సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (14:54 IST)

కరోనా సహాయ చర్యలకు సన్ టీవీ భారీ విరాళం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు, సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ భారీ విరాళాన్ని ప్రకటించింది. 
 
దేశంలో కొవిడ్ సహాయ చర్యలకు రూ.30 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కొవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాల కోసం అందిస్తున్నట్టు సన్ టీవీ వివరించింది.
 
సన్ టీవీ అధీనంలోని అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. తద్వారా భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.
 
కాగా, తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సన్‌టీవీ యాజమాన్యానికి సమీప బంధువు. ఈ నేపథ్యంలో సన్ టీవీ యాజమాన్యం భారీ విరాళాన్ని ప్రకటించడం గమనార్హం.