పిలుస్తున్న దానిలో 23 మ్యుటేషన్లు, మహారాష్ట్ర వేరియంట్లో 15 మ్యుటేషన్లూ ఉన్నాయి.

 
ప్రస్తుతం భారత్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?
భారత్‌లో ఎన్నో రకాలు వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో కొన్ని అధిక కేసులకు కారణం అవుతున్నాయి. కొన్ని తక్కువ కేసుల్లో ఉన్నాయి. ''డబుల్ మ్యూటెంట్‌గా పిలిచే ఈ వేరియంట్ మహారాష్ట్రలో 50-60 శాతం కేసులకు కారణమైంది. ఈ డబుల్ మ్యూటెంట్‌లో కాస్త తీవ్ర లక్షణాలున్నాయి. పంజాబ్‌లో యూకే వేరియంట్ ఉంది.

 
మహారాష్ట్ర వేరియంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కూడా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణల్లో 20 శాతం కేసులు అవే వస్తున్నాయి. బహుశా మిగతా వేరియంట్లు క్రమంగా పోయి అందరికీ ఇదే వస్తుందని అనుకుంటున్నాను'' అని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా బీబీసీతో అన్నారు. ''వేల మ్యుటేషన్లు, వేరియంట్లు వస్తాయి, పోతాయి. అవేవీ అంతగా వ్యాపించవు. కానీ, మనం వాటిని జాగ్రత్తగా గమనించక పోతే, ఏ వేరియంట్ అయినా కేసుల పెరుగుదలకు కారణం కావచ్చు'' అన్నారు రాకేశ్ మిశ్రా.

 
N440K వెయ్యి రెట్లు వేగంగా వ్యాపిస్తుందా?
''అది రూమర్ మాత్రమే, నిజం కాదు.. ఇప్పుడు అసలు ఎన్ 440 కె అనే దానికి ప్రాధాన్యతే లేదు. అప్పుడెప్పుడో నెలల క్రితం ఆ వైరస్ వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు బహుశా దక్షిణ భారతం మొత్తంలో 5 శాతం కేసులు కూడా రావట్లేదు. పైగా అది వేయి రెట్లు వేగంగా వ్యాపిస్తోంది అనడం తప్పు'' అని రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు.

 
మరణాల పెరుగుదలకీ, ఈ వేరియంటుకూ సంబంధం లేదని కూడా ఆయన అంటున్నారు. వాస్తవానికి యూకే వేరియంట్, మహారాష్ట్ర డబుల్ మ్యూటెంట్ దీనికంటే వేగవంతమైనవని ఆయన చెబుతున్నారు. వైరస్ వేగాన్ని ల్యాబ్ లోనూ మనిషి శరీరంలోనూ ఒకేలా చూడకూడదు అంటారు రాకేశ్ మిశ్రా. ''ల్యాబులో సెల్ కల్చర్‌లో వైరస్ చాలా వేగంగా పెరగవచ్చు. కానీ అంతే వేగంగా శరీరంలో పెరగదు. ఎందుకంటే ల్యాబులో దానికి కాంపిటీషన్ ఉండదు. మనిషి శరీంరలో ఉండే ఇమ్యూనిటీ ల్యాబులో ఉండదు. అందుకే అక్కడ వైరస్ పెరుగుతుంది. అందుకే ల్యాబులో వేగంగా పెరిగినవన్నీ, మనిషి శరీరంలో పెరగాలని లేదు'' అని వివరించారు రాకేశ్ మిశ్రా. 

 
ఆంధ్రప్రదేశ్ వేరియంట్ అనే పదంపై రాజకీయంగా చర్చ జరిగి, జనంలో భయం పెరగడంతో ఏపీ ప్రభుత్వం దాని మీద ఒక వివరణ కూడా ఇచ్చింది. ''ఎన్ 440 కె విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాన్ని గత ఏడాది జూన్-జులైలలో గుర్తించారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో వ్యాపించి మార్చిలో తగ్గిపోయింది. మూడు రాష్ట్రాల్లో ఉంది కానీ చాలా చాలా తక్కువగా ఉంది. ఇది నిజంగా ప్రమాదకారి అయితే ప్రపంచం ఆరోగ్య సంస్థ దీని గురించి ప్రస్తావించి ఉండేది. అది హానికరం అని ఐసీఎంఆర్ చెప్పి ఉండేది. ఇది పట్టించుకోవాల్సిన విషయం కాదు'' అని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధ్యక్షుడు కె.ఎస్.జవహర్‌ రెడ్డి అన్నారు.

 
ప్రపంచం వ్యాప్తంగా వివిధ సంస్థలూ, ప్రముఖ శాస్త్రవేత్తలూ నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్‌ఫ్లూయెంజా సర్వేలియన్స్ అండ్ రెస్పాన్సివ్ సిస్టం (జీఐఎస్ఏఐడి) సమాచారం కూడా ఎన్ 440 కె మ్యూటెంట్‌కు తీవ్రత లేదనే చెబుతోంది. ''ఎన్ 440కె కర్నూలు నుంచి దేశమంతా వ్యాపించింది కానీ, అది జరిగింది గత ఏడాది. ఇప్పుడు కాదు'' అన్నారు డాక్టర్ కిరణ్.

 
మహారాష్ట్ర వేరియంట్ ప్రమాదకరమా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దీన్ని ఇప్పుడు డబుల్ మ్యుటెంట్ అంటున్నారు. మహారాష్ట్ర వేరియంట్లో ఉన్న రెండు మ్యుటేషన్‌ల (L452R / E484Q) తీవ్రత ఎక్కువగా ఉంది. ''మహారాష్ట్ర మ్యుటేషన్లు రెండూ మనిషి శరీరంలో ఏసీఈ2 రెసిప్టార్‌తో బలమైన బంధం ఏర్పాటు చేసుకుంటున్నాయి. దానివల్ల ఇది తీవ్ర లక్షణాలను కలగజేస్తోంది'' అన్నారు కిరణ్.

 
అటు విశాఖపట్నంలో కేసుల తీవ్రత పెరుగుతున్నట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. ''వైరస్ ఇంక్యుబేషన్ కాలం... అంటే లక్షణాలు చూపించే కాలం బాగా తగ్గింది. గతంలో ఏడు రోజులు పట్టేది. ఇప్పుడు మూడు రోజుల్లోనే చూపిస్తోంది. దగ్గు పెరిగింది. యువతపై కూడా ప్రభావం చూపుతోంది. మరణాల శాతం కూడా పెరిగింది. అలాగే ఆక్సిజన్ అవసరం అయ్యేవారి శాతం 15కి వెళ్లింది. మొత్తానికి దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. మరో రెండు నెలలు ఇలాగే ఉండొచ్చు'' అని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ బీబీసీతో అన్నారు.

 
అయితే, విశాఖలో కేసుల్లో తీవ్రతకు కారణం మహారాష్ట్ర వేరియంటా, మరొకటా అన్నదాంట్లో స్పష్టత లేదు. అదే సమయంలో జీఐఎస్ఏఐడీ డేటా చూస్తే, అక్కడ మహారాష్ట్ర వేరియంట్‌తో పాటు ఏ2ఏ అనే మరో వేరియంట్ కూడా ఉంది.
''విశాఖ నుంచి 36 శాంపిళ్లు పరిశీలించినప్పుడు మహారాష్ట్ర వేరియంట్ 33 శాతం ఉంది. ఎన్ 440 కె 5 శాతం, ఏ2ఏ 62 శాతం ఉంది. విశాఖలో యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లు లేవు'' అన్నారు డాక్టర్‌ కిరణ్.

 
కొత్త వేరియంట్లు పుట్టకుండా ఆపలేమా?
వైరస్ కొత్తగా మారేకొద్దీ కొత్త సమస్యలు వస్తున్నట్టే.. కానీ ఆ వైరస్ మ్యుటేట్ అవ్వకుండా, వేరియంట్లు పుట్టకుండా ఉంటే? ఏ సమస్యా ఉండదు. మరి వైరస్ అలా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ''ఏ మందూ, వ్యాక్సీన్, ఏ డ్రగ్ కూడా వైరస్ మ్యుటెంట్ కాకుండా ఆపలేదు. మనిషి మాత్రమే ఆపగలడు'' అన్నారు రాకేశ్ మిశ్రా.

 
అదెలా అంటే...
వైరస్ ఒక మనిషి శరీరంలో మ్యుటేట్ కావడమే కాకుండా, పక్కవారికి వ్యాపించి వారిలో కూడా మ్యుటేట్ అవుతూ పోతుంది. అదే ఆ మనిషి తనలోని వైరస్‌ పక్కవారికి అంటకుండా జాగ్రత్త పడితే అది ఆ మనిషిలోనే ఉండి పోతుంది. అంటే ఆ మ్యుటేషన్ అక్కడితో ఆగిపోతుంది. వైరస్‌ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించకుండ చేసే మార్గం - మాస్క్ వేసుకోవడం. ''మాస్కు వేసుకుంటే మహారాష్ట్ర వేరియంట్, యూకే వేరియంట్ కాదు కదా.. ప్రపంచంలోని ఏ వేరియంటూ ఏమీ చేయలేదు. మాస్కు వేసుకుంటే వైరస్ పాకదు. మ్యుటేషనూ జరగదు'' అని రాకేశ్ మిశ్రా బీబీసీకి వివరించారు.

 
కొత్త మ్యూటేషన్లపై వ్యాక్సీన్ పని చేస్తుందా?
''అన్ని మ్యుటేషన్లు, వేరియంట్లపై వ్యాక్సీన్ కచ్చితంగా పనిచేస్తుందని నేను చెప్పలేను. కానీ ప్రస్తుతం భారత్‌లో కనిపించిన అన్ని మ్యుటేషన్లు, వేరియంట్లను ఇప్పుడున్న వ్యాక్సీన్‌లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి'' అన్నారు రాకేశ్ మిశ్రా.

 
''కొత్త వేరియంట్ ఏదైనా పుడితే ప్రమాదకరం అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి కొత్త దాన్ని రానివ్వకూడదు. కొత్తది పుట్టకూడదు... అంటే వైరస్ వ్యాపించకూడదు. వ్యాపించకూడదు అంటే మాస్కు వేసుకోవాలి'' అన్నారు రాకేశ్‌ మిశ్రా.
(విశాఖపట్నం నుంచి లక్కోజు శ్రీనివాస్‌ అదనపు సమాచారం అందించారు)