మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (15:13 IST)

కోవిడ్-19 వాక్సీన్: టీకాతో ఎక్కువగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటికి అంత భయపడాలా?

కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం మామూలే. వ్యాక్సీన్ పని చేస్తోందనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చు. రోగనిరోధకత వచ్చిన తర్వాత కాస్త జ్వరం, ఆయాసం, నొప్పి, అలసటగా అనిపించవచ్చు. టీకా వేసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాల్లో ఒక్కటిగానీ, అన్నీగానీ లేదంటే అసలు ఏదీ లేకపోవడం గానీ ఉండచ్చు.

 
కానీ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సాధారణంగా కొన్ని నిమిషాలు, గంటలు లేదా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంటాయి. కరోనా టీకా వేసుకోవడం వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాల కంటే ఆ వ్యాధి చాలా ప్రాణాంతకమైనదని మనం అర్థం చేసుకోవాలి. "కోవిడ్ టీకా వ్యాధి నుంచి రక్షణ అందించి మన ప్రాణాలు కాపాడుతుంది" అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెన్‌స్టర్ వైరాలజిస్ట్ జూలియన్ టాంగ్ అన్నారు.

 
కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లో, గంటల్లో తీవ్రమైన అలర్జిటిక్ రియాక్షన్ కూడా ఉంటుందని, అందుకే వేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అలా చాలా అరుదుగా జరుగుతోందని నిరూపితమయ్యింది. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణుల ఒక అద్యయనంలో అమెరికాలోని బోస్టన్‌లో ఫైజర్ టీకా వేసుకున్న వారిలో పది లక్షల డోసుల్లో 2.5 నుంచి 11.1 కేసుల్లో తీవ్ర అలర్జిక్ రియాక్షన్లు వచ్చాయని తేలింది.

 
ఉదాహరణకు ముందే అలర్జీ హిస్టరీ ఉన్న వారిలో ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి. జనాభా సంఖ్య, టీకా రకాన్ని బట్టి ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కానీ, కరోనా టీకా వేసుకునేవారిలో ఎంత అరుదుగా ఈ అలర్జిక్ రియాక్షన్లు వస్తున్నాయి అనేది ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది. కరోనా టీకా వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం సాధారణంగా జరిగేదేనా? అలా జరగడం మామూలే, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు ఎందుకు అంటున్నారు?

 
జీవుల సహజ ప్రతిస్పందన
"ఒక్కో జనాభా లేదా ఒక్కో వ్యక్తి స్పందన భిన్నంగా ఉండడంతో స్వల్పంగా కలిగే ఈ దుష్ప్రభావాలు ఎంతమందికి కలుగుతున్నాయి అనే గణాంకాలు తీయడం కష్టం. టీకాలు వేయడంలో చాలా పురోగతి సాధించిన ఒక దేశం విషయానికే వస్తే, అక్కడ పది మందిలో ఒకరికి స్వల్ప ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి" అని జూలియన్ టాంగ్ అన్నారు. కానీ టీకా వేసుకున్న తర్వాత అలా జరగడం సర్వ సాధారణం అని నిపుణులు చెబుతున్నారు.

 
"వాక్సీన్ కూడా వైరసే. అది శరీరానికి వెలుపలిది. అందుకే అది శరీరంలోకి ప్రవేశించినపుడు దానిని ఎదుర్కోడానకి మన శరీరం యాంటీ బాడీస్ ఉత్పత్తి చేస్తుంది" అని మాడ్రిడ్‌లో వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న డాక్టర్ జోసెఫీనా లోపెజ్ బీబీసీకి చెప్పారు. "శరీరం తనను రక్షించుకోడానికి ఒక మంటలాంటి చర్యను కలిగిస్తుంది. అది మన శరీర ఉష్ణోగ్రత పెరిగేలా, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వచ్చేలా చేస్తుంది. కరోనా టీకాకే కాదు, ఏ టీకా వేసుకున్నా అలా జరగడం ఒక సాధారణ ప్రక్రియ" అన్నారు.

 
ఇంకా బాగా చెప్పాలంటే.. మనకు దెబ్బలు తగిలినా, గాయాలు అయినా శరీరం నుంచి అలాంటి స్పందనే కనిపిస్తుంది. "మనం పడి, మోకాలు కొట్టుకున్నప్పుడు మనకు నొప్పి తెలుస్తుంది, అక్కడ ఎర్రబడి, వాస్తుంది.. దానికి శరీరం ప్రతిస్పందన అలాగే ఉంటుంది" అని అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ విల్బర్ చెన్ బీబీసీకి చెప్పారు. దీనిని బట్టి.. ఒక్క టీకా వేసుకోవడం వల్లే కాదు, ఏవైనా మందులు వేసుకున్నా, ఏవైనా తిన్నా కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయని మనం ఊహించవచ్చు. "కోవిడ్ వ్యాక్సీన్ పనిచేస్తోంది అనడానికి ఇలాంటి రియాక్షన్లు ఒక సంకేతం లాంటివి. అలాంటి ఏ లక్షణాలైనా సాధారణంగా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి" అని చెన్ అన్నారు.

 
సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి?
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచీ కోవిడ్ టీకాలు వేసుకుంటున్నారు. వాటిపై అధ్యయనాలను నిరంతరం అప్‌డేట్ చేస్తున్నారు. "టీకా వేసుకోవడం వల్ల యువతలో వచ్చే ప్రతికూల ప్రభావాలను మనం మరింత గుర్తించవచ్చు. అవి తీవ్రంగా ఉన్నట్లు కనిపించడం లేదు" అనిలోపెజ్ అన్నారు. "అలా, ఎందుకంటే.. పెద్దవారిలో సాధారణంగా వయసు పెరిగేకొద్దీ, రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉండడం మనం చూడచ్చు" అన్నారు విల్బర్ చెన్.

 
ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వి లాంటి టీకాలను రెండు డోసులుగా వేసుకోవాలి. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఇలాంటి సైడ్ ఎపెక్ట్స్ కనిపిస్తున్నాయి. "అంటే, కోవిడ్ మొదటి డోసు మధ్యరకం రోగనిరోధక స్పందనను ఉత్పత్తి చేస్తుంది. రెండో డోస్ దానిని బలోపేతం చేస్తుంది. అంటే, రెండోది మరింత బలమైన ప్రతిస్పందన కలిగేలా చేస్తుంది. రెండో డోసు తర్వాత కొన్ని సైడ్ ఎపెక్ట్స్ కనిపించడానికి కారణం అదే" అని అమెరికాలోని మాయో క్లినిక్ డాక్టర్ ఆండ్రూ బాడ్లీ చెప్పారు.

 
రోగులకు టీకా గురించి ఉన్న అవగాహనను బట్టి ఆ లక్షణాలను పెద్దవి చేసి చెప్పడం కూడా జరుగుతుంటుందని టాంగ్ హెచ్చరించారు. "చాలా మంది రోగులు వ్యాక్సీన్ వేసుకునే సమయంలో భయపడతారు, కంగారు పడిపోతారు. దాంతో నొప్పి తక్కువే ఉన్నా, అది చాలా తీవ్రంగా ఉందని వాళ్లు చెప్పవచ్చు. అంటే, అక్కడ వారి మానసిక స్థితి కూడా పాత్ర పోషిస్తుంది" అన్నారు.

 
ఏవైనా లక్షణాలు కనిపిస్తే, ఏం చేయాలి?
"నా విషయానికి వస్తే, ఆస్ట్రాజెనెకా టీకా వేయించుకున్నప్పుడు.. నాకు కాస్త జ్వరంగా, ఆయాసంగా అనిపించింది. దాంతో ఎసిటమినోఫెన్ వేసుకున్నా" అని జూలియన్ టాంగ్ చెప్పారు. జ్వరానికి వేసుకునే పారాసెటమాల్, ఐబ్యూప్రొఫెన్ లాంటి మందులు వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఉపశమనం అందిస్తాయని, అయితే, వాటిని వేసుకునే ముందు డాక్టరును సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త కోసం టీకా వేసుకునే ముందే అలాంటి మందులు వేసుకోవడం మంచిది కాదు.

 
"టీకా వేసుకున్న తర్వాత ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వ్యాక్సీన్ వేసిన చోట శుభ్రమైన ఒక తడి టవల్‌ పెట్టడం, టీకా వేసిన చేతిని కదిలించడం, కాస్త వ్యాయామం చేయడం లాంటివి చేయవచ్చు" అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా ఇచ్చింది. టీకా వేసుకున్నాక మీకు జ్వరంగా ఉంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తేలికగా ఉండే దుస్తులు వేసుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు.