"కష్ట కాలంలో నా గురించి, నా బిడ్డ క్షేమం గురించి ఆలోచించని మనిషితో ఉండి ఏం లాభం? అందుకే విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. లాక్ డౌన్ నాకు ఆలోచించుకోవడానికి కావల్సినంత వ్యవధిని ఇచ్చింది." గోవాకి చెందిన 42 సంవత్సరాల నవ్య ఈ లాక్ డౌన్ తర్వాత తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆమె లాయర్‌ని కూడా సంప్రదించారు.
లాక్ డౌన్ వలన భార్యా భర్తలు తమ సంబంధ బాంధవ్యాలను తరచి చూసుకునేందుకు అవకాశం కలుగుతోందా? లాక్ డౌన్ సమయంలో విడాకుల కోసం లాయర్లని సంప్రదించే వారుఎక్కువయ్యరా? ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షి. లాక్ డౌన్ సమయంలో గృహ హింస ఫిర్యాదులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ చెప్పారు.
మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 239 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. గతంతో పోల్చి చూస్తే ఇది 94 శాతం పెరుగుదల అని చెప్పారు. అయితే, కోర్టులు పని చేయకపోవడం వలన అధికారికంగా విడాకులు నమోదు అయిన సంఖ్య లేదని ముంబయికి చెందిన డివోర్స్ లాయర్ వందన షా చెప్పారు. కాకపొతే ఈ లాక్ డౌన్‌లో తనదగ్గరకి వచ్చే విచారణలు మాత్రం మూడింతలు పెరిగాయని అన్నారు. వాట్సాప్, మెసెంజర్‌ల్లో రోజుకి కనీసం 30-40 మంది విడాకుల కోసం కానీ, కౌన్సిలింగ్ కోసం కానీ సంప్రదిస్తున్నారని తెలిపారు.
తన నిర్ణయం వెనక కారణాలని నవ్య బీబీసీకి వివరించారు. ఆమె ఒక సంవత్సరం క్రితం గృహ హింస భరించలేక ఇంటి నుంచి బయటకి వచ్చి భర్తకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె గతంలో విడాకుల కోసం ప్రయత్నించలేదు. "ఈ దూరం నా భర్తలో మార్పు తీసుకుని వస్తుందేమో అనుకున్నాను. కానీ, లాక్ డౌన్ సమయంలో కూడా నేను, నా పదేళ్ల కూతురు ఎలా బ్రతుకుతామో అని ఆలోచించలేదు. మాకు కనీస ఆర్ధిక సహాయం కూడా చేయటం లేదు. తిరిగి నన్ను నా కుటుంబ సభ్యులని దూషిస్తూ ఈ -మెయిల్‌లు పంపిస్తున్నారు. అవి చాలా అసభ్యకర పదజాలంతో ఉంటున్నాయి."
"పెళ్ళైన కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అప్పట్లో అతను వ్యాపారం చేసేవారు. నన్ను రెండవ పెళ్లి చేసుకున్నారు. కానీ, రానురాను మా మధ్య విబేధాలు మొదలయ్యాయి". "ఆయన ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పరిచయాలు విస్తృతం అవుతున్న కొద్దీ నేను అపరిచితురాలిలా మిగిలిపోయాను". "నాకు కావల్సిన ఇంటి ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు."
"నా కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో బెడ్ రూమ్‌లో గడపడం మొదలుపెట్టారు. ఆఖరికి నా లోదుస్తులు కొనుక్కోవడానికి బిల్ పే చేయాలంటే కూడా అతని సెక్రటరీని నాతో పాటు పంపేవారు". "ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఆయన తన అధికారం ఉపయోగించి నన్ను బలహీనురాలిని చేస్తారేమోననే భయం నన్ను వెంటాడేది".
"ఈ మానసిక వ్యధ భరించలేక నేను ఇంటి నుంచి బయట పడి గత సంవత్సర కాలంగా ఒంటరిగా ఉంటున్నాను". "నేను గోవా నుంచి ముంబయి వచ్చి ఇక్కడ నుంచి నిర్వహణ ఖర్చుల కోసం దరఖాస్తు చేశాను. లాక్ డౌన్ మొదలైనప్పుడు ఇంటి ఖర్చులు అడిగినప్పుడు ఒక 10,000 రూపాయిలు మాత్రమే ఇస్తానని చెప్పారు. ఆ డబ్బులతో ముంబయి లాంటి నగరంలో ఎలా బ్రతకాలో నాకు అర్ధం కాలేదు".
"ఇలాంటి కష్ట సమయంలో మమ్మల్ని పట్టించుకోని వ్యక్తి కోసం నేనెందుకు ఎదురు చూడాలనే ఆలోచన నేను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది". కోర్టులు తెరవగానే విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని నవ్య చెప్పారు. నవ్య లాంటి మరెందరి కోసమో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం న్యాయస్థానాలు కల్పిస్తే బాగుంటుందని వందన షా అభిప్రాయపడ్డారు.
లాక్ డౌన్ ముందు నుంచి ఉన్న సమస్యల కోసం వచ్చే విచారణలే తప్ప కొత్తగా లాక్ డౌన్‌లోనే పుట్టిన కేసులు లేవని హైదరాబాద్‌కి చెందిన మాట్రిమోనియాల్ లాయర్ బిందు చెప్పారు. అలా అని లాయర్ దగ్గరకి వచ్చిన ప్రతి విచారణా విడాకులకు దారి తీస్తుందనే నియమం కూడా ఏమీ లేదని అన్నారు.
అయితే, చిన్న చిన్న కలహాలతో విడిపోతామంటూ తమ దగ్గరకి వచ్చిన కొన్ని జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని నాగ్‌పూర్ ఫామిలీ కోర్టులో ఫ్యామిలీ కౌన్సిలర్‌గా రిటైర్ అయిన డాక్టర్ మంజూష చెప్పారు. రెండేళ్ల క్రితం పెళ్ళైన ఒక జంట తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చినట్లు చెప్పారు. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమ్మాయికి ఇటీవలే బాబు పుట్టడంతో ఉద్యోగం మానేశారు. లాక్ డౌన్‌కి ముందే ఆ అబ్బాయి నాగ్‌పూర్‌లో ఉంటున్న తన భార్య దగ్గరకి వెళ్లారు.
అయితే వీరి మధ్య సమస్యలు చాలా చిన్నవి. బాబుని చూడటానికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకుని రాలేదని అమ్మాయి ఇంట్లో వాళ్ళు అనవసర కలహాలు పెట్టుకుంటే, కోడలు కుటుంబం అందరితో కలిసి భోజనం చేయదని అబ్బాయి తల్లితండ్రులు అన్నారు. ఇవి వీరిద్దరి మధ్య వాదోపవాదాలకు దారి తీశాయి.
వీటికే వీరిద్దరూ కలిసి ఉండటం సాధ్యపడదనుకున్నారు. కొందరు బంధువులు ఇచ్చిన సలహాతో వారు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ తీసుకున్నారని డాక్టర్ మంజూష చెప్పారు. కౌన్సిలింగ్ తర్వాత వారు విడిపోవాలనే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు చెప్పారు. వీరు ఇంకా కొన్ని సెషన్లకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు.
గతంలో కౌన్సిలింగ్ చేసి కొంత వ్యవధి తీసుకోమని చెప్పిన కొంత మంది జంటలు లాక్ డౌన్ సమయంలో తనని సంప్రదించినట్లు వందన షా చెప్పారు. భర్త తాగుడు అలవాటుభరించలేకపోతున్నానని, ఇక ఎక్కువ రోజులు భరించలేనని చండీగఢ్‌కి చెందిన ఒకామె తనని సంప్రదించినట్లు వందన తెలిపారు. లాక్ డౌన్ చాలా మంది జీవితాలలో మార్పుని తీసుకుని వచ్చిందని మానసిక వైద్య నిపుణురాలు పూర్ణిమ నాగరాజ అన్నారు.
"అందరూ ఒకే సారి ఇంట్లో ఉండేటప్పటికి ఒకరి లోపాలు ఒకరికి తెలవడం మొదలైంది. భర్త గాని, భార్య గాని సోషల్ మీడియాలో ఉంటే కూడా ఇద్దరి మధ్య ఒత్తిడికి దారి తీస్తోంది. వీటి వలన కోపం, ఒత్తిడి పెరిగిపోతున్నాయి’’ అని ఆమె అన్నారు. "నేను సరిగ్గా వంట చేయనని నా భర్త సాధిస్తూనే ఉంటారు’ అని భార్య ఫిర్యాదు చేస్తుంటే, ‘లాక్ డౌన్ టైంలో అయినా కాస్త విశ్రాంతి తీసుకోవద్దా’ అని భర్త ప్రశ్నిస్తున్నారు" అని తన దగ్గరకి లాక్ డౌన్ సమయంలో కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఒక జంట గురించి చెప్పారు.
"ఆఖరికి ఈ చిన్న చిన్న తగాదాలు భరించలేక 18 సంవత్సరాలుగా కలిసి బ్రతికిన జంట లాక్ డౌన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు". లాక్ డౌన్‌లో తమ భర్తలు సోషల్ మీడియాలో పాత స్నేహితులతో సంభాషణలు మొదలుపెట్టారని, అది వేరే దారిలో వెళుతుందేమోనన్న అనుమానం కలుగుతోందంటూ కొందరు భార్యలు తనను సంప్రదించినట్లు వందన షా చెప్పారు. అయితే ఇవన్నీ విడాకుల కోసమే ప్రత్యేకంగా కానప్పటికీ కొంత మంది ఒక ఆవేశంలో లాయర్‌ని సంప్రదిస్తారని చెప్పారు.
గృహ హింస, విడాకులు, ఇతర మాట్రిమోనియల్ అంశాలపై వచ్చే విచారణలు జనవరిలో సుమారు 100 ఉంటే , అవి లాక్ డౌన్‌లో 300కి పెరిగాయని నోయిడాకి చెందిన లెజిస్టిఫై న్యాయవాద సంస్థ వ్యవస్థాపకుడు అక్షత్ సింఘల్ తెలిపారు. భారతదేశంలో జనాభా లెక్కల ఆధారంగా విడాకులు, భార్య భర్తలు విడిపోవడంపై ఆర్ధిక వేత్త సూరజ్ జాకబ్, ఆంత్రోపాలజిస్ట్ శ్రీ పర్ణ చటోపాధ్యాయ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో సుమారు 13 లక్షల మంది విడాకులు తీసుకున్నారు. అంటే ఇది మొత్తం జనాభాలో కేవలం 0. 11 శాతం ఉంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా సిద్దిఖీ తనకి విడాకులు కావాలంటూ ఇమెయిల్ నోటీసులు పంపించారు. గత పదేళ్లుగా తాను ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇక మీదట వాటిని భరించలేనని, అందుకే విడాకులు కోరుతున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.