బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (19:24 IST)

ఆంధ్రాలో కరోనా విశ్వరూపం.. దేశంలో నవంబరు నాటికి పీక్ స్టేజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఫలితంగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 294 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అలాగే, 82 మంది డిశ్చార్జి అయ్యారు. 
 
తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 84కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 6152 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,034 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికర అంశాలు వెల్లడించింది. దేశంలో 8 వారాల పాటు కొనసాగిన లాక్డౌన్ కారణంగా కరోనా పతాకస్థాయి ఆలస్యమైందని తెలిపింది. దేశంలో లాక్డౌన్ విధించకపోయుంటే ఈపాటికి కరోనా పతాక స్థాయిలో ఉండేదని పేర్కొంది. 
 
కరోనా కేసుల సంఖ్య పీక్స్‌కు వెళ్లే సమయం లాక్డౌన్ కారణంగా 34 నుంచి 76 రోజుల ఆలస్యమైంది తెలిపింది. తద్వారా నవంబరు నాటికి భారత్‌లో కరోనా విశ్వరూపం చూడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ సమయానికి ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లకు విపరీతమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.