1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 11 ఆగస్టు 2021 (20:17 IST)

కోవిడ్-19 వ్యాక్సినేషన్: కరోనావైరస్ వ్యాక్సీన్లను చేతికే ఎందుకు ఇస్తారు?

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సీన్లను చేతికే వేస్తున్నారు. భుజం కండరాలకు టీకా ఇస్తున్నారు. ఈ వ్యాక్సీన్లను డెల్టాయిడ్స్‌గా పిలిచే చేతి కండరాలకు మాత్రమే ఎందుకు వేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? ఇతర యాంటీబయోటిక్స్ ఔషధాల్లా వీటిని నరాల్లోకి లేదా పిరుదులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిజానికి అన్ని వ్యాక్సీన్లను చేతికి ఇవ్వరు.


ఉదాహరణకు పోలియో వ్యాక్సీన్‌ను తీసుకుంటే దీన్ని చుక్కల మందు రూపంలో నోటిలో వేస్తారు. ర్యాబిస్ వ్యాక్సీన్ అయితే ఒకప్పుడు బొడ్డు చుట్టూ వేసేవారు. అయితే, కోవిడ్-19 సహా పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే వ్యాక్సీన్లను చేతి కండరాలకే ఎక్కువగా ఇస్తున్నారు. దీని వెనుక గల కారణాలను హిస్టర్ ఆఫ్ వ్యాక్సీన్ సైట్ ఎడిటర్, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ రెనే నజేరా బీబీసీకి వివరించారు.

 
అందువల్లే కండరాలకు
‘‘కోవిడ్-19తో పోరాడే వ్యాక్సీన్లు శరీరంలో యాంటీబాడీలను క్రియాశీలం చేయాలంటే కండరాలు లేదా కణజాలం అవసరం అవుతుంది. ఇవి మనకు చేతి కండరాల్లో చక్కగా దొరకుతాయి’’ అని నజేరా చెప్పారు. ‘‘చేతి కండరాల్లో మనకు చాలా నరాలు ఉంటాయి. రక్తం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వ్యాధి నిరోధక కణాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆయన వివరించారు.

 
‘‘వ్యాక్సీన్లతో కలిసి పనిచేసేవి ఈ కణాలే. మోడెర్నా లేదా ఫైజర్ లాంటి ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు అయినా లేదా జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి డీఎన్‌ఏ వ్యాక్సీన్లు అయినా.. వ్యాధి నిరోధక కణాల సాయంతోనే పనిచేస్తాయి’’. ‘‘చైనా వ్యాక్సీన్ సినోవ్యాక్‌తోపాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి కూడా ఈ రోగ నిరోధక కణాల సాయంతోనే పనిచేస్తుంది’’

 
‘వైరస్‌పై దాడిచేయడంలో ప్రధాన పాత్ర పోషించే టీ కణాలు, బీ కణాలను క్రీయాశీలం చేయడమే వ్యాక్సీన్ లక్ష్యం. ఈ రెండు రకాల కణాలు సైనికులు లాంటివి. ఒక్కసారి వాటికి ఆదేశాలు అందితే, అవి పోరాటానికి సిద్ధం అయిపోతాయి. ఇవి ప్రధానంగా మన కండరాల్లో ఉంటాయి’’. ‘‘అందుకే ఈ వ్యాక్సీన్లను రక్త నాళాల ద్వారా నేరుగా రక్తంలోకి ఇవ్వడాన్ని చాలా మంది నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రక్తంలో పెద్ద సంఖ్యలో వ్యాధి నిరోధక కణాలు ఉండవు. మరోవైపు వ్యాక్సీన్‌లోని పదార్థాలు రక్తంలో త్వరగా కరిగిపోయే ముప్పు కూడా ఉంటుంది’’ అని ఎపిడమాలజిస్ట్ డాక్టర్ రెనే నజేరా చెప్పారు.

 
మరోవైపు డెల్టాయిడ్ కండరాల్లోకి వ్యాక్సీన్ ఇస్తే మెరుగైన వ్యాధి నిరోధక స్పందనలు ఉంటాయని, వ్యాక్సీన్లతో వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. కండరాలు లేనిచోట ఈ వ్యాక్సీన్లను ఇచ్చినట్లు అయితే, వారి రక్తంలో యాంటీబాడీలు తక్కువగా ఉంటాయని, వ్యాధి నిరోధక స్పందనలు కూడా త్వరగా తగ్గిపోతాయని ఆ కథనంలో పేర్కొన్నారు.

 
వేరే ఎక్కడైనా వేయొచ్చా?
పిరుదులు, తొడలు లాంటి కండరాలు ఎక్కువగా ఉండే శరీర భాగాల్లోనూ ఈ వ్యాక్సీన్లు వేయొచ్చని నజేరా వివరించారు. ‘‘ఉదాహరణకు పిల్లలకు కొన్ని కండరాలకు ఇచ్చే వ్యాక్సీన్లను పిరుదులకు ఇస్తారు. ఎందుకంటే వారికి అక్కడే ఎక్కువ కండరాలు ఉంటాయి’’. ‘‘పెద్దవారికి కూడా పిరుదులకు ఇవ్వొచ్చు. అయితే, అందరికీ పిరుదుల్లో ఇవ్వడం సరికాదు. ఎందుకంటే కొంత మందికి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలా కొవ్వు పేరుకున్న చోట్ల వ్యాక్సీన్ అంత ప్రభావవంతంగా పనిచేయదు’’ అని ఆయన చెప్పారు.

 
ఆయన వాదనతో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా అంగీకరించింది. ‘‘పిరుదులకు టీకా వేయడం మంచిదే. అయితే, కొంతమందిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలా కొవ్వు పేరుకున్న చోట వ్యాధి నిరోధక కణాలు తక్కువగా ఉంటాయి. దీంతో అక్కడ వ్యాక్సీన్ ఇస్తే, రోగ నిరోధక స్పందనలు అంత మెరుగ్గా ఉండవు’’ అని పేర్కొంది. ‘‘కొవ్వులో వ్యాక్సీన్ ఇస్తే, వ్యాధి నిరోధక కణాలకు యాంటీజెన్లు చేరడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా వ్యాధి నిరోధక స్పందనలను కలగజేయడం కూడా ఆలస్యం అవుతుంది’’అని నజేరా అన్నారు.

 
మరోవైపు టీకా వేయడానికి కూడా చేతి భుజం అయితే సులువుగా ఉంటుందని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ వేయడానికి సదరు వ్యక్తి వస్త్రాలను ఎక్కువగా తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ‘‘తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సీన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, చేతులకు వ్యాక్సీన్లు వేయడం చాలా ఉత్తమం. కొన్ని సంస్కృతుల్లో పిరుదలపై వస్త్రాలను పక్కకు తొలగించి వ్యాక్సీన్ వేయడాన్ని తప్పుగా భావిస్తారు’’ అని ఆయన వివరించారు.

 
చరిత్ర ఏం చెబుతోంది?
వ్యాక్సీన్లు వేయడానికి శరీరంలో ఏ భాగం మంచిదనే అంశంపై ఏళ్లపాటు పరిశోధనలు జరిగాయని వ్యాక్సినేషన్ నిపుణులు చెబుతున్నారు. 200 ఏళ్ల అనుభవంతో చేతి కండరాలకు వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చినట్లు వివరిస్తున్నారు. ‘‘మొదటి వ్యాక్సీన్‌ను 1797లో ఇంగ్లండ్‌లో కనిపెట్టారు. స్మాల్‌పాక్స్‌ను అడ్డుకునేందుకు ఆ వ్యాక్సీన్ తయారుచేశారు. ఆవుల్లో కనిపించే ఒక వైరస్ నుంచి దీన్ని తయారుచేశారు. అప్పట్లో ఈ వ్యాక్సీన్ ఇచ్చేందుకు సిరంజిలను ఉపయోగించేవారు కాదు. సూదుల్లాంటి పదునుగా ఉండే లోహపు కడ్డీలను అప్పట్లో ఉపయోగించేవారు’’ అని నజేరా గుర్తుచేసుకున్నారు.

 
‘‘ఇప్పుడు మన ముందున్న సూదులు, సిరంజిలు 19వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. మొదటగా ర్యాబిస్ వ్యాక్సీన్ కోసం వీటిని ఉపయోగించారు’’. ‘‘వ్యాక్సీన్లు ఇవ్వడానికి శరీరంలో ఏ చోటు మంచిదని అప్పట్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టేవారు. అయితే, లూయిస్ పాశ్చర్ తన వ్యాక్సీన్‌ను నేరుగా కడుపులోకి ఇవ్వాలని భావించారు. ఎందుకంటే బలహీనపరిచిన వైరస్ సాయంతో ఆయన వ్యాక్సీన్ తయారుచేశారు. ఆ వైరస్ తన సంఖ్యను రెట్టింపు చేసుకోవాలంటే, కాస్త వెచ్చగా ఉండే చోటు కావాలి. అందుకే కడుపు ఉత్తమమైన చోటని ఆయన భావించారు’’ అని నజేరా వివరించారు.

 
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల కలరా విజృంభించినప్పుడు నోటి ద్వారా వేసే వ్యాక్సీన్లను కనిపెట్టారని నిపుణులు చెబుతున్నారు. ‘‘20వ శతాబ్దం మొదట్లో మన రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తోందనే అవగాహన మెరుగుపడింది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో ఏముంటాయి? అది ఎలా స్పందిస్తుంది? కండరాలకు వ్యాక్సీన్ ఇస్తే ఏం జరుగుతుంది? తదితర అంశాలపై స్పష్టత వచ్చింది’’అని నజేరా చెప్పారు.

 
భవిష్యత్తులో సిరంజిలు, చుక్కల మందులను దాటి కొత్త తరం వ్యాక్సీన్లు వచ్చే అవకాశముందని నజేరా వివరించారు. ‘‘ఇప్పటికే ముక్కు ద్వారా ఇచ్చే ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టీలు, స్ప్రేల ద్వారా ఇచ్చే వ్యాక్సీన్లు ఇప్పుడు ప్రయోగ దశల్లో ఉన్నాయి. ఆహారంలో కలిపి ఇచ్చే వ్యాక్సీన్లపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. ‘‘సూదులంటే భయపడేవారు, క్లినిక్‌లు అందుబాటులో లేనివారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి వారికి డాక్టర్‌ల అవసరం లేకుండానే సులభంగా వ్యాక్సీన్లు ఇచ్చే విధానాలతో పరిశోధకులు ముందుకురావాలి’’అని నజేరా అన్నారు.

 
ఇటీవల అమెరికాలో ముక్కులో వేసే కోవిడ్ వ్యాక్సీన్‌ ట్రయల్స్ మొదలయ్యాయి. క్యూబాలోనూ ఇలాంటి వ్యాక్సీన్లు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. సూదులు అంటే భయపడేవారికి ఇవి చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.