సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2024 (19:52 IST)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

pigeon
పావురాలకు నగరంలో నివసించడానికి మించిన సుఖం లేదు. నగరాల్లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వీటికి తోడు ఎత్తయిన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు..ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.
 
పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్ కార్పొరేషన్, వాటిని పోషించే వారిపై శిక్షార్హమైన చర్యలను ప్రారంభించింది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతుంది. కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమతుల్యతకు సంకేతం.
 
నగరాలే పౌల్ట్రీ ఫారాలు
నగరాలలో కనిపిస్తున్న పావురాలు చాలావరకు హైబ్రీడ్ పావురాలని బయోడైవర్సిటీలో పీహెచ్‌డీ చేసిన మహేశ్ గైక్వాడ్ అన్నారు. ఆయన పర్యావరణ పరిరక్షణ సంస్థ ‘నిసర్గ జాగర్ ప్రతిష్ఠాన్’ సంస్థ అధ్యక్షుడు. ఆయన్ను గబ్బిలాల డాక్టర్ అని కూడా అంటారు. నిజానికి పావురాలు స్థానిక జాతులేనని గైక్వాడ్ అన్నారు. ఎల్లో‌ లెగ్డ్ గ్రీన్ పావురాన్ని మహారాష్ట్ర రాష్ట్రపక్షిగా ప్రకటించారు. ఇప్పుడు పుణె నగరంలో తెల్ల పావురాలు, గ్రీన్ కలర్ పావురాలు కలిసి పెరుగుతున్నాయని గైక్వాడ్ చెప్పారు. ఆహారం, సమాచారం, ఇళ్లలో పెంచుకోవడానికి పావులను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి.
 
కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ, ఇప్పుడవి మరింత సాధారణ పక్షులుగా మారిపోయాయని గైక్వాడ్ అన్నారు. ఇలా జంతువులకు, మనుషులకు దగ్గరగా మసలుతున్న పావురాల సంఖ్య పెరుగుతోంది. ‘‘ఈ పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి.’’ అని గైక్వాడ్ అన్నారు.
 
నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. నగరాలలోని బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తయిన బిల్డింగ్‌లు పావురాలు బతకడానికి అనుకూలంగా మారాయి. పైగా ప్రజలు వాటికి తిండిగింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగా సంతానోత్పత్తి కూడా సులభమవుతోంది. ‘‘పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే, ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీఫామ్‌గా మారాయి’’అని మహేష్ గైక్వాడ్ చెప్పారు. పావురాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమకంటే చిన్నసైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్నపక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే, అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని గైక్వాడ్ అన్నారు.
 
సహసంబంధాన్ని అధ్యయనం చేయాలి
పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్త, భావతల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అభిజిత్ ఘోర్పడే అన్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్నదానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే, దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా మీద ప్రభావం చూపిస్తుంది. "పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షుల మాదిరిగా కాకుండా, ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడంలాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి’’ అని అభిజిత్ ఘోర్పడే చెప్పారు.
 
ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. "అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజంకాకపోవచ్చు. పట్టణీకరణతోపాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి’’ అని ఘోర్పడే అన్నారు. ఈ రెండింటిలో ఏది ఎంత వరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
మనుషులకు మాలిమి
ధాన్యపు గింజల నుంచి, కేకులు, బిస్కెట్ల వరకు అనేక రకాల ఆహార పదార్ధాలను పావురాలను పెంచేవారు వాటికి అందిస్తుంటారు. దీనివల్ల వాటిలో ఆహారం కోసం మనుషులపై ఆధారపడే తత్వం పెరుగుతుంది. ఇది వాటిల్లోని వేటాడే సహజ గుణాన్ని చంపేస్తోంది. వాటి సంఖ్య విపరీతంగా పెరగడంవల్ల, ఆ ప్రభావం చిన్నజీవుల ఆహారంపై పడి, అంతిమంగా చిన్నజీవుల జనాభా క్షీణతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.