సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (20:02 IST)

మహిళలపై అత్యాచారాలకు రవాణా సౌకర్యాలు కొరత కూడా ఒక కారణమా?

యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో గత ఏప్రిల్‌లో వరుస అత్యాచారాలు, హత్యల ఘటనలు వెలుగుచూశాయి. లిఫ్ట్ ఇస్తానంటూ అమ్మాయిలను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన ఓ వ్యక్తి అత్యాచారాలు, హత్యలకు పాల్పడినట్లు పోలీసులు బయటపెట్టారు. ఈ గ్రామం నుంచి చదువుకునేందుకు పక్క ఊళ్లకు వెళ్లే చిన్నారులు 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఎవరైనా తెలిసివారు లిఫ్ట్ ఇస్తే, వారితోపాటు వెళ్తుండేవారు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకుని ఆ నిందితుడు దారుణాలకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

 
ఇటీవల షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన 'దిశ' అత్యాచార కేసు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ కేసులో 27 ఏళ్ల పశు వైద్యురాలిని తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టోల్‌ప్లాజా దగ్గర బాధితురాలు స్కూటీ పార్క్ చేసి, క్యాబ్‌లో గచ్చిబౌలీకి వెళ్లారని.. ఆ స్కూటీకి నిందితులు పంక్చర్ చేసి, ఆమె తిరిగిరాగానే సాయం చేస్తామని నటిస్తూ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

 
ఈ రెండు అత్యాచార ఘటనల్లోనూ ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సరైన ప్రజా రవాణా సదుపాయం లేకపోవడం, దాన్ని నిందితులు అవకాశంగా మార్చుకోవడం. దిశ అత్యాచారం జరిగిన టోల్ ప్లాజా వద్దకు ఇదివరకు బీబీసీ తెలుగు బృందం వెళ్లింది. అక్కడ క్యాబ్‌ల కోసం వేచిచూస్తున్న మహిళలతో మాట్లాడింది. భద్రత ఉన్నట్లు భావిస్తున్నారా? అని వారిని ప్రశ్నించి, అభిప్రాయాలు తెలుసుకుంది.

 
ప్రజా రవాణా సదుపాయం లేకపోవడంతో తాము రోజూ షేరింగ్ క్యాబుల్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. షాద్‌నగర్‌లో ఓ సంస్థలో పనిచేస్తున్న రాజశ్రీ బీబీసీ తెలుగుతో మాట్లాడారు. ఆమె ఇల్లు గచ్చిబౌలీ సమీపంలో ఉంది. 

 
''రోజూ ఈ మార్గంలో వెళ్తుంటా. గచ్చిబౌలీ వెళ్లాలంటే ఈ టోల్ ప్లాజా దాకా వచ్చి, ఇక్కడ షేరింగ్ క్యాబ్ ఎక్కాలి. రూ.60 వరకూ తీసుకుంటారు. గచ్చిబౌలీలో దిగి, అక్కడి నుంచి మరో ఆటోలో ఇంటికి వెళ్తాను. ఒక వేళ బస్సులో వెళ్లాలంటే రెండు బస్సులు మారుతూ రెండు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మొత్తం దూరం క్యాబ్‌లో వెళ్లాలంటే రూ.500-600 ఖర్చవుతుంది. షేరింగ్ క్యాబ్‌లో ఎవరెవరో ఎక్కుతారు కాబట్టి ఇది సురక్షితమని భావించలేం'' అని రాజశ్రీ చెప్పారు.

 
''నేను టెలీకమ్యూనికేషన్స్ రంగంలో పనిచేస్తున్నాను. ఇంతకు ముందు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేదాన్ని. రోజూ మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ మధ్యే నాకు పాప పుట్టింది. ఇకపై అలా ప్రయాణం చేయడం వీలవుతుందా అన్నది తెలియదు. ఒకవేళ ఆఫీసు దగ్గరే ఇల్లు కిరాయికి తీసుకుందామంటే ఖర్చులు పెరుగుతాయి'' అని తనూజ రావు అనే మహిళ చెప్పారు.

 
ప్రజా రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు నేరాల బారిన పడుతున్నట్లు చాలా అధ్యయనాలు సూచించాయి. ప్రపంచబ్యాంకు అభివృద్ధి సూచీల ప్రకారం 'పనిలో మహిళల భాగస్వామ్యం' విషయంలో భారత్ అట్టడుగు నుంచి 12వ స్థానంలో ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా 'పనిలో మహిళల భాగస్వామ్యం' మరింత తగ్గిపోతున్నట్లు చెబుతోంది.

 
2019లో 'పనిలో మహిళల భాగస్వామ్యం' 23.4 శాతంగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) సమాచారం ప్రకారం 2005లో ఇది 32 శాతంగా ఉండేది. మహిళల భాగస్వామ్యం పెంచేందుకు సురక్షితమైన రవాణా సదుపాయాలను కల్పించడం కూడా ముఖ్యమని, ప్రభుత్వాలు ఇందుకోసం సమగ్ర విధానాలను అమలు చేయాలని ఐఎల్‌ఓ బృందంలో ఒకరైన షెర్ వెరిక్ తన నివేదికలో సూచించారు.

 
బహిరంగ ప్రదేశాల్లో ప్రజా రవాణా సదుపాయాల్లో వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తున్న కారణంగా మహిళలు ప్రయాణాలంటే భయపడుతున్నారని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డెవెలప్‌మెంట్ పాలసీ నివేదిక తెలిపింది. వీటికి సంబంధించి ఫిర్యాదులు చేయడం కూడా కష్టంగానే ఉందని అభిప్రాయపడింది.

 
ఐటీ రంగంలోని మహిళా ఉద్యోగులు చాలా వరకూ సంస్థలు అందించే రవాణా సేవలపైనే ఆధారపడుతున్నట్లు 2008లో నాస్కామ్ అధ్యయనం పేర్కొంది. ప్రజా రవాణా వ్యవస్థ కన్నా అవే సురక్షితమైనవని వారు భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇలా ఎన్ని సంస్థలు మహిళా ఉద్యోగులకు రవాణా సేవలు అందించవగలవన్నది అసలు ప్రశ్న. ఉద్యోగాలను, మహిళలను ముడిపెట్టేది ప్రజా రవాణా వ్యవస్థేనని.. కానీ, అది ఏమాత్రం సురక్షితంగా లేదని ఐలా బందగీ అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డెవెలప్‌మెంట్ పాలసీలో ఆమె పరిశోధకురాలు.

 
''భద్రతను ఎంచుకోవాలా, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఎంచుకోవాలా అన్నది తేల్చుకోక తప్పని పరిస్థితిని ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా సదుపాయాలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజారవాణా సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి. సేవలు చవగ్గా లభించాలి. వీధుల్లో వెలుతురు బాగా ఉండాలి. బస్సు కోసమో, ఇంకోదాని కోసమో మహిళలు ఎక్కువ సేపు వేచి చూడాల్సి రాకూడదు. ఇదేమీ విలాసవంతమైన అంశం కాదు. కనీస అవసరం'' అని ఐలా బందగీ అన్నారు.

 
నిర్భయ అత్యాచార ఘటన తర్వాత భారత ప్రభుత్వం రూ.1000 కోట్ల కార్పస్ ఫండ్‌ను ప్రకటించింది. మహిళలు, బాలికల భద్రత, సాధికారత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం వినియోగించే అన్ని బస్సుల్లో జీపీఎస్, అలర్ట్ బటన్‌లను తప్పనిసరి చేయాలని 2015లో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సీసీ కెమెరాలను కూడా తప్పనిసరి చేసింది.

 
2019 జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ పానిక్ బటన్‌ను తప్పనిసరి చేశారు. అయితే, వీటన్నింటి వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని టెక్ యాక్టివస్ట్ శ్రీనివాస్ కొడాలి అంటున్నారు.

 
''ఈ ప్యానిక్ బటన్లు ఎప్పుడో గానీ పనిచేయవు. అసలు అవి పనిచేస్తున్నాయా అని చూసేది ఎవరు? బటన్లు రవాణా శాఖ నియంత్రణలో ఉంటాయి. దానికి స్పందించాల్సింది పోలీసులు. ఇవన్నీ లేని భద్రతను ఉన్నట్లుగా చూపిస్తుంటాయి. బస్సుల లైవ్ ట్రాకింగ్ యాప్‌లు కూడా సరిగ్గా పనిచేయవు'' అని ఆయన అన్నారు.

 
ప్రజా రవాణా వ్యవస్థలను ఆదాయ వనరుగానే ఎక్కువగా చూస్తుంటారు. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు, సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని సీఎం పదేపదే చెప్పారు. సంస్థను మూసేయడం గానీ, ప్రైవేటీకరణ గానీ చేయాల్సి ఉంటుందని అన్నారు.

 
ప్రజా రవాణా వ్యవస్థలోనే మహిళలు భరోసాగా ప్రయాణించవచ్చని ఉష అన్నారు. ఆమె కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ''ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులం కాబట్టి మేం బాధ్యతగా ఉంటాం. మహిళా ప్రయాణికులు కూడా భద్రత ఉందన్న భరోసాతో ఉంటారు'' అని ఆమె అన్నారు.