శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (15:30 IST)

పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

టీనేజీ అమ్మాయిలను, ముఖ్యంగా 11-13 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లను బెదిరించి, లేదా మోసం చేసి వాళ్ల ఇంట్లోనే వెబ్‌క్యామ్స్, సెల్ ఫోన్ల ముందు 'సెక్సువల్ యాక్ట్స్' చేయించే పద్ధతి అనేక దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఆయా దేశాల్లో ఈ పరిణామం చాలా ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోందని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది.
 
29 దేశాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న 'ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్' తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్నెట్‌లోని కొన్ని వెబ్‌సైట్లలో కనిపిస్తున్న 'సెక్సువల్ సెల్ఫీలు, వీడియోల'లో 80 శాతం మైనర్లకు చెందినవే ఉంటున్నాయి. కేవలం 2019లోనే ఈ సంస్థ మైనర్లకు చెందిన అలాంటి 37వేలకు పైగా ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో గుర్తించి ఫిర్యాదు చేసింది. 2018తో పోలిస్తే ఈ 'పీడోఫిలియా' కేసులు 26 శాతం పెరిగినట్లు ఐడబ్ల్యుఎఫ్ తెలిపింది.
 
అనేక దేశాల్లో ఈ పరిణామం తీవ్రంగా పెరుగుతోంది, ముఖ్యంగా యూకేలో అయితే దీన్ని 'జాతీయ సంక్షోభం'గా పరిగణించి, వెంటనే దీని నివారణకు చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సూసీ హార్‌గ్రీవ్స్ తెలిపారు. ఫొటోలు మాత్రమే కాకుండా మైనర్లు తమ ఇళ్లలోనే సొంతంగా ‘వ్యక్తిగత వీడియోల’ను కూడా చిత్రీకరించుకున్నట్లు హార్‌గ్రీవ్స్ వివరించారు.
 
కొన్ని వీడియోల్లో మైనర్లు.. అపరిచితుల నుంచి వచ్చిన సందేశాలను చదువుతూ, వాటిలో సూచించినట్లుగా కెమెరా ముందు రకరకాల చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మోసపోతున్న మైనర్ల వయసుతో పోలిస్తే, మోసం చేస్తున్న వారి వయసు చాలా ఎక్కువగా ఉంటోందని, మొదట బాగానే ఉంటూ తరువాత అమ్మాయిలపై ఒత్తిడి పెంచుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 
ఇలా మైనర్లపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్న కంటెంట్‌ ఉన్న వెబ్‌సైట్లలో మూడొంతుల ఫొటోలు, వీడియోలను అమ్మాయిలు తమ ఇళ్లలోని గదుల్లోనే తీసుకున్నట్లు ఐడబ్ల్యుఎఫ్ తెలిపింది. 'మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేసి ఈ మైనర్లను సెక్సువల్‌గా వెబ్‌క్యామ్‌లు, సెల్‌ఫోన్ల ముందు తమను తాము చిత్రీకరించుకునేలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు' అని హార్‌గ్రీవ్స్ వివరించారు. మనం ఎదుర్కొంటున్న ఈ కలవరపెట్టే వాస్తవాలపై పోరాడాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు.
 
ఇటీవలి కాలంలో అమ్మాయిలకు ప్రైవసీ పెరగడం, కెమెరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న డివైజ్‌లు వారికి అందుబాటులో ఉండటం అనేది ఈ సమస్య మొదలు కావడానికి మొదటి కారణమని ఐడబ్ల్యుఎఫ్ చెబుతోంది. అందుకే ఆ చర్యలకు పాల్పడుతున్న బాధితుల్లో మైనర్లు ఎక్కువగా ఉంటున్నారని, చాలా సులువుగా లొంగిపోయే ప్రమాదం ఉన్న వయసు అది అని ఆ సంస్థ అంటోంది.
 
చాలాసార్లు మైనర్లు తమను అలా కెమెరా ముందు నటింపజేస్తున్న వ్యక్తికి ఆకర్షితులవుతారని, వారితో ప్రేమలో ఉన్నట్లు కూడా భావిస్తారని, అందుకే వారు చెప్పినట్లు చేస్తూ మోసపోతారని ఐడబ్ల్యూఎఫ్ అంటోంది. 'వాళ్లు ఇంకా శారీరకంగా ఎదిగే దశలో ఉంటారు. తమ చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకునేంత మానసిక పరిపక్వత వారికి ఉండదు' అని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ చెబుతోంది.