సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2019 (21:29 IST)

విజయవాడ గోశాలలో ఆవుల మృతి పట్ల ఎవరేమంటున్నారు?

విజయవాడ సమీపంలోని ఓ గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు అనూహ్యంగా మృతిచెందడం సంచలనంగా మారింది. భారీ సంఖ్యలో ఆవులు చనిపోవడానికి కారణాలపై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఘటన జరిగి అయిదు రోజులు గడిచిన తర్వాత కూడా నిర్థిష్టంగా కారణాలు అన్వేషించకపోవడంతో రాజకీయంగానూ విమర్శలు వినిపిస్తున్నాయి.

 
కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న గోశాలలో ఒక్కసారిగా ఆవులు చనిపోయిన విషయం ఈనెల 9వ తేదీన వెలుగులోకి వచ్చింది. దాంతో వివిధ విపక్ష పార్టీల నేతలు గోశాలను సందర్శించారు.

 
ప్రభుత్వం తరఫున వివిధ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. కానీ, ఆవుల మృతికి కారణాలు నేటికీ నిర్థరణ కాలేదు. మరోవైపు ఆవులు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి కారణం విషపూరిత ఆహారమేనని కొందరు, ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మరికొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 
92 ఏళ్ల చరిత్ర కలిగిన గోశాల
విజయవాడ గో సంరక్షణ సంఘం 1927లో ప్రారంభమైంది. అప్పట్లో ఈ సంఘం ఆధ్వర్యంలో నాలుగు ఆవులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 1,300 దాటింది. వాటిలో 86 ఆవులు ఒకేరోజు చనిపోయాయి. ఆ తర్వాత మరో రెండు ఆవులు ప్రాణాలు విడవడంతో ఆ సంఖ్య 88కి చేరింది. ఈ గోశాల నిర్వహణకు పలువురు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. 2014లో కొత్తూరు తాడేపల్లిలో ఏడెకరాల విస్తీర్ణంలో గోశాలను ఆనాటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

 
ఆగస్టు 9న ఏం జరిగింది?
తాను అప్పటి వరకూ ఆవులకు సంబంధించిన దాణా, గడ్డి అన్ని అందించి ఇంటికి వెళ్లిన వెంటనే ఫోన్ రావడంతో వెనక్కి వచ్చినట్టు గోశాల సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ బీబీసీతో చెప్పారు. "9 గంటలప్పుడు నేను మా ఇంటికి చేరగానే ఫోన్ వచ్చింది. వెంటనే వెనక్కి వచ్చాను. అప్పటికే కొన్ని ఆవులు చనిపోయి ఉన్నాయి. ఒక్కొక్కటిగా తాకగానే చేయగానే పడిపోయాయి. ఏం జరుగుతోందో మాకు అర్థం కాలేదు. ఇప్పటికీ కారణాలు తెలియలేదు. ఎప్పటిలాగే ఆరోజు కూడా గడ్డి, దాణా పెట్టాం" అని ఆయన వివరించారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, వాస్తవం ఏంటో దర్యాప్తులో తేల్చాలని ఆయన అన్నారు.

 
"నిర్వహణ లోపాలు లేవు"
గోశాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవని గోసంరక్షణ సంఘం కన్వీనర్ భాస్కర్ రావు తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "ఈ గోశాల నిర్వహణలో అనేక మంది సహాయం అందిస్తుంటారు. ముఖ్యంగా మార్వాడీలు, జైనులు తమ సంప్రదాయం ప్రకారం గోవులకు ప్రాధాన్యమిస్తుంటారు. 20 మంది ఒడిశాకు చెందిన యువకులు పనిచేస్తున్నారు. మరో నలుగురు పర్యవేక్షిస్తూ ఉంటాం. గోశాలలో ఆవులు చనిపోయిన రోజు నేను కాశీ యాత్రకు వెళ్లాను. ఒకేసారి అన్ని ఆవులు చనిపోవడం నేను ఎన్నడూ చూడలేదు. మేతలో ఎలాంటి సమస్య లేకపోయినా ఇలా జరగడం అర్థం కావడం లేదు" అని ఆయన అన్నారు.

 
కుట్ర ఉంది: చంద్రబాబు
ఆవులు చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. "విజయవాడ శివారు గోశాలలో ఒక్క రాత్రిలో 100 ఆవులు మరణించడం అన్నది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోలేం. రాత్రికి రాత్రి అలా జరగడం వెనుక మరేదో కుట్ర ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా కేసును విచారించి, దోషులను శిక్షించాలి" అంటూ ట్వీట్ చేశారు.

 
రాజా సింగ్ ఆరోపణలు
బీజేపీకి చెందిన తెలంగాణా రాష్ట్ర ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ గోశాలను సందర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, "దాణాలో రసాయనాలు కలిశాయని అంటున్నారు. కానీ, అలా జరిగితే కొన్ని ఆవులు చనిపోతాయి తప్ప వంద ఆవులు ఎలా చనిపోతాయి? దీనిపై సీరియస్‌గా విచారణ చేయాలి. నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేయాలి. గోవులపై విషప్రయోగం జరగడంతోనే వంద ఆవులు చనిపోయాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. గోశాల ప్రాంతంలో విలువైన సంపద దాగి ఉంది. దానిపై కొందరు నేతలు కన్నేశారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి" అని ఆయన ఆరోపించారు.

 
నిర్వహణ సక్రమంగా లేదు
ఆవులు చనిపోయిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పశుసంవర్థక శాఖకు చెందిన పలు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఆవుల రక్తనమూనాలు సేకరించారు. గడ్డి, దాణా నమూనాలనూ పరీక్షలకు పంపించారు. చనిపోయిన ఆవుల రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పరీక్షల నిమిత్తం పంపించినట్టు జాయింట్ డైరెక్టర్ భరత్ రమేష్ బీబీసీకి తెలిపారు.

 
"ఆవుల మరణాలు విషాదం. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక రాగానే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.గోశాల నిర్వహణ సరిగా లేనట్లు అనిపిస్తోందని గన్నవరంలోని వెటర్నరీ కళాశాలకు చెందిన 8 మంది ప్రొఫెసర్ల బృందం అభిప్రాయపడింది. గోశాలను పరిశీలించి, అక్కడి పరిసరాలను గమనించిన తర్వాత బృందంలోని ఓ ప్రొఫెసర్ తన పేరు ప్రస్తావించవద్దని చెబుతూ... బీబీసీతో ఈ విషయాన్ని తెలిపారు.

 
గోశాల ప్రాంగణంలో ఎలాంటి శుభ్రత పాటించడం లేదన్నారు. మేత అందించే విధానంలో కూడా బలమైన పశువులకు మాత్రమే గడ్డి, దాణా దక్కేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. దానివల్ల బలహీనంగా ఉండే ఆవులు బక్కచిక్కిపోతాయని చెప్పారు. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న స్థలాలో గడ్డి తీసుకొచ్చి గోశాలలో ఆవులకు వేస్తున్నారని, ఆ సందర్భంగా ఎటువంటి ఎరువులు, రసాయనాలు వాడారన్నది ల్యాబ్‌లో పరిశీలన ద్వారా బయటపడవచ్చని ఆ ప్రొఫెసర్ తెలిపారు.

 
ప్రత్యేక బృందం
గోశాలలో జరిగిన ఘటనపై విచారణ కోసం ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. నిజానిజాలు బయటపెట్టేవరకూ ఈ సిట్ పనిచేస్తుందని డీజీపీ తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ఘటనకు అసలు కారణాలు కనుగొనేందుకు తగిన ఆధారాలు లభించలేదని డీజీపీ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డి సరఫరాదారులను కూడా సిట్ విచారిస్తుందని వెల్లడించారు. ఆవుల మృతిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దాంతో, వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.