సన్నీలియోని అనుకుని అంతా ఆ 26 ఏళ్ల యువకుడికి ఫోన్లు చేస్తున్నారు. కారణం.. ఓ బాలీవుడ్ సినిమాలో ఆయన ఫోన్ నంబరును సన్నీలియోని ఫోన్ నంబరుగా చెప్పడమే. దీంతో సన్నీ అభిమానులు ఆ నంబరు నిజంగా ఆమెదే అనుకుంటూ తెగ కాల్ చేస్తున్నారు. విపరీతంగా వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నానంటున్నారాయన.
అర్జున్ పాటియాలా అనే బాలీవుడ్ సినిమాలో సన్నీలియోని తాను పోషించిన పాత్రకు సంబంధించిన ఫోన్ నంబరును బయటకు చదువుతుంది. అయితే, ఆ నంబర్ పునీత్ అగర్వాల్ అనే 26 ఏళ్ల యువకుడిది. ఈ సినిమా విడుదలైన జులై 26వ తేదీ నుంచి ప్రతిరోజూ కనీసం 100 మందికిపైగా తనకు ఫోన్ చేస్తున్నారని.. రాత్రుళ్లు నిద్రపోనివ్వడం లేదని, వేకువజామున 4 గంటల వరకు ఫోన్ మోగుతూనే ఉంటోందని పునీత్ చెబుతున్నారు.
ఈ రకంగా రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్న ఆయన దీని బారి నుంచి తప్పించుకోవడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. సినిమాలో తన ఫోన్ నంబరు తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకప్పటి పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోనీ బాలీవుడ్ సినిమాల్లో ప్రవేశించిన తరువాత ఇక్కడా సరస శృంగార సినిమాల్లో నటిస్తూ సెక్స్ సింబల్‌గా నిలిచారు.
దీంతో 'అర్జున్ పాటియాలా' సినిమాలో చెప్పిన నంబర్ నిజంగానే సన్నీ లియోనిదనుకుని దేశంలోని ఎంతో మంది మగవాళ్లు.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా చాలామంది మగవాళ్లు పునీత్‌కు ఫోన్ చేయడంలో ఆశ్చర్యం లేదు. కారణమేదైనా కానీ పునీత్ దీనివల్ల ఇబ్బందిపడుతున్నారు. బీబీసీ హిందీతో దీనిపై మాట్లాడిన ఆయన ''వారు(ఆ సినిమా నిర్మాతలు) ఆ నంబరును తమ సినిమాలో చెప్పేటప్పుడు కనీసం దానికి ఓసారి రింగ్ చేసి ఎవరిదో కనుక్కుని ఉంటే బాగుండేది'' అన్నారు.
అయితే, అర్జున్ పాటియాలా సినిమా దర్శకుడు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. గతవారం ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పునీత్ అగర్వాల్ తన పని తాను చేసుకునే వీలు లేకుండాపోయింది. పనేం ఖర్మ.. తిండి, నిద్ర కూడా లేవు ఆయనకు. పోనీ, ఆ నంబరును వదిలేసుకుందామంటే ఏళ్లుగా వాడుతున్న నంబరు అది. తన వ్యాపారానికి, స్నేహసంబంధాలకు అదే ఆధారం అంటున్నారాయన.
సినిమా విడుదలైన తొలిరోజునే ఓ కాల్ వచ్చిందట పునీత్ నంబర్‌కు. ఫోన్ చేసిన వ్యక్తి సన్నీలియోనితో మాట్లాడాలని అడగడం.. తాను రాంగ్ నంబర్ అని చెప్పినా నమ్మకపోవడం.. ఆ తరువాత అయిదారు కాల్స్ అలాంటివే రావడంతో ఎవరో తెలిసినవారే తనను ఆటపట్టిస్తున్నారనుకున్నారట ఆయన. కానీ, అది అక్కడితో ఆగలేదు. కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్ చేసిన వారంతా సన్నీలియోనితో మాట్లాడాలని అడుగుతుండడంతో పునీత్‌కు ఏం జరుగుతోందో తొలుత అర్థం కాలేదు.
చాలా కాల్స్ తరువాత ఓ కాలర్.. తాను రాంగ్ నంబరు అని చెప్పగానే మరి సినిమాలో ఇదే నంబర్ చెప్పారు కదా అనడంతో పునీత్‌కు విషయం అర్థమైంది. ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన ఆయన ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకు వెళ్లగా వారు కూడా తామేమీ చేయలేమన్నారని.. ఫోన్ చేస్తున్నవారిది నేరం కాదని.. కోర్టును ఆశ్రయించడం మంచిదని వారు సూచించడంతో పునీత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నంబరును సినిమా నుంచి తొలగించాలని అందులో కోరారు.
సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని తానేమీ కోరడం లేదని.. కేవలం సినిమాలో తన నంబరును తొలగించాలని మాత్రమే కోరుతున్నానని పునీత్ అంటున్నారు. స్ట్రీమింగ్ నెట్‌వర్క్స్‌లో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు కూడా అందులో తన నంబరు లేకుండా చూడాలని కోరుతున్నారు.
'తెల్లవారి 8.30 వరకు అంతా బాగానే ఉంటుంది. ఆ తరువాత మొదలవుతోంది. ప్రతి రెండు మూడు నిమిషాలకు ఫోన్ మోగుతూనే ఉంటోంది. దానివల్ల ఇంకే పనిపైనా మనసు లగ్నం చేయలేకపోతున్నాను' అంటున్నారు పునీత్. తనకు వస్తున్న కాల్స్‌లో ఎక్కువగా హరియాణా, పంజాబ్ నుంచి వస్తున్నాయని.. ఇటలీ, దుబాయి, పాకిస్తాన్, ఆస్ట్రేలియా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని పునీత్ చెబుతున్నారు.
న్యూజిలాండ్ నుంచి ఓ వ్యక్తి ప్రతి రోజూ కాల్ చేస్తున్నాడని.. సన్నీ కాదని చెబుతున్నా కూడా వినకుండా వాట్సాప్‌లోనూ మెసేజ్‌లు పెడుతూ.. వీడియో కాల్ చేస్తాను యాక్సెప్ట్ చేయమని కోరుతున్నాడని.. ఆయన ఫొటోలు పంపిస్తూ సన్నీ ఫొటోలు కూడా పంపించాలని కోరుతున్నాడని పునీత్ చెబుతున్నారు.
తన ఫోన్ చేస్తున్నవారిలో ఇద్దరు తప్ప అంతా మగవాళ్లేనని.. ఇద్దరు మహిళలు ఫోన్ చేశారని.. సన్నీ లియోని నంబరు కాదని చెప్పగా కనీసం ఇతర నటులెవరైనా ఉంటే వారితోనైనా మాట్లాడించాలని కోరుతున్నారని పునీత్ చెప్పారు. కొందరైతే.. తాను సన్నీలియోని నంబరు కాదని చెబుతుండడంతో తనను దూషిస్తున్నారని... తానెక్కడుంటానో తెలుసని.. వచ్చి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారని పునీత్ వాపోతున్నారు.
ఈ పరిణామాలు తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. తన స్నేహితులు ఆటపట్టిస్తున్నారని.. దిల్లీ సన్నీలియోని అంటూ వ్యంగంగా మాట్లాడుతూ తనను చూసి సన్నీలియోని హిట్ సాంగ్స్ పాడుతున్నారని పునీత్ అంటున్నారు. ఇప్పటికే ఒక స్థాయి దాటిపోయిందని.. నవ్వులాట కాదని, తాను చాలా ఇబ్బందిపడుతున్నానని పునీత్ అంటున్నారు.
అయితే.. కాల్ చేసేవారితో మాటలు తొందరగా ముగిసేలా తానొక ప్లాన్ చేశానని.. 'సన్నీ ఇప్పుడు స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు' అని చెబుతున్నానని.. త్వరలో ఈ కాల్స్ తాకిడికి ముగింపు పలకాలని కోరుకుంటున్నానని పునీత్ బీబీసీతో చెప్పారు.