లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజలకు వినోదం అందిస్తున్న ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’. ఫీచర్ ఫిల్మ్స్ డిజిటల్ రిలీజులకు శ్రీకారం చుట్టిందీ సంస్థ. ‘జీ 5’లో ‘అమృతరామమ్’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ‘అమృతం ద్వితీయం’ నుండి రెండు లాక్‌డౌన్ స్పెషల్ ఎపిసోడ్స్‌ను మే 27న ‘జీ 5’లో విడుదల చేయనున్నారు. స్పెషల్ ఎపిసోడ్ కోసం స్పెషల్‌గా చేసిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.
జూన్ 25 నుండి ప్రతి నెల రెగ్యులర్ 'అమృతం ద్వితీయం' ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి. ఈ సందర్భంగా ‘అమృతం ద్వితీయం’ టీమ్, ‘జీ 5’ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల వెబినార్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.
‘అమృతం ద్వితీయం’ దర్శకుడు సందీప్ గుణ్ణం మాట్లాడుతూ ‘‘నేను ‘అమృతం–2’ కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే... రచయితగా గుణ్ణం గంగరాజుగారిని (నిర్మాత కూడా ఆయనే), అమృతం ప్రాతకు హర్షవర్ధన్‌ని, అప్పాజీ పాత్రకు శివన్నారాయణగారి, సర్వం పాత్రకు వాసుని తీసుకున్నా.
‘ఈయన బాగా చేయడం లేదు’ అనలేకుండా, అద్భుతంగా చేసే ఎల్బీ శ్రీరామ్‌గారిని అంజి పాత్రకు తీసుకున్నా. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. మూడు ఎపిసోడ్స్ లైవ్ అయ్యాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మిగతా ఎపిసోడ్స్ లైవ్ చేస్తాం. ప్రస్తుతానికి నెలకు మూడు ఎపిసోడ్స్ లైవ్ చేయాలని అనుకుంటున్నాం. ‘అమృతం’లో కరెంట్ ఇష్యూస్ మీద చేశాం.
అలాగే, ‘అమృతం–2’లోనూ చేస్తాం. అందుకని, ముందే అన్నీ షూటింగ్ చేయడం కన్నా ఎప్పటికప్పుడు చేయాలని అనుకున్నాం. ప్రస్తుతం షూటింగ్ చేసిన ఎపిసోడ్స్ మూడు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం. లాక్‌డౌన్ స్పెషల్స్ అని 10, 8 నిమిషాల నిడివి గల రెండు స్పెషల్ ఎపిసోడ్స్ చేశాం. వాసు స్ర్కిప్ట్ రాశాడు. నాన్న (గుణ్ణం గంగరాజు) చదివారు. నటీనటులకు ఏం చేయాలో వివరించాను.
ఎవరింట్లో వాళ్లు షూటింగ్ చేసి పంపారు. ఈ సీజన్‌లో హర్షవర్ధన్ రెండు ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు" అన్నారు. ‘జీ 5’ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ ‘‘నేను మొదట ‘అమృతం’ సీరియల్‌గా అభిమానిని. నేను ‘జీ 5’లో జాయిన్ అయిన తర్వాత మా సీఈవో తరుణ్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే... ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్లీ అమృతం తీసుకురావలి’ అన్నారు. గంగరాజు గారు కన్విస్ చేయడం సాగరమథనం.
‘అమృతం–2’ స్ట్రీమింగ్ చేసే వరకూ ఎప్పుడు చేస్తారని ఆడియన్స్ అడిగారు. చేసిన తర్వాత ఆపినందుకు ఇప్పుడు అడుగుతున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసు విభాగాలు లాక్‌డౌన్ సమయంలో చాలా కష్టపడి పని చేశాయి. వాళ్లకు లాక్‌డౌన్ స్పెషల్ ఎపిసోడ్స్ అంకితం ఇస్తున్నాం. ఉగాది రోజున విడుదలైన 'అమృతం ద్వితీయం'కి చాలా మంచి స్పందన లభించింది’’ అన్నారు.
అంజి పాత్రధారి ఎల్బీ శ్రీరామ్‌గారు మాట్లాడుతూ... ‘‘నాకు ‘గాడ్’, ‘అమృతం’ వెంట వెంటనే... రెండు ప్రతిష్టాత్మక పాత్రలు నాకు ‘జీ 5’ రావడం అదృష్టం. ఇది నాకు గర్వకారణం, గౌరవకారణం. ఈ సందర్భంగా ప్రసాద్ నిమ్మకాయల, జీ5కి థ్యాంక్స్. ఉగాది, మంచి రోజు అని ఎన్నో ప్లాన్ చేసి ‘అమృతం’ ప్రారంభించాం. కానీ, దేవుడు మరొకటి ప్లాన్ చేశాడు. అయితే, షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు సన్నీ (సందీప్ గుణ్ణం) నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. అది మర్చిపోలేను’’ అన్నారు.
అమృతం పాత్రధారి హర్షవర్ధన్ మాట్లాడుతూ... ‘‘బుల్లితెర వీక్షకుల నుండి గంగరాజుగారికి వచ్చిన ఒత్తిడి వలన ‘అమృతం ద్వితీయం’ స్టార్ట్ చేశారు. ‘మళ్లీ ఏం రాస్తాం?’ అని ఆయన అనుకుని ఇంకొకటి రాద్దామనుకొనే క్రమంలో... ప్రజలు ఎక్కడ కనపడితే అక్కడ ఆయనకు మనశాంతి లేకుండా చేసి మళ్లీ రాసేలా చేశారు. మంచి భోజనం తర్వాత తినే స్వీటు లాంటిది అమృతం. లేదా పప్పన్నం–ఆవకాయ్ కాంబినేషన్ లాంటిది.
అందరికీ నచ్చేది ‘అమృతం’. ఎంత బిర్యానీ తిన్నా చివర్లో పెరుగన్నం తినకపోతే ఎలా ఉంటుందో... ‘అమృతం’ చూడకపోతే ప్రేక్షకులకు అలా ఉంటుంది’’ అన్నారు.
అప్పాజీ పాత్రధారి శివన్నారాయణ మాట్లాడుతూ ‘‘నాకు అమృతం తొలి సీజన్‌కి, మలి సీజన్‌కి తేడా ఏమీ కనిపించడం లేదు. గుండు హనుమంతరావుగారి స్థానంలో ఎల్బీ శ్రీరామ్‌గారు వచ్చారు. సీనియర్ మోస్ట్ యాక్టర్ కదా! పర్‌ఫెక్ట్ టైమింగ్‌లో చేస్తున్నారు. ఆయనతో మా అందరికీ కెమిస్ట్రీ కుదిరింది. కంటెంట్ పరంగానూ పెద్దగా మార్పుల్లేవు. మా పాత్రలు అన్నీ ఒక్కటే. మేం చిరంజీవులం. మాకు తెలియకుండా మధ్యలో పదిహేనేళ్లు గడిచాయి. మేం మర్చిపోయినా ప్రజలు అమృతాన్ని మర్చిపోలేదు’’ అన్నారు.