సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (12:43 IST)

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిచిన కరోనా వైరస్.. అప్రమత్తమైన చైనా!

కరోనా వైరస్ వ్యాపించని ప్రాంతమంటూ ఏదీ లేకుండా పోతోంది. చివరకు మంచు పర్వతమైన ఎవరెస్ట్ శిఖరంపైకి కూడా చేరిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చైనా.. ఈ వైరస్‌ తమ దేశంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 
 
మౌంట్ ఎవ‌రెస్ట్‌ని అధిరోహించ‌డానికి వ‌చ్చిన ప‌ర్వ‌తారోహ‌కుల‌కూ ఇది సోకింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌లో ఉన్న 30 మంది దీని బారిన ప‌డ్డారు. దీంతో తాము సృష్టించిన ఈ విప‌త్తు మ‌ళ్లీ త‌మ వైపు రాకుండా ఉండేందుకు ప‌క్క‌నే ఉన్న చైనా అప్ర‌మ‌త్త‌మైంది. 
 
ఎవ‌రెస్ట్ నేపాల్‌లో ఉన్నా.. దాని ఉత్త‌ర భాగం మాత్రం చైనా ఆధీనంలో ఉంది. ఆ వైపు నుంచి ప‌ర్వ‌తారోహ‌కులు ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహిస్తారు. దీంతో త‌మ వైపు వారికి వైర‌స్ సోక‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు ఆ దేశ అధికార మీడియా వెల్ల‌డించింది.
 
ఎవ‌రెస్ట్‌పై ప్ర‌త్యేకంగా ఓ లైన్ ఏర్పాటు చేస్తోంది. త‌మ వైపు నుంచి ఈ శిఖ‌రాన్ని ఎక్కిన వాళ్లు ఆ లైన్ దాట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఉత్త‌ర‌, ద‌క్షిణ వైపు నుంచి ఎక్కేవ క్లైంబ‌ర్స్ మ‌ధ్య కాంటాక్ట్ ఉండ‌కుండా తాము అత్యంత క‌ఠిన‌మైన వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు టిబెట్ అధికారులు వెల్ల‌డించారు.
 
ఈ ఏడాది ఎవ‌రెస్ట్ ఎక్క‌డానికి 21 మందికి చైనా అనుమ‌తి ఇచ్చింది. ఏప్రిల్ నుంచే వీళ్లంతా టిబెట్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. త‌మ వైపు ఉన్న ఎవ‌రెస్ట్ స‌మీపంలో వైర‌స్ లేకుండా చూడ‌టానికి సాధార‌ణ టూరిస్టుల‌ను చైనా ఇప్ప‌టికే నిషేధించింది. గ‌తేడాది నుంచి క‌రోనా కార‌ణంగా విదేశీ క్లైంబ‌ర్స్‌ను కూడా అనుమ‌తించ‌డం లేదు. కేవ‌లం త‌మ దేశ ప‌ర్వ‌తారోహ‌కుల‌కే అనుమ‌తి ఇచ్చింది.
 
నేపాల్ కూడా గ‌తేడాది ఇలాగే చేసినా.. టూరిజాన్ని మ‌ళ్లీ గాడిలో ప‌డేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టుల‌ను కూడా అనుమ‌తించింది. ఎవ‌రెస్ట్ ఎక్క‌డానికి అనుమ‌తి కోస‌మే నేపాల్ ప్ర‌భుత్వానికి 11 వేల డాల‌ర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ త‌ర్వాత త‌మ సాహ‌స‌యాత్ర పూర్తి చేయ‌డానికి మ‌రో 40 వేల డాల‌ర్లు ఖ‌ర్చు అవుతుంది.