మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 17 జనవరి 2022 (17:51 IST)

కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు

ఒమిక్రాన్ వేరియంట్ ఊహించని వేగంతో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తోంది. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో యూరోప్‌లోని సగం జనాభా ఒమిక్రాన్ బారిన పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా అమెరికాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు గత వారంలో దాదాపు రెట్టింపు అయ్యాయని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పీఏహెచ్ఓ) గత బుధవారం తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండడంతో హెల్త్‌కేర్ వ్యవస్థలకు మళ్లీ సవాళ్లు ఎదురవుతున్నాయని పీఏహెచ్ఓ డైరెక్టర్ కారిస్సా ఎటియెన్ అన్నారు. కాగా, ఒమిక్రాన్‌ను తేలికపాటి ఇంఫెక్షన్‌గా పరిగణించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు?

 
ఒమిక్రాన్ గురించి తెలుసుకోవాలసిన ఏడు విషయాలు ఇవి.
1. ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోంది?
ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయని డబ్ల్యూహెచ్ఓలో కోవిడ్-19 టెక్నికల్ లీడ్, ఎపిడెమియాలజిస్ట్ మరియా వాన్ కెర్ఖోవ్ వివరిస్తున్నారు. మానవ కణాలపైకి సులభంగా చేరగలిగే ఉత్పరివర్తనాలను ఈ వేరియంట్ కలిగి ఉంది. వ్యాక్సీన్ వేసుకున్నప్పటికీ, ఇంతకుముందు కోవిడ్ సోకినప్పటికీ మళ్లీ వైరస్ సోకే అవకాశాలు మెండు. దీన్నే "ఇమ్యునిటీ ఎస్కేప్" అంటారు. ఎగువ శ్వాసకోశ నాళాల్లో ఒమిక్రాన్ అభివృద్ధి చెందుతుంది. అంటే ముక్కు, నాసికా కుహరం, గొంతు భాగాల్లో ఒమిక్రాన్ ప్రతిరూపాలు తయారవుతాయి. అందువల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. డెల్టా సహా ఇతర వేరియంట్లు దిగువ శ్వాసకోశ నాళాల్లో అంటే ఊపిరితిత్తుల్లో అభివృద్ధి చెందుతాయి. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంచనా వేయడం కష్టమని కోవిడ్ వ్యాక్సీన్ హబ్ పోర్టల్ పేర్కొంది. అయితే, డెల్టా కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువ ఉండవచ్చని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అంచనాలు చెబుతున్నాయి.


2. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయి?
కింగ్స్ కాలేజ్ లండన్‌లోని ఎపిడెమియాలజిస్ట్ టిమ్ స్పెక్టర్ నేతృత్వంలోని జో కోవిడ్ సింప్టమ్ అధ్యయనం ప్రకారం, ఇప్పటివరకు కనిపించిన ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవి:
 
ముక్కు కారడం
తలనొప్పి
అలసట/నీరసం (తేలికపాటి లేదా తీవ్రమైన)
తుమ్ములు
గొంతు నొప్పి
సాధారణంగా కోవిడ్ సోకినప్పుడు కనిపించే లక్షణాలనూ గమనించాలని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) సూచించింది. అవి..
దగ్గు (తరచుగా ఉండడం లేదా అకస్మాత్తుగా మొదలవడం)
జ్వరం
రుచి, వాసన తెలియకపోవడం

 
3. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ తేలికపాటి లక్షణాలతో తగ్గిపోతుందా?
ఒమిక్రాన్ ప్రాణాంతకమా లేక తేలికపాటి లక్షణాలతో తగ్గిపోతుందా అని చెప్పేందుకు మరింత డేటా అవసరమని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఒమిక్రాన్ తేలికపాటి వ్యాధి లక్షణాలను కలిగిస్తుందని చెప్పేందుకు కొన్ని సూచికలు ఉన్నాయి. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రమై, ప్రాణాంతకం కూడా కావొచ్చు. ముఖ్యంగా వ్యాక్సీన్ వేసుకోనివాళ్లల్లో ఇది తీవ్రతరం కావొచ్చు.

 
డెల్టాతో పోలిస్తే, ఒమిక్రాన్ సోకినవారు ఆస్పత్రి పాలయ్యే అవకాశం మూడింట ఒక వంతు ఉందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజేన్సీ డిసెంబర్ 31న ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది. వ్యాక్సీన్ వేసుకున్నవారికి, వేసుకోనివారికి ఒమిక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉండవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్‌లోని పబ్లిక్ హెల్త్ సైన్సెస్ విభాగంలో ఎపిడెమియాలజిస్ట్ లోరెనా గార్సియా అన్నారు. "రెండు డోసుల వ్యాక్సీన్, బూస్టర్ డోసు వేసుకున్నవారిలో తేలికపాటి లక్షణాలే ఉండవచ్చు. వ్యాక్సీన్ వేసుకోనివారికి మాత్రం వ్యాధి తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి పాలు కావడం లేదా ప్రాణాంతకం కావొచ్చు" అని గార్సియా చెప్పారు. అయితే, ఒమిక్రాన్‌ను తేలికపాటి వ్యాధిగా పరిగణించకూడదని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

 
"డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నా, దీన్ని తేలికపాటి వేరియంట్‌గా గుర్తించలేం" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ జనవరి ప్రారంభంలో హెచ్చరించారు. "గత వేరియంట్ల లాగానే ఒమిక్రాన్ వల్ల కూడా ఆస్పత్రి పాలై, ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు" అని ఆయన వెల్లడించారు.

 
4. ఒమిక్రాన్‌పై వ్యాక్సీన్లు ప్రభావం చూపిస్తాయా?
వ్యాక్సీన్ రెండు డోసులూ వేసుకున్నవారికి ఒమిక్రాన్ సోకినా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదని స్పెయిన్‌లోని నవార్రా విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఇగ్నాసియో లోపెజ్-గోని డిసెంబర్ 28న రాసిన ఒక వ్యాసంలో వివరించారు. కాగా, జనవరి 7న ప్రచురించిన ఎంఐటీ/హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, ఫైజర్ లేదా మోడెర్నా రెండు డోసులూ "ఒమిక్రాన్‌ను గుర్తించే లేదా తటస్థీకరించే యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయవని" పేర్కొంది. అయితే, బూస్టర్ డోసు "ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రక్షణను పెంపొందించగలదని" తెలిపింది.

 
ఒమిక్రాన్‌పై ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ల ప్రభావం పరిమితమేనని డేటా సూచిస్తోందని ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ఆండ్రూ లీ అన్నారు. అయితే, బూస్టర్ డోసు వేసుకోవడం వలన రక్షణ పెరుగుతోందని వివరించారు. వ్యాక్సీన్ వేసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకవచ్చని లీ సూచించారు. ఎందుకంటే, వ్యాక్సీన్లు కరోనావైరస్‌ను నిరోధించలేవు. వైరస్ తీవ్రతను నియంత్రించేందుకు మాత్రమే సహాయపడతాయి. "వ్యాక్సీన్లు, బూస్టర్ డోసు ప్రాముఖ్యతను, అవసరాన్ని ఒమిక్రాన్ మరింత నొక్కి చెబుతోంది" అని సీడీసీ పేర్కొంది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్‌లకు వ్యతిరేకంగా ప్రభావం చూపించేలా కోవిడ్-19 వ్యాక్సీన్లలను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్యానెల్ జనవరి 11న సూచించింది.

 
5. గతంలో కోవిడ్ సోకితే మళ్లీ ఒమిక్రాన్ సోకుతుందా? వ్యాక్సీన్ వేసుకున్నా ఒమిక్రాన్ వస్తుందా?
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వలన మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 5.4 రెట్లు ఎక్కువ ఉందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ అధ్యయనం అంచనా వేసింది. గతంలో కోవిడ్ సోకడం వలన అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌పై కేవలం 19 శాతమే ప్రభావం చూపుతాయని ఈ పరిశోధన సూచించింది. వ్యాక్సీన్ల విషయానికొస్తే, ఒమిక్రాన్‌పై అవి చూపించే ప్రభావం కాలక్రమేణా తగ్గుతుందని అమెరికాలోని మాయో క్లినిక్‌లో వ్యాక్సీన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గ్రెగొరీ పోలాండ్ అన్నారు.

 
"రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకుంటే, మూడు నెలల తరువాత వ్యాక్సీన్ సామర్థ్యం 30 లేదా 40 శాతానికి పడిపోతుంది" అని పోలండ్ తెలిపారు. బూస్టర్ డోసుతో ఇమ్యూనిటీ 75 నుంచి 80 శాతానికి పెరగవచ్చని ఆయన సూచించారు. "కానీ 100 శాతం కాదు. ఇది గమనించాల్సిన విషయం. అందుకే మనం మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి" అని పోలండ్ వివరించారు.

 
6. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
"గత అనుభవాల బట్టి, 'హైబ్రిడ్ ఇమ్యూనిటీ' అంటే వ్యాక్సీన్, కోవిడ్ ఇంఫెక్షన్ రెండింటి ద్వారా కలిగిన ఇమ్యూనిటీ మరింత శక్తివంతంగానూ, మెరుగైన దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిగానూ అభివృద్ధి చెందుతుందని నిరూపణ అయింది" అని స్పెయిన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్, ఫార్మకోఎపిడెమియాలజీ రిసెర్చర్ సాల్వడార్ పియరో అన్నారు. అయితే, వ్యాక్సీన్ వేసుకున్నా, గతంలో కోవిడ్ సోకిన అనుభవం ఉన్నాగానీ ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువేనని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వ్యాక్సీన్ వేసుకుని లేదా కోవిడ్ నుంచి కోలుకుని అయిదారు నెలలు దాటితే మళ్లీ వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి.

 
7. రెండుసార్లు ఒమిక్రాన్ సోకే అవకాశం ఉందా?
"సిద్ధాంతపరంగా అవుననే చెప్పాలి. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న వెనువెంటనే మళ్లీ కోవిడ్ సోకడం అరుదే. వ్యాక్సీన్ మూడో డోసు కూడా వేసుకున్నవారిలో మరింత అరుదు" అని పియరో అన్నారు. ఒకసారి ఇంఫెక్షన్ సోకిన తరువాత, ఎంత కాలానికి లేదా ఎన్నిసార్లు మళ్లీ ఇంఫెక్షన్ సోకుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని ఆయన అన్నారు.