సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 16 జూన్ 2020 (14:13 IST)

భారత్ - చైనా సరిహద్దుల్లో కాల్పులు: సైనికాధికారి సహా ముగ్గురు భారత జవాన్ల మృతి

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గాల్వన్ వ్యాలీ సరిహద్దు నుంచి సైనికుల ఉపసంహరణ సమయంలో ఈ ఘర్షణ జరిగినట్లు భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది.

 
భారత్ - చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగిందని.. ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని భారత సైన్యం పేర్కొంది. ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఒక అధికారితో పాటు ఇద్దరు జవాన్లు చనిపోయారని చెప్పింది.

 
చైనాతో ఘర్షణలో తమ సైనికులు చనిపోయారని భారత సైన్యం చెప్పటం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖను ప్రశ్నించగా.. భారతదేశం ఏకపక్ష చర్యలు చేపట్టరాదని, ఇబ్బందులను పెంచరాదని చైనా స్పందించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

 
అయితే.. చైనా సైన్యం వైపు ఎంతమంది సైనికులు చనిపోయారని కానీ గాయపడ్డారని కానీ స్పష్టమైన సమాచారం ఏదీ లేదు. భారత సైన్యం సరిహద్దు దాటి వచ్చిందని.. చైనా సైనికుల మీద దాడి చేసిందని చైనా ఆరోపించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది.

 
భారత సైన్యం ప్రధాన కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం.. ఇరు దేశాల సైన్యాలకు చెందిన సీనియర్ అధికారులు ఘర్షణ జరిగిన ప్రాంతంలో సమావేశమై సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నారు.

 
1975 తర్వాత తొలి హింసాత్మక ఘర్షణ
భారత్ - చైనాల మధ్య 1975 తర్వాత.. ప్రాణ నష్టానికి దారితీసిన తొలి హింసాత్మక సంఘటన ఇదేనని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. గాల్వాన్ లోయ ప్రాంతం ఇండియా - చైనాల మధ్య లదాఖ్ సరిహద్దు రేఖ మీద ఉంది.

 
ఈ ప్రాంతంలో చైనా బలగాలు ఇటీవల భారత భూభాగంలోకి ప్రవేశించటంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించటానికి భారత్ - చైనాలు తూర్పు లదాఖ్‌లో చర్చలు జరుపుతున్నాయి. అనేక వారాలుగా సరిహద్దులో ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించిన అనేక ప్రాంతాల విషయంలో ఇరు పక్షాల మధ్య.. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సైనిక వర్గాలు చెప్తున్నాయి.